ICC T20 Powerplay Rules: టీ20 పవర్‌ప్లే మారింది..
ABN , Publish Date - Jun 28 , 2025 | 04:41 AM
అంతర్జాతీయ టీ20 క్రికెట్ పవర్‌ప్లేలో ఐసీసీ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ప్రస్తుతం తొలి ఆరు ఓవర్లను పవర్‌ప్లేగా పరిగణిస్తుండడం తెలిసిందే. ఇది 20 ఓవర్లలో 30శాతం ఆటగా చెప్పవచ్చు.
ఐసీసీ నిర్ణయం
దుబాయ్: అంతర్జాతీయ టీ20 క్రికెట్ పవర్‌ప్లేలో ఐసీసీ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ప్రస్తుతం తొలి ఆరు ఓవర్లను పవర్‌ప్లేగా పరిగణిస్తుండడం తెలిసిందే. ఇది 20 ఓవర్లలో 30శాతం ఆటగా చెప్పవచ్చు. ఇప్పటివరకు పలు కారణాలరీత్యా మ్యాచ్‌ను కుదిస్తే పవర్‌ప్లే ఓవర్లు రౌండ్‌ఫిగర్‌గా ఉండేవి. ఉదాహరణకు మ్యాచ్‌ను 8 ఓవర్ల చొప్పున ఆడిస్తే 2 ఓవర్ల పవర్‌ప్లే ఉండేది. కానీ ఇప్పుడలా కాకుండా మరింత కచ్చితత్వం కోసం 2.2 ఓవర్ల వరకు ఉంటుంది. ఇది 30 శాతం నిష్పత్తికి దగ్గరగా ఉంటుంది.
కంకషన్: కంకషన్ ప్రొటోకాల్‌లోనూ రెండు మార్పులు చేసింది. పురుషుల టీ20ల్లో ఐదుగురితో కూడిన లైక్ ఫర్ లైక్ రీప్లే్‌సమెంట్ జాబితాను మ్యాచ్ ఆరంభానికి ముందే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే అసోసియేట్ సభ్యదేశాలకు సరిగ్గా అలాంటి ఆటగాళ్లే ఉండడం కష్టం. వారి కోసం కీపర్ గాయపడితే అతడి స్థానంలో బ్యాటర్‌ను ఆడించవచ్చు. అయితే కీపింగ్ కూడా తనే చేయాల్సి ఉంటుంది. ఇక కంకషన్‌కు గురైన ఆటగాళ్లను కనీసం ఏడు రోజులపాటు పర్యవేక్షిస్తారు. ఆ తర్వాతే తిరిగి ఆడేందుకు అనుమతి ఉంటుంది.
వైడ్ బాల్: వైడ్ బాల్ విషయంలోనూ మార్పులు చేయనుంది. ఇప్పటి నుంచి వైడ్‌గా ప్రకటించడానికి ముందు బంతి డెలివరీ సమయానికి బ్యాటర్ కాళ్ల పొజిషన్‌ను అంపైర్లు గమనిస్తారు. అతడు ఆఫ్ సైడ్ వైపు జరుగుతున్నాడా? లేదా? అని పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ రూల్‌ను కొన్నాళ్లపాటు పరీక్షించనున్నారు.