Share News

Womens Premier League: దీప్తి ధమాకా

ABN , Publish Date - Nov 28 , 2025 | 06:28 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) నాలుగో సీజన్‌ కోసం గురువారం అట్టహాసంగా మెగా వేలం జరిగింది. స్టార్‌ ఆటగాళ్లతో పాటు అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ల కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. 73 స్లాట్లకు జరిగిన వేలం...

Womens Premier League: దీప్తి ధమాకా

రూ.3.20 కోట్లకు యూపీ కొనుగోలు

రూ.3 కోట్లతో ముంబైకి అమేలీ కెర్‌

  • అలీసా హీలీకి నిరాశ

  • మహిళల ప్రీమియర్‌ లీగ్‌ వేలం

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) నాలుగో సీజన్‌ కోసం గురువారం అట్టహాసంగా మెగా వేలం జరిగింది. స్టార్‌ ఆటగాళ్లతో పాటు అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ల కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. 73 స్లాట్లకు జరిగిన వేలం కోసం 277 మంది రిజిష్టర్‌ చేసుకున్నారు. ఎక్కువగా విదేశీ ఆటగాళ్లవైపు ఆయా జట్లు మొగ్గు చూపినా.. ఈసారి వేలంలో అత్యధిక ధర మాత్రం భారత క్రికెటర్‌దే కావడం విశేషం. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మకు జాక్‌పాట్‌ తగిలింది. వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి జట్టును విజేతగా నిలిపిన దీప్తి ఏకంగా రూ.3.20 కోట్ల ధర పలికింది. ఈ ఏడాది యూపీ వారియర్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించిన దీప్తిని తొలుత ఆ జట్టు రిటైన్‌ చేసుకోలేదు. కానీ రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ద్వారా రికార్డు ధరతో తిరిగి యూపీనే సొంతం చేసుకుంది.

వాస్తవానికి కనీస ధర రూ.50 లక్షలకే దీప్తిని ఢిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకోగా, ఏ జట్టూ పోటీ పడలేదు. అయితే గతంలో తమ జట్టు తరఫున ఆడిన ప్లేయర్లను తిరిగి సొంతం చేసుకునే ఆర్‌టీఎంను ఉపయోగించాలని యూపీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇదే అదనుగా డీసీ తమ బిడ్‌ను ఏకంగా రూ.3.20 కోట్లకు పెంచగా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా యూపీ ఓకే చెప్పి దీప్తిని సొంతం చేసుకుంది. మరోవైపు డబ్ల్యూపీఎల్‌లో స్మృతి మంధాన (రూ.3.40 కోట్లు, ఆర్‌సీబీ) తర్వాత అత్యధిక ధర పలికిన రెండో భారత ప్లేయర్‌గా దీప్తి నిలిచింది. ఇదిలావుండగా వేలంలో అందరికంటే ఎక్కువగా రూ.14.50 కోట్ల పర్స్‌తో యూపీ వారియర్స్‌ అడుగుపెట్టింది. దీంతో సహజంగానే మిగతా జట్లతో పోలిస్తే వీరి హడావిడి ఎక్కువగా కనిపించింది. వేలంలో అందరికంటే పిన్న వయస్కురాలిగా 16 ఏళ్ల దియా యాదవ్‌ (రూ.10 లక్షలు, ఢిల్లీ) నిలిచింది.

విదేశీ ప్లేయర్ల హవా

వేలంలో అన్ని జట్లు కూడా భారత ప్లేయర్లకంటే విదేశీ క్రికెటర్ల వైపు మొగ్గు చూపాయి. ముంబై జట్టు కివీస్‌ ఆల్‌రౌండర్‌ అమేలీ కెర్‌ను రూ.3 కోట్లకు తిరిగి తీసుకుంది. తాజా వేలంలో విదేశీ ఆటగాళ్లలో కెర్‌దే అధిక మొత్తం. 2023, 2025 సీజన్లలో ముంబైని చాంపియన్‌గా నిలపడంలో కెర్‌ది కీలక పాత్ర. అంతేకాకుండా గుజరాత్‌ జెయింట్స్‌ సోఫీ డివైన్‌ను రూ.2 కోట్లకు, మెగ్‌ లానింగ్‌ను యూపీ వారియర్స్‌ రూ.1.90 కోట్లకు తీసుకున్నాయి. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ వోల్వార్ట్‌ రూ.1.10 కోట్లకు డీసీ కొనుగోలు చేయగా.. విండీస్‌ పేసర్‌ చినెల్లె హెన్రీని రూ.1.30 కోట్లకు ఢిల్లీ తీసుకుంది. అలాగే ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ సోఫీ ఎకెల్‌స్టోన్‌ను రూ.80 లక్షలకు ఆర్‌టీఎం ద్వారా యూపీ సొంతం చేసుకుంది. అయితే ఆసీస్‌ కెప్టెన్‌ అలీసా హీలీతో ఈ వేలం ఆరంభం కాగా.. తనను మాత్రం ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడం గమనార్హం.

