Share News

India Struggles on Turning Wickets: టర్నింగ్‌ వికెట్‌ కావాలా

ABN , Publish Date - Nov 18 , 2025 | 06:00 AM

అనుకున్నదొక్కటి..అయినది ఒక్కటి..అన్నట్టుగా మారింది ఈడెన్‌ గార్డెన్స్‌లో టీమిండియా పరిస్థితి. తొలి టెస్టు కోసం కోరి మరీ తయారు చేయించుకున్న స్పిన్‌ పిచ్‌పై ఆడలేక భారత బ్యాటర్లు ప్రత్యర్థి స్పిన్నర్లకు దాసోహమయ్యారు. ఛేదనలో జట్టు కనీసం వంద పరుగులైనా చేయలేకపోవడం తీవ్రంగా నిరుత్సాహపరిచింది....

India Struggles on Turning Wickets: టర్నింగ్‌ వికెట్‌ కావాలా

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

అనుకున్నదొక్కటి..అయినది ఒక్కటి..అన్నట్టుగా మారింది ఈడెన్‌ గార్డెన్స్‌లో టీమిండియా పరిస్థితి. తొలి టెస్టు కోసం కోరి మరీ తయారు చేయించుకున్న స్పిన్‌ పిచ్‌పై ఆడలేక భారత బ్యాటర్లు ప్రత్యర్థి స్పిన్నర్లకు దాసోహమయ్యారు. ఛేదనలో జట్టు కనీసం వంద పరుగులైనా చేయలేకపోవడం తీవ్రంగా నిరుత్సాహపరిచింది. అస్థిర బౌన్స్‌కు తోడు బంతి ఎటువైపు టర్న్‌ అవుతుందో అర్థం కాక టపటపా వికెట్లు సమర్పించుకున్నారు. వాస్తవానికి 124 పరుగుల లక్ష్యం అసాధ్యమేమీ కాదు. గతంలో స్పిన్నర్లపై ఆధిపత్యం చూపడంలో భారత బ్యాటర్ల తర్వాతే ఎవరైనా అనే పేరుండేది. కానీ ప్రస్తుత ఆటగాళ్లు మాత్రం టర్నింగ్‌ వికెట్‌పై నాణ్యమైన స్పిన్నర్లను ఎదుర్కోలేక బేజారెత్తుతున్నారు. పుజార, రహానె, విరాట్‌ ఇలాంటి పిచ్‌లపై సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచేవారు. నేటితరం బ్యాటర్లు టీ20 మోజులో పడి టెస్టు ఫార్మాట్‌లో ఓపిక, టెక్నిక్‌ను ప్రదర్శించడంలో విఫలమవుతున్నారు. ఈ బలహీనతతోనే గతేడాది న్యూజిలాండ్‌పై భారత జట్టు 0-3తో వైట్‌వాష్‌ అయింది.

ఏం అడుగుతారో..?

సిరీ్‌సలో భాగంగా ఆఖరిదైన రెండో టెస్టును గువాహటిలోని బర్సపార స్టేడియంలో ఆడనున్నారు. భారత కెప్టెన్‌, కోచ్‌ ఇక్కడ తమకు ఎలాంటి పిచ్‌ కావాలని కోరుకుంటున్నారో తెలియాల్సివుంది. ఏరికోరి తయారుచేయించుకున్న ఈడెన్‌ పిచ్‌పై బోల్తాపడిన నేపథ్యంలో గువాహటి పిచ్‌పై ఆసక్తి నెలకొంది. స్వదేశంలో భారత్‌ నిలకడగా విజయాలు సాధించాలంటే బ్యాటర్లు చెలరేగి 300-400 పరుగులైనా స్కోరుబోర్డుపై ఉంచాలి. కానీ ప్రస్తుత జట్టుకు ఇది అసాధ్యంగా మారుతోంది. నిజానికి బుమ్రా, సిరాజ్‌ రూపంలో టీమిండియాకు అత్యుత్తమ పేసర్లున్నారు. ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేయగల సత్తా వీరికుంది. నాలుగో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లు తమ తడాఖా చూపగలిగితే పోటీ సమతూకంతో ఉంటుంది. ఈ రీతిన ముందుకెళితే భారత్‌ స్వదేశంతో పాటు విదేశాల్లోనూ విజయాలు దక్కించుకుంటుంది. ఆసీస్‌, ఇంగ్లండ్‌ ఎక్కువగా బ్యాటింగ్‌ పిచ్‌ల వైపే మొగ్గు చూపుతున్న విషయం గుర్తుంచుకోవాలి. విండీ్‌సతో సిరీస్‌ సందర్భంగా తమ జట్టు టర్నింగ్‌ వికెట్‌లపై కాకుండా బ్యాలెన్సింగ్‌ వికెట్‌పైనే ఆడాలనుకుంటోందని కెప్టెన్‌ గిల్‌ చెప్పాడు. కానీ ఈడెన్‌లో మాత్రం కెప్టెన్‌ మాటలకు వ్యతిరేకంగా జరగడం గమనార్హం.


అతడి స్థానంలో ఎవరు?

మెడ నొప్పితో బాధపడుతున్న కెప్టెన్‌ గిల్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆదివారం రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అతను కోల్‌కతాలోనే జట్టు హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడి విషయంలో రిస్క్‌ తీసుకోవద్దనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. దీంతో రెండో టెస్టులో ఆడేది సందేహంగా మారడంతో తన స్థానంలో సాయి సుదర్శన్‌ లేక దేవ్‌దత్‌ పడిక్కళ్‌లలో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే మాత్రం సాయి సుదర్శన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఒకవేళ దేవ్‌దత్‌ను తీసుకుంటే టాప్‌-5లో రాహుల్‌ మినహా అంతా లెఫ్ట్‌ హ్యాండర్లే అవుతారని, అప్పుడు రోజంతా సైమన్‌ హార్మర్‌ బౌలింగ్‌కు దిగుతాడేమో అని కామెంట్‌ చేశాడు. మరోవైపు బుమ్రా, సిరాజ్‌, షమిలాంటి బౌలర్లను నమ్ముకోవాలని కోచ్‌ గంభీర్‌కు మాజీ కెప్టెన్‌ గంగూలీ సూచించాడు.

Updated Date - Nov 18 , 2025 | 06:00 AM