Hyderabad Cricket Association: హెచ్‌సీఏ తాత్కాలిక చీఫ్ దల్జీత్‌పై సీఐడీకి ఫిర్యాదు
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:58 AM
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజు, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్‌పై సీఐడీ చీఫ్ చారు సిన్హాకు ఆ సంఘం మాజీ కార్యవర్గ సభ్యుడు చిట్టి శ్రీధర్ ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తాత్కాలిక అధ్యక్షుడు దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజు, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్‌పై సీఐడీ చీఫ్ చారు సిన్హాకు ఆ సంఘం మాజీ కార్యవర్గ సభ్యుడు చిట్టి శ్రీధర్ ఫిర్యాదు చేశాడు. అమీర్‌పేట సీసీ, ఖాల్సా సీసీ అనే రెండు క్లబ్‌ల తరఫున దల్జిత్ 2018లో సంతకాలు చేసి చెక్‌లు ఇచ్చి, వార్షిక రెన్యువల్ ఫీజును చెల్లించాడని, ఇది మల్టిపుల్ క్లబ్‌ల కిందకు వస్తుందని శ్రీధర్ ఆరోపించాడు. లోథా నిబంధనల ప్రకారం ఒక సభ్యుడు ఒక క్లబ్‌లోనే ఉండాలని, తాత్కాలిక అధ్యక్షుడిగా అతడికి కొనసాగే హక్కు లేదని, తక్షణమే దల్జీత్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇదే ఫిర్యాదును హెచ్‌సీఏ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న రిటైర్డ్ జస్టిస్ నవీన్‌రావు, అంబుడ్స్‌మన్‌కు కూడా ఈమెయిల్ ద్వారా పంపించానని తెలిపారు. బసవరాజు అమీర్‌పేట క్లబ్ నుంచి హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిబంధనలను ఉల్లంఘించారని, అలాగే సునీల్ అగర్వాల్ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా ఉంటూ అతడి కుమారుడు హెచ్‌సీఏ తరఫున ఆడడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని శ్రీధర్ అన్నాడు.