D Gukesh: ఓటమి తట్టుకోలేని కార్ల్‌సన్ రియాక్షన్‌పై గుకేశ్ స్పందన ఇదీ
ABN , Publish Date - Jun 02 , 2025 | 08:01 PM
మ్యాచ్‌లో ఓటమి తరువాత చెస్ ఛాంపియన్ కార్ల్‌సన్ బల్లపై చరిచి అసంతృప్తి వ్యక్తం చేయడంపై మ్యాచ్ విజేత గుకేశ్ స్పందించాడు. తానూ అలా చాలా సార్లు చేశానని అన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: నార్వే చెస్ టోర్నమెంట్‌లో భారత ఛాంపియన్ డి. గుకేశ్ మాజీ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్‌పై అద్భుత విజయం సాధించాడు. ఓటమి అంచున ఆటను మలుపు తిప్పి విజయం సాధించాడు. ఆరో రౌండ్‌లో అద్భుత వ్యూహంతో కార్ల్‌సన్‌ను చిత్తు చేశాడు. అయితే, ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయిన కార్ల్‌సన్ టేబుల్‌పై గట్టిగా చరచడంతో చదరంగం పావులు కొన్ని చెల్లాచెదురుగా పడ్డాయి. గుకేశ్ మాత్రం ఎప్పటిలాగే గంభీరంగా తన విజయాన్ని ఆస్వాదించాడు. కార్ల్‌సన్ షేక్ హ్యాండ్ ఇస్తూ తన చేయి గట్టిగా విదిలించినా కూడా గుకేశ్ తన ప్రత్యర్థి పరిస్థితి అర్థం చేసుకుని హుందాగా వ్యవహరించాడు. గ్రాండ్‌మాస్టర్ అయిన కార్ల్‌సన్‌పై గుకేశ్‌కు ఇది తొలి విజయం. ప్రజ్ఞానంద తరువాత కార్ల్‌సన్‌పై గెలిచిన రెండో భారతీయ ఆటగాడిగా నిలిచాడు.
ఆ తరువాత గుకేశ్ మీడియాతో మాట్లాడాడు. తన విజయంపై స్వల్పం అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘నేను అనుకున్నట్టు జరగలేదు. అయినా ఓకే. ఇదీ విజయమే’ అని కామెంట్ చేశాడు. ఇక ఓటమి తట్టుకోలేక కార్ల్‌సన్ అప్‌సెట్ కావడంపై కూడా గుకేశ్ స్పందించాడు. అతడి ఫ్రస్ట్రేషన్‌ను అర్థం చేసుకోగలనని అన్నాడు. తానూ గతంలో అనేక సార్లు ఇలా టేబుల్స్‌పై గట్టిగా చరిచి అసంతృప్తి వెళ్లగక్కిన విషయాన్ని తెలిపాడు.
అయితే, అంత నిరాశలో కూడా కార్ల్‌సన్ గుకేశ్‌ను అభినందించాడు. తొలుత అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆపై వెళుతూ అతడి భుజాన్ని అభినందనపూర్వకంగా తట్టి వెళ్లాడు. మరోవైపు, ఈ విజయంతో గుకేశ్ కూడా క్షణకాలం ఆశ్చర్యపోయాడు. ఎగసిపడుతున్న భావోద్వేగాన్ని తట్టుకోలేక తన సీటులోంచి లేచి వెళ్లి ఓ పక్కన కొన్ని క్షణాల పాటు నిలబడిపోయాడు.
ఇక మ్యాచ్ సందర్భంగా కార్ల్‌సన్ మొదటి నుంచే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. చివర్లో మాత్రం పట్టు కోల్పోయాడు. ఆరో రౌండ్‌లో గుకేశ్ ఒక్కసారిగా ఆటను మలుపు తిప్పి విజయాన్ని అందుకున్నాడు. నార్వే చెస్-2025 పాయింట్ల పట్టికలో 8.5 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. గుకేశ్ కంటే ఒక పాయింట్ ఎక్కువున్న మాగ్నస్ కార్ల్‌సన్ రెండో స్థానంలో, అమెరికా ప్లేయర్ ఫాబియానో కరూయానా తొలి స్థానంలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
మైదానంలో తోపులాటకు దిగిన బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా క్రీడాకారులు.. షాకింగ్ దృశ్యాలు వైరల్
ఐపీఎల్ చరిత్రలో నెం.1 కెప్టెన్ ఎవరో చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి