India Archery Team: భారత జట్టుకు చారిత్రక స్వర్ణం
ABN , Publish Date - Sep 08 , 2025 | 05:11 AM
భారత ఆర్చర్లు ప్రపంచ చాంపియన్‌షి్‌పలో అదరగొట్టారు. ఓ స్వర్ణం, రజతంతో రెండు పతకాలు కొల్లగొట్టారు. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు మొట్టమొదటి పసిడి పతకం...
జ్యోతి జోడీకి రజతమే
ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్
గ్వాంగ్జు (దక్షిణ కొరియా): భారత ఆర్చర్లు ప్రపంచ చాంపియన్‌షి్‌పలో అదరగొట్టారు. ఓ స్వర్ణం, రజతంతో రెండు పతకాలు కొల్లగొట్టారు. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు మొట్టమొదటి పసిడి పతకం సాధించడం ఈమారు పోటీల్లో విశేషం. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ/రిషభ్ యాదవ్ ద్వయం.. చివరకు రజత పతకంతో సరిపెట్టుకుంది. మరోవైపు స్వర్ణం, రజతం గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న రిషభ్ రెండు పతకాలతో ‘డబుల్’ సాధించాడు. పురుషుల కాంపౌండ్ టీమ్ ఫైనల్లో రిషభ్ యాదవ్, అమన్ సైనీ, ప్రథమేశ్‌లతో కూడిన భారత త్రయం 235-233 స్కోరు తేడాతో నికోలస్, జీన్ ఫిలిప్, ఫ్రాన్కోయిస్‌లతో కూడిన ఫ్రాన్స్ జట్టును చిత్తుచేసి తొలిసారి ప్రపంచ విజేతగా అవతరించింది. అంతకుముందు జరిగిన మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ/రిషభ్ జోడీ రెండు పాయింట్ల తేడాతో స్వర్ణం చేజార్చుకుంది. టైటిల్ ఫైట్‌లో జ్యోతి/రిషభ్ జంట 155-157తో నెదర్లాండ్స్ ద్వయం మైక్ స్కోల్సర్/సానె డీ లాట్ చేతిలో పరాజయం పాలై రజత పతకానికి పరిమితమైంది. హరియాణాకు చెందిన 22 ఏళ్ల రిషభ్‌కు ప్రపంచ చాంపియన్‌షి్‌పలో పతకం సాధించడం ఇదే మొదటిసారి. ఇక.. విజయవాడకు చెందిన 29 ఏళ్ల జ్యోతి సురేఖకు ఇది తొమ్మిదో ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం. ఆమె ఖాతాలో ఓ స్వర్ణం, ఐదు రజతాలు, మూడు కాంస్యాలున్నాయి. ఇక.. 2017 నుంచి పోడియం ఫినిష్ చేస్తూ వచ్చిన భారత కాంపౌండ్ మహిళల జట్టు ఈమారు అనూహ్యంగా ప్రీక్వార్టర్స్‌లోనే నిష్క్రమించి నిరాశపరిచిన సంగతి తెలిసిందే.