Online Gaming Law Forces: స్పాన్సర్‌షిప్ నుంచి డ్రీమ్ 11 అవుట్
ABN , Publish Date - Aug 26 , 2025 | 02:17 AM
భారత క్రికెటర్ల జెర్సీలపై ఇక నుంచి డ్రీమ్-11 లోగో కనిపించదు. టీమిండియా ప్రధాన స్పాన్సరర్‌గా కొనసాగుతున్న ఈ ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్-నియంత్రణ...
రూ.358 కోట్ల ఒప్పందం రద్దు
మరో కంపెనీ వేటలో బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల జెర్సీలపై ఇక నుంచి డ్రీమ్-11 లోగో కనిపించదు. టీమిండియా ప్రధాన స్పాన్సరర్‌గా కొనసాగుతున్న ఈ ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్-నియంత్రణ బిల్లు రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. దీంతో డ్రీమ్ స్పోర్ట్స్ కంపెనీ తమ ఒప్పందం నుంచి వైదొలిగింది. ఈ విషయాన్ని అటు బీసీసీఐ కూడా ధృవీకరించింది. 2023లో మూడేళ్ల కాలానికి డ్రీమ్-11తో బోర్డు రూ.358 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే డ్రీమ్-11 ఇలా మధ్యలోనే తమ స్పాన్సర్‌షి్‌పను రద్దు చేసుకున్నా బీసీసీఐ జరిమానా విధించే అవకాశం లేదు. ఎందుకంటే నిబంధన ప్రకారం.. కంపెనీ ప్రధాన వ్యాపారాన్ని ఏదైనా ప్రభుత్వ చట్టం ప్రభావితం చేస్తే స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలిగినా నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మరోవైపు వచ్చేనెల 9 నుంచి ఆసియాకప్ జరగనున్న తరుణంలో ఈ పరిణామం బీసీసీఐని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే డ్రీమ్ 11 లోగోలతో కూడిన ఆటగాళ్ల జెర్సీలు కూడా సిద్ధమయ్యాయి. కానీ వాటిని ఉపయోగించడానికి లేదు. ఈ టోర్నీకి స్పాన్సర్‌లు లేకుండానే జట్టు వెళ్తుందా? లేక మరో 15 రోజుల్లోనే బోర్డు కొత్త స్పాన్సర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటుందా? అనేది తేలాలి. మరోవైపు టొయోటా కంపెనీ స్పాన్సర్‌షి్‌పపై ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.