One Day International: 342 పరుగుల తేడాతో..
ABN , Publish Date - Sep 08 , 2025 | 05:19 AM
జాకబ్ బెథల్ (110), జో రూట్ (100) శతకాలతోపాటు జోఫ్రా ఆర్చర్ (4/18) విజృంభించడంతో.. ఆఖరి, మూడో వన్డేలో ఇంగ్లండ్ 342 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది.
ఇంగ్లండ్ రికార్డు విజయం
బెథల్, రూట్ శతక మోత
మూడో వన్డేలో సౌతాఫ్రికా చిత్తు
విజృంభించిన ఆర్చర్
సౌతాంప్టన్: జాకబ్ బెథల్ (110), జో రూట్ (100) శతకాలతోపాటు జోఫ్రా ఆర్చర్ (4/18) విజృంభించడంతో.. ఆఖరి, మూడో వన్డేలో ఇంగ్లండ్ 342 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. దీంతో వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. 2023లో తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 317 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును ఇంగ్లండ్ బద్దలుకొట్టింది. 2-0తో ఈపాటికే మూడు వన్డేల సిరీ్‌సను కోల్పోయిన ఇంగ్లండ్.. సఫారీలతో నామమాత్రమైన ఆఖరి వన్డేలో అదరగొట్టింది. తొలుత ఇంగ్లండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 414 పరుగులు చేసింది. రూట్, బెథల్ మూడో వికెట్‌కు 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బట్లర్ (62 నాటౌట్), జేమీ స్మిత్ (62) అర్ధ శతకాలతో అదరగొట్టారు. కేశవ్ మహరాజ్, కోర్బిన్ బాష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో సౌతాఫ్రికా 20.5 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. ఆదిల్ రషీద్ 3, బ్రైడన్ కార్స్ 2 వికెట్లు పడగొట్టారు. తొలి పవర్‌ప్లేలోనే ఆర్చర్ దెబ్బకు 24/6తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ సౌతాఫ్రికా కోలుకోలేక పోయింది. టాపార్డర్ బ్యాటర్లు మార్‌క్రమ్ (0), రికెల్టన్ (1), ముల్డర్ (0), మాథ్యూ బ్రిజ్‌టెక్ (4) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. బాష్ (20), కేశవ్ (17) ఘోర పరాభవాన్ని తప్పించే ప్రయత్నం చేశారు. ఇక, వన్డేల్లో ఇంగ్లండ్ 400లకుపైగా స్కోరు చేయడం ఇది ఏడోసారి. ఈ క్రమంలో అత్యధికసార్లు 400కు పైగా స్కోరు చేసిన భారత్ (7)తో కలిసి ఇంగ్లండ్ రెండోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా (8 సార్లు) టాప్‌లో ఉంది.