Share News

Emerging Teams Clash: మైదానంలో తోపులాటకు దిగిన బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా క్రీడాకారులు.. షాకింగ్ దృశ్యాలు వైరల్

ABN , Publish Date - May 29 , 2025 | 01:28 PM

బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఎమర్జింగ్ టీమ్స్‌కు చెందిన క్రీడాకారులు మైదానంలో పిచ్‌పై నిలబడి ఘర్షణకు దిగిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. క్రీడాకారుల ఘర్షణ చూసి కామెంటేటర్స్ కూడా ఈ గొడవపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Emerging Teams Clash: మైదానంలో తోపులాటకు దిగిన బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా క్రీడాకారులు.. షాకింగ్ దృశ్యాలు వైరల్
South Africa, Bangladesh Emerging Teams Clash

ఇంటర్నెట్ డెస్క్: యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా ఎమర్జింగ్ టీమ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు బాహాబాహీకి దిగారు. వారికి మద్దతుగా ఇరు జట్ల ప్లేయర్లు రంగంలోకి దిగడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఘటనపై మ్యాచ్ రిఫరీ ఇరు దేశాల క్రికెట్ బోర్డులకు త్వరలో నివేదిక సమర్పించనున్నారు.

ఢాకాలో ఇటీవల జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశీ బ్యాటర్ రిపన్ మొండల్, దక్షిణాఫ్రికా బౌలర్ షెపో టులీ మధ్య మొదలైన వాగ్వాదం చూస్తుండగానే పరస్పరం ఘర్షణకు దిగే వరకూ వెళ్లింది. ఆ ఇద్దరూ పిచ్‌ మీదే తగవుకు దిగారు. తొలుత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తగవు పడుతున్న ప్లేయర్లకు మద్దతుగా వారి వారి జట్టు సభ్యులు కూడా రంగంలోకి దిగారు. టూలీ బౌలింగ్‌లో రిపన్ భారీ సిక్స్ కొట్టాక ఇద్దరి మధ్య వివాదం మొదలైనట్టు తెలుస్తోంది.


ఆ తరువాత రిపన్ మరో పక్కకు వెళుతున్న తరుణంలో టులీ అతడి వైపు దూసుకెళ్లాడు. పిచ్ మీదే నిలబడి అతడిని తోసే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ అంపైర్ అడ్డుపడ్డా టులీ వెనక్కు తగ్గలేదు. ఈ ఘటన తరువాత టులీ ఎప్పటిలాగే మరో మూడు బంతులు సంధించాడు. అనంతరం మళ్లి తన చేతిలోని బంతిని రిపన్ వైపు విసరగా అతడు దాన్ని బ్యాట్‌తో మరోవైపు పడేలా కొట్టాడట.

మైదానంలో ఈ దృశ్యాలు చూసి కామెంటేటర్లు కూడా షాకైపోయారు. క్రీడాకారుల మధ్య వాగ్వాదాలు సహజమే కానీ మరీ ఇలాంటి తగవుకు దిగడం తామెప్పుడూ చూడలేదని ఓ వ్యాఖ్యాత తెలిపారు.


ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ఘటనపై దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులకు నివేదికలు సమర్పించనున్నారు. అనంతరం, ఈ ఘర్షణకు బాధ్యులైన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీ ముందున్న అతిపెద్ద సవాలు అదే: స్టీవ్ వా

ఐపీఎల్ చరిత్రలో నెం.1 కెప్టెన్ ఎవరో చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - May 29 , 2025 | 01:47 PM