శిఖాకు అనూహ్య ధర

రూ.40 లక్షల కనీస ధరతో వేలంలో కి అడుగుపెట్టిన 36 ఏళ్ల వెటరన్‌ పేసర్‌ శిఖా పాండే అనూహ్య ధర పలికింది. రెండేళ్ల క్రితం భారత్‌ తరఫున చివరి టీ20 ఆడిన ఆమె కోసం యూపీ, ఆర్‌సీబీ హోరాహోరీగా పోటీపడడం ఆశ్చర్యపరిచింది. చివరికి రూ.2.4 కోట్ల అధిక ధరకు యూపీ దక్కించుకుంది. ఈ వేలంలో ఇది మూడో అత్యధిక ధర. అలాగే భారత్‌ నుంచి ప్రతీకా (రూ.50 లక్షలు), రాజేశ్వరి గైక్వాడ్‌ (రూ.40 లక్షలు), హేమలత (రూ.30 లక్షలు), హర్లీన్‌ (రూ.40 లక్షలు), యాస్తిక (రూ.50 లక్షలు), క్రాంతి గౌడ్‌ (రూ.50 లక్షలు), స్నేహ్‌ రాణా (రూ.50 లక్షలు) బరిలోకి దిగనున్నారు.


జనవరి 9 నుంచి పోటీలు

వచ్చే ఏడాది జనవరి 9 నుంచి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ నాలుగో సీజన్‌ జరుగనుంది. మ్యాచ్‌లన్నీ నవీ ముంబై, వడోదరలో నిర్వహించనున్నారు. సహజంగా ఫిబ్రవరి-మార్చిలో డబ్ల్యూపీఎల్‌ జరుగుతుంటుంది. కానీ ఈసారి స్వదేశంలోనే ఫిబ్రవరి 7 నుంచి పురుషుల టీ20 వరల్డ్‌కప్‌ ఉండడంతో లీగ్‌ను ముందుకు జరిపారు.

9-Sports.jpg

‘సిరి’ చరణి

వేలంలో తెలుగు క్రికెటర్లు కూడా బెర్త్‌ దక్కించుకున్నారు. ముఖ్యంగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో విశేషంగా రాణించిన ఆంధ్ర స్పిన్నర్‌ శ్రీచరణి రూ.1.30 కోట్ల ధర పలకడం విశేషం. తన కనీస ధర రూ.30 లక్షలే అయినప్పటికీ యూపీ వారియర్స్‌తో ఎదురైన తీవ్ర పోటీని అధిగమించి ఢిల్లీ క్యాపిటల్స్‌ తీసుకుంది. గత సీజన్‌లోనూ తను ఢిల్లీకే ఆడింది. ఇక ఇతర తెలుగు క్రికెటర్లలో అరుంధతి రెడ్డిని రూ.75 లక్షలకు ఆర్‌సీబీ, క్రాంతి రెడ్డిని ముంబై రూ.10 లక్షలకు, మడివాల మమతను ఢిల్లీ రూ.10 లక్షలకు, గొంగడి త్రిషను రూ.10 లక్షలకు యూపీ జట్లు తీసుకున్నాయి.

వేలంలో వెలుగులు

పేరు ధర జట్టు

దీప్తి శర్మ రూ.3.20 కోట్లు యూపీ వారియర్స్‌ (ఆర్‌టీఎం)

అమేలీ కెర్‌ రూ.3 కోట్లు ముంబై ఇండియన్స్‌

శిఖా పాండే రూ.2.40 కోట్లు యూపీ వారియర్స్‌

సోఫీ డివైన్‌ రూ.2 కోట్లు గుజరాత్‌ జెయింట్స్‌

మెగ్‌ లానింగ్‌ రూ.1.90 కోట్లు యూపీ వారియర్స్‌

శ్రీచరణి రూ.1.30 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌

చినెల్లె హెన్రీ రూ.1.30 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌

లిచ్‌ఫీల్డ్‌ రూ.1.20 కోట్లు యూపీ వారియర్స్‌

లారా వోల్వార్ట్‌ రూ.1.10 కోట్లు ఢిల్లీ క్యాపిటల్స్‌

ఆశా శోభన రూ.1.10 కోట్లు యూపీ వారియర్స్‌

జార్జియా వేర్‌హామ్‌ రూ.1 కోటి గుజరాత్‌ జెయింట్స్‌


ఇవి కూడా చదవండి:

బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్మృతి కోసమే!

కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ

Updated Date - Nov 28 , 2025 | 08:49 AM