Dhruv Jurel Earns Test Squad: జురెల్‌కు బెర్త్ ఖరారే
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:37 AM
దక్షిణాఫ్రికాతో జరుగబోయే రెండు టెస్టుల సిరీ్‌సకు ముందు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఫామ్‌ను చాటుకున్నాడు. దక్షిణాఫ్రికా...
నితీశ్ చోటుకు ఎసరు
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగబోయే రెండు టెస్టుల సిరీ్‌సకు ముందు వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఫామ్‌ను చాటుకున్నాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన రెండో అనధికార టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌లోనూ అజేయ శతకాలతో ఆకట్టుకున్నాడు. దీంతో ఈనెల 14 నుంచి జరిగే తొలి టెస్టులో అతడికి తుది జట్టులో చోటు ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. గతంలో పంత్ గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటనలో ఐదో టెస్టు, విండీ్‌సతో రెండు టెస్టులకు జురెన్ ప్రధాన కీపర్‌గా వ్యవహరించాడు. అయితే పంత్ ఇప్పుడు గాయం నుంచి కోలుకుని టెస్టు జట్టులో వైస్‌కెప్టెన్ హోదాలో ఉన్నాడు. కాబట్టి కీపర్‌గా పంత్ కొనసాగడం ఖాయమే. అయితే ఫామ్‌లో ఉన్న జురెల్‌ను ఎక్కడ ఆడించాలనేది కోచ్ గంభీర్‌కు సవాల్ కానుంది. దేశవాళీ సీజన్ ఆరంభమైనప్పటి నుంచి అతడి చివరి 8 ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్‌ల్లో 631 రన్స్ సాధించాడు. ఈనేపథ్యంలో జురెల్‌ను బెంచీకే పరిమితం చేస్తే విమర్శలు తప్పవు.
ఎవరి స్థానానికి ఎసరు?
తొలి టెస్టులో జురెల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా బరిలోకి దించితే ఎవరి స్థానంలో ఆడతాడనేది చర్చనీయాంశమవుతోంది. ఇందుకు వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుంది. అయితే చివరి టెస్టులో సాయి హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక మిగిలింది నితీశ్ కుమార్ చోటే. స్వదేశీ పిచ్‌లపై అతడి బౌలింగ్ జట్టుకు పెద్దగా అవసరం పడకపోవచ్చు. అలాగే జురెల్ ఫామ్‌తో పోలిస్తే నితీశ్‌ను తుది జట్టులోకి తీసుకుని ఆడించడం కష్టమే. దీనికి తోడు నితీశ్ గతనెలలో విండీ్‌సతో జరిగిన తొలి టెస్టులో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశాడు. ఇక రెండో టెస్టులో బ్యాటింగ్‌లో 43 పరుగులు చేసినా.. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నితీశ్ స్థానంలో జురెల్‌ను ఆడించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే 1986లో కిరణ్ మోరే, చంద్రకాంత్ పండిట్‌ల తర్వాత భారత తుది జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ కీపర్లు బరిలోకి దిగినట్టవుతుంది.
ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి?
రెండో అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ విధించిన 417 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ‘ఎ’ ఛేదించడం భారత టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేసింది. సిరాజ్, ఆకాశ్, ప్రసిద్ధ్, కుల్దీ్‌పలాంటి బౌలర్లను దీటుగా ఎదుర్కొని భారీ ఛేదనను పూర్తి చేయడంతో బౌలింగ్ లైన్‌పపై కోచ్ దృష్టి సారించాడు. ప్రధాన పేసర్లుగా జస్ర్పీత్ బుమ్రా, సిరాజ్‌లు ఆడడం దాదాపు ఖాయమే. ఇక బ్యాటర్‌గా జురెల్‌ను తీసుకుంటే ముగ్గురు స్పిన్నర్లు జడేజా, సుందర్, కుల్దీప్ తుది జట్టులో ఉంటారు.