Share News

Chamundeshwarnath: బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌లో చాముండేశ్వర్‌నాథ్‌

ABN , Publish Date - Oct 17 , 2025 | 04:09 AM

మాజీ క్రికెటర్‌ వంకిన చాముండేశ్వర్‌నాథ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి బీసీసీఐ అత్యున్నత కమిటీలో చోటు లభించింది...

Chamundeshwarnath: బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌లో చాముండేశ్వర్‌నాథ్‌

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్‌ వంకిన చాముండేశ్వర్‌నాథ్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అత్యున్నత కమిటీలో చోటు లభించింది. బోర్డు అపెక్స్‌ కౌన్సిల్‌లో భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) ప్రతినిధిగా చాముండి (66) ఎన్నికయ్యాడు. బుధ, గురువారాల్లో జరిగిన ఆన్‌లైన్‌ ఓటింగ్‌లో చాముండి 672 ఓట్ల భారీ తేడాతో ప్రత్యర్థి రాజేష్‌ వి. జడేజాపై భారీ విజయం సాధించాడు. చాముండికి 755 ఓట్లు పోల్‌కాగా.. జడేజాకు 83 ఓట్లు మాత్రమే లభించాయి. బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచిన చాముండి భారత జట్టు మాజీ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. బీసీసీఐకి సంబంధించిన అత్యున్నత నిర్ణయాలను తీసుకొనే బాడీ అపెక్స్‌ కౌన్సిల్‌. ఇందులో బోర్డు అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, ఇద్దరు ఐసీఏ సభ్యులు, ‘కాగ్‌’, జనరల్‌ బాడీనుంచి ఒక్కొక్కరు...ఇలా 9 మంది ఉంటారు. కాగా ఐసీఏ మహిళా నామినీగా సుధా షా, ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రతినిధిగా శుభాంగి దత్తాత్రేయ కులకర్ణి ఎన్నికయ్యారు. ఇక ఐసీఏ బోర్డు ఎన్నికల్లో చాముండి మినహా అందరి ఎన్నిక ఏకగ్రీవమైంది.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ నుంచి..

రాజమండ్రికి చెందిన చాముండేశ్వ ర్‌నాథ్‌ ఆంధ్ర తరఫున 1978 నుంచి 1992 వరకు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడాడు. 13 మ్యాచ్‌లకు సారథ్యం కూడా వ హించాడు. ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) మాజీ కార్యదర్శి అయిన ఆ యన జాతీయ జూనియర్‌ సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌గానూ పనిచేశాడు. 2009 ఐసీసీ టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టు మేనేజర్‌గా సేవలందించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు.

Updated Date - Oct 17 , 2025 | 04:09 