వచ్చే వరల్డ్‌క్‌పలో రో కోను చూడలేం
ABN , Publish Date - May 14 , 2025 | 04:19 AM
టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతామని చెప్పిన స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ దాకా ఆడకపోవచ్చని టీమిండియా దిగ్గజం...
న్యూఢిల్లీ: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతామని చెప్పిన స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ దాకా ఆడకపోవచ్చని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. ‘ఈ ఏడాది చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్, కోహ్లీ కలిసి జట్టును చాంపియన్‌గా నిలబెట్టారు. కానీ, ఇదే దూకుడైన ఫామ్ మరో రెండేళ్లపాటు కొనసాగుతుందా? అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సెలెక్షన్ కమిటీ వీరిద్దరి ఎంపికకు ఓకే చెబుతుందా.. అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. నిజాయితీగా చెబుతున్నా.. నా అంచనా ప్రకారం వీళ్లిద్దరిని 2027లో జరిగే ప్రపంచక్‌పలో మనం చూడలేం. ఒకవేళ.. అప్పటిదాకా కూడా అద్భుతంగా ఆడుతూ, సెంచరీల మీద సెంచరీలు కొడుతూ ఉంటే, ఆ భగవంతుడు కూడా జట్టు నుంచి వీళ్లను తొలగించలేడు’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక, తనవరకైతే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా సరైన వాడని సన్నీ చెప్పాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..