వదిలేశారు
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:45 AM
తమ టెస్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ నుంచి ఐదు శతకాలు నమోదైనా ఫలితం లేకపోయింది. తొలి నాలుగు రోజులు భారత్ చేతిలోనే ఉన్న మ్యాచ్‌ను చివరి రోజు ఇంగ్లండ్ అద్భుత బ్యాటింగ్‌తో...

తేలిపోయిన భారత బౌలర్లు
371 పరుగులను ఛేదించిన ఇంగ్లండ్
డకెట్ శతకం.. క్రాలే, రూట్ అర్ధసెంచరీలు
తొలి టెస్టులో గిల్ సేన ఓటమి
లీడ్స్: తమ టెస్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత్ నుంచి ఐదు శతకాలు నమోదైనా ఫలితం లేకపోయింది. తొలి నాలుగు రోజులు భారత్ చేతిలోనే ఉన్న మ్యాచ్‌ను చివరి రోజు ఇంగ్లండ్ అద్భుత బ్యాటింగ్‌తో లాగేసుకుంది. 371 పరుగుల ఛేదన కోసం బరిలోకి దిగిన స్టోక్స్ సేన 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అలాగే ఐదు టెస్టుల సిరీ్‌సలో 1-0తో ముందంజ వేసింది. ఓపెనర్ డకెట్ (170 బంతుల్లో 21 ఫోర్లు, 1 సిక్స్‌తో 149) శతకానికి క్రాలే (65), రూట్ (53 నాటౌట్) అర్ధసెంచరీలు తోడు కావడంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 373/5 స్కోరుతో నెగ్గింది. జేమీ స్మిత్ (44 నాటౌట్), స్టోక్స్ (33) సహకారం అందించారు. శార్దూల్, ప్రసిద్ధ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మంగళవారం ఒక్క రోజే ఆతిథ్య జట్టు తమకు కావాల్సిన 350 పరుగులను రాబట్టడం విశేషం. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేయగా, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది.
చెమటోడ్చారు..: 21/0 ఓవర్‌నైట్ స్కోరుతో 371 పరుగుల ఛేదన ఆరంభించిన ఇంగ్లండ్ ఓపెనర్లు డకెట్, క్రాలే భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొన్నారు. తొలి గంట కాస్తఆచితూచి ఆడినా ఆ తర్వాత చెలరేగారు. ముఖ్యంగా డకెట్ దూకుడుగా కనిపించాడు. పేసర్ బుమ్రా మినహా సిరాజ్, ప్రసిద్ధ్, శార్దూల్ లయను అందుకోలేకపోయారు. అటు ఓపెనర్లు బుమ్రాను జాగ్రత్తగా ఆడేస్తూ మిగతా పేసర్ల ఓవర్లలో బౌండరీలతో స్కోరును పెంచారు. దీంతో తొలి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా 96 పరుగులు సాధించింది.
డకెట్ శతకం: లంచ్ బ్రేక్ తర్వాత ఇంగ్లండ్ స్కోరులో మరింత వేగం పెరిగింది. అటు భారత్ సైతం నాలుగు వికెట్లు తీయగలిగింది. డకెట్ చకచకా ఫోర్లు బాదేస్తూ సెంచరీ వైపు సాగాడు. అయితే తను 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను జైస్వాల్ వదిలేశాడు. ఈ టెస్టులో అతడు క్యాచ్‌లు వదిలేయం ఇది నాలుగోసారి. ఆ వెంటనే ఫోర్‌తో డకెట్ కెరీర్‌లో ఆరో శతకం పూర్తి చేశాడు. ఇక 41వ ఓవర్ సమయంలో వర్షం వల్ల 20 నిమిషాలపాటు అంతరాయం కలిగింది. ఆ తర్వాత భారత్ ఎదురుచూపులు ఫలించాయి. దాదాపు మూడు సెషన్ల పాటు విసిగించిన ఓపెనింగ్ జోడీని పేసర్ ప్రసిద్ధ్ విడదీశాడు. చక్కటి అవుట్ స్వింగర్‌తో క్రాలేను అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 188 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. ప్రసిద్ధ్ తన తర్వాతి ఓవర్‌లోనే పోప్ (8)ను బౌల్డ్ చేసి రిలీ్‌ఫనిచ్చాడు. అటు డకెట్ మాత్రం ఎదురుదాడి సాగిస్తూ ప్రసిద్ధ్ ఓవర్‌లో రెండు ఫోర్లు, జడేజా ఓవర్‌లో సిక్సర్‌తో ధాటిని చూపాడు. కానీ 55వ ఓవర్‌లో డకెట్, బ్రూక్ (0)లను వరుస బంతుల్లో వెనక్కి పంపిన శార్దూల్ గట్టి ఝలక్ ఇచ్చాడు. 59వ ఓవర్‌లో వర్షం రెండోసారి అంతరాయం కలిగించడంతో అంపైర్లు టీ బ్రేక్‌ను ప్రకటించారు. అప్పటికి ఇంగ్లండ్ విజయానికి 102 పరుగుల దూరంలో ఉంది.
