Last Australia Tour: ఆ ఇద్దరి ఆట చూడాలని..
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:04 AM
భారత క్రికెట్ వెటరన్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకిదే చివరి ఆస్ట్రేలియా పర్యటనగా అంతా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో 19 నుంచి టీమిండియా ఆడే మూడు...
పెర్త్: భారత క్రికెట్ వెటరన్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకిదే చివరి ఆస్ట్రేలియా పర్యటనగా అంతా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో 19 నుంచి టీమిండియా ఆడే మూడు వన్డేల సిరీ్‌సపై అక్కడి ఫ్యాన్స్ అమితాసక్తిని చూపిస్తున్నారు. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రత్యక్షంగా తిలకించాలనే ఉద్దేశంతో టిక్కెట్ల కోసం పోటీపడుతున్నారు. దీంతో ఇప్పటికే ఈ సిరీ్‌సకు సంబంధించి లక్షా 75 వేల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. మరోవైపు ఈ మూడు వన్డేల సిరీస్ కోసం జరిగిన ఫొటో సెషన్‌లో ఆసీస్ నుంచి హెడ్, స్టార్క్ భారత్ నుంచి ధ్రువ్ జురెల్, నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఇక రెండో రోజు శుక్రవారం కూడా భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చారు. ప్రాక్టీస్‌లో భాగంగా వారంతా ఫీల్డింగ్ డ్రిల్స్‌పై దృష్టి సారించారు. రన్నింగ్‌తో పాటు క్యాచ్‌లను సాధన చేశారు. ఇదిలావుండగా.. జట్టులో అపార అనుభవజ్ఞులైన విరాట్, రోహిత్ ఉండడం కొత్త కెప్టెన్ గిల్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అభిప్రాయపడ్డాడు. వారి సూచనలు, సలహాలతో తను నాయకత్వంలో మరింతగా రాటుదేలుతాడని ఆశించాడు. అలాగే డ్రెస్సింగ్ రూమ్‌లో యువ ఆటగాళ్లు కూడా వారి నుంచి చాలా నేర్చుకోవచ్చని తెలిపాడు.

వాళ్లు వరల్డ్‌కప్ ఆడతారు: హెడ్
వన్డే ఫార్మాట్‌లో రోహిత్, కోహ్లీ అద్భుత ఆటగాళ్లని ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కొనియాడాడు. ఈ ఇద్దరిలో విరాట్ అత్యుత్తమమైతే.. రోహిత్ కూడా అతడికి సమీపంలోనే ఉన్నట్టు చెప్పాడు. ‘ఓపెనర్‌గా రోహిత్ తనదైన ముద్ర వేశాడు. అయితే ఆ ఇద్దరూ ఏదో ఒక దశలో ఆట నుంచి తప్పుకోవాల్సిందే. కానీ 2027 వన్డే వరల్డ్‌కప్ ఆడాలనే ప్రయత్నంలో వారున్నారు. నేను కూడా ఆ ఇద్దరు మెగా టోర్నీలో ఆడతారనే ఆశిస్తున్నా’ అని హెడ్ తెలిపాడు.