Share News

India Aim for Comeback: గెలిచి.. నిలుస్తారా

ABN , Publish Date - Oct 23 , 2025 | 04:42 AM

తొలి వన్డేలో చిత్తుగా ఓడిన భారత్‌.. ఆస్ట్రేలియాతో సిరీ్‌సను సజీవంగా ఉంచే ప్రయత్నాల్లో కఠోరంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల..

India Aim for Comeback: గెలిచి.. నిలుస్తారా

అడిలైడ్‌: తొలి వన్డేలో చిత్తుగా ఓడిన భారత్‌.. ఆస్ట్రేలియాతో సిరీ్‌సను సజీవంగా ఉంచే ప్రయత్నాల్లో కఠోరంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తో వెనుకబడిన శుభ్‌మన్‌ గిల్‌ సేన.. గురువారం జరిగే రెండో వన్డేలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, కోహ్లీల భవితవ్యం నిర్ణయించే సిరీస్‌గా భావిస్తుండడంతో మరోసారి అందరి దృష్టీ వీరిపైనే నెలకొంది. పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ ఘోరంగా విఫలం కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఆల్‌రౌండర్ల బలంపైనే ఎక్కువగా ఆధారపడ్డ టీమిండియాలో రో-కో చెలరేగితేనే సొంతగడ్డపై ఆసీ్‌సకు దీటుగా బదులివ్వగలదు. రోహిత్‌ కోసం యువ ఆటగాడు జైస్వాల్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. వీటికి హిట్‌మ్యాన్‌ తన బ్యాటుతోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది. మొదటి వన్డేలో వర్షం పలుమార్లు ఆటంకం కలిగించడంతో భారత ఇన్నింగ్స్‌ సాఫీగా సాగలేదు. సిరాజ్‌ నేతృత్వంలోని పేస్‌ విభాగం కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడంతో.. 137 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ అలవోకగా ఛేదించింది. పేస్‌ ఆల్‌రౌండర్‌గా నితీశ్‌ కుమార్‌కు మరిన్ని అవకాశాలివ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. కుల్దీ్‌పకు తుది జట్టులో చోటివ్వాలన్న ఒత్తిడి పెరుగుతున్నా.. పరిస్థితుల దృష్ట్యా అతడు మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆసీస్‌ సిరీ్‌సపై గురిపెట్టింది. ముఖ్యంగా స్టార్క్‌, హాజెల్‌వుడ్‌ తమదైన బౌన్స్‌తో మరోసారి భారత బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాలనుకొంటున్నారు. కెప్టెన్‌ మార్ష్‌, హెడ్‌, ఫిలిప్‌, రెన్‌ షాతో బ్యాటింగ్‌ విభాగం బలంగానే కనిపిస్తోంది. వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం కాగా.. వాతావరణం సాధారణంగా ఉండనుంది.

Updated Date - Oct 23 , 2025 | 04:42 AM