ధనాధన్ ఆటతో: ఆసక్తికరంగా ఆరంభమైన చివరి సెషన్‌లో రూట్-స్టోక్స్ జోడీ అడపాదడపా బౌండరీలతో లక్ష్యం వైపు సాగింది. అటు ప్రసిద్ధ్ ఓవర్‌లో రెండు ఫోర్లతో ఆకట్టుకున్న స్టోక్స్ ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించి జడేజాకు చిక్కాడు. ఇక ఆ తర్వాత రూట్‌కు జత కలిసిన జేమీ స్మిత్ ధనాధన్ ఆటతీరుతో విజయాన్ని ఖాయం చేశాడు. కొత్త బంతిని తీసుకున్నాక మరింత చెలరేగిన తను 82వ ఓవర్‌లో 4,6,6తో 18 పరుగులు సాధించి మ్యాచ్‌ను ముగించాడు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 471;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465;
భారత్ రెండో ఇన్నింగ్స్: 364
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: క్రాలే (సి) రాహుల్ (బి) ప్రసిద్ధ్ 65; డకెట్ (సి సబ్) నితీశ్ (బి) శార్దూల్ 149; పోప్ (బి) ప్రసిద్ధ్ 8; రూట్ (నాటౌట్) 53; బ్రూక్ (సి) పంత్ (బి) శార్దూల్ 0; స్టోక్స్ (సి) గిల్ (బి) జడేజా 33; స్మిత్ (నాటౌట్) 44; ఎక్స్‌ట్రాలు: 21; మొత్తం: 82 ఓవర్లలో 373/5. వికెట్ల పతనం: 1-188, 2-206, 3-253, 4-253, 5-302. బౌలింగ్: బుమ్రా 19-3-57-0; సిరాజ్ 14-1-51-0; జడేజా 24-1-104-1; ప్రసిద్ధ్ 15-0-92-2; శార్దూల్ 10-0-51-2.
1
భారత్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో తొలి వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (188) నమోదు చేసిన ఇంగ్లండ్ జోడీగా డకెట్-క్రాలే.
1
తొలి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల దగ్గర అవుటై, రెండో ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డకౌట్ అయిన తొలి బ్యాటర్‌గా హ్యారీ బ్రూక్.
1
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన టెస్టుల్లో ఎక్కువ పరుగులు (1673) నమోదు కావడం ఇదే తొలిసారి.
2
ఇంగ్లండ్ టెస్టు చరిత్రలోనే ఇది రెండో అత్యధిక ఛేదన. గతంలో అత్యధికంగా భారత్‌పైనే 378 రన్స్‌ను ఛేదించింది.
3
ఓ టెస్టు నాలుగు ఇన్నింగ్స్‌లో 350+ స్కోర్లు నమోదు కావడం ఇది మూడోసారి.
ఇవీ చదవండి:
గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు!
లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న దూబె
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి