First Wimbledon Title: స్వియటెక్ సూపర్
ABN , Publish Date - Jul 13 , 2025 | 02:47 AM
వింబుల్డన్ మహిళల సింగిల్స్ ట్రోఫీని ఎనిమిదో సీడ్ ఇగా స్వియటెక్ సొంతం చేసుకుంది. శనివారంనాటి ఫైనల్లో పోలెండ్ భామ 6-0, 6-0తో 13వ సీడ్ అమెరికన్ అమందా అనిసిమోవాను చిత్తు చేసింది...
సినర్ X అల్కారజ్
వింబుల్డన్ పురుషుల ఫైనల్ నేడు
రాత్రి 8.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో..

తొలిసారి వింబుల్డన్ టైటిల్ కైవసం
ఏకపక్ష ఫైనల్ విజయంతో చరిత్ర
తేలిపోయిన అనిసిమోవా
వావ్.. స్వియటెక్‌ది ఏం ఆట! క్లే, హార్డ్ కోర్టులపై తప్ప పచ్చిక కోర్టులపై రాణించలేదన్న అపప్రధను పటాపంచలు చేసేలా ఆడింది.. ప్రత్యర్థికి ఒక్కటంటే ఒక్క పాయింటు ఇవ్వకుండా చెలరేగింది..ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌లో చరిత్ర తిరగ రాసింది.. ఫైనల్ మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షం చేసేసి గంటలోపే ముగించింది.. తద్వారా కెరీర్‌లో తొలి ఆల్ ఇంగ్లండ్ టైటిల్‌ను ముద్దాడింది..సెమీఫైనల్లో టాప్ ర్యాంకర్ సబలెంకాపై సంచలన విజయం సాధించిన అమందా అనిసిమోవా తుదిపోరులో పూర్తిగా తేలిపోయింది.
లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్ ట్రోఫీని ఎనిమిదో సీడ్ ఇగా స్వియటెక్ సొంతం చేసుకుంది. శనివారంనాటి ఫైనల్లో పోలెండ్ భామ 6-0, 6-0తో 13వ సీడ్ అమెరికన్ అమందా అనిసిమోవాను చిత్తు చేసింది. ఓపెన్ ఎరాలో వింబుల్డన్ ఫైనల్లో డబుల్ బాగెల్ (ఒక్క గేమూ కోల్పోకుండా మ్యాచ్ గెలవడం) అందుకున్న తొలి క్రీడాకారిణిగా స్వియటెక్ చరిత్ర సృష్టించింది. అలాగే 1911 తర్వాత ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తుదిపోరులో ఈ ఘనత సాధించిన మొదటి క్రీడాకారిణిగా నిలిచింది. ఇక..స్వియటెక్ ఓవరాల్‌గా కెరీర్‌లో ఆరో గ్రాండ్‌స్లామ్ ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు ఆమె నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, ఒకసారి యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచింది. కేవలం 57 నిమిషాల్లో పూర్తయిన మ్యాచ్‌లో 24 ఏళ్ల స్వియటెక్ ధాటికి అనిసిమోవా ఎదురు నిలవలేకపోయింది. తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన 23 ఏళ్ల అనిసిమోవా పూర్తిగా తడబాటుకు లోనైంది. ఏకంగా 28 తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. కాగా, ఇప్పటికే స్వియటెక్ 4సార్లు ఫ్రెంచ్ ఓపెన్ (2020, 2022, 2023, 2024), ఓ యూఎస్ ఓపెన్ (2022) గెలిచింది.
1
వింబుల్డన్ విజేతగా నిలిచిన తొలి పోలెండ్ ప్లేయర్ (మహిళలు, పురుషులు) స్వియటెక్. మోనికా సెలెస్ (1992 లో) తర్వాత ఫైనల్ చేరిన ఆరు గ్రాండ్‌స్లామ్స్‌లోనూ గెలిచిన తొలి క్రీడాకారిణి స్వియటెక్. అలాగే మూడు కోర్టుల (హార్ట్, క్లే, పచ్చిక)పై టైటిళ్లు నెగ్గిన తొలి ప్లేయర్ కూడా.
1
1988 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో నటాషా జ్వెరేవాపై 6-0, 6-0తో స్టెఫీ గ్రాఫ్ గెలిచాక..ఇదే స్కోరుతో మళ్లీ గ్రాండ్‌స్లామ్ తుదిపోరు నెగ్గిన రెండో ప్లేయర్ స్వియటెక్.
100
స్వియటెక్ కెరీర్‌లో 100వ గ్రాండ్‌స్లామ్ గెలుపు ఇది.సెరెనా విలియమ్స్ (116 మ్యాచ్‌లు) తర్వాత అత్యంత వేగంగా (120 మ్యాచ్‌లు) 100 గ్రాండ్‌స్లామ్ విజయాలు సాధించిన ప్లేయర్ స్వియటెక్.
ఇవీ చదవండి:
టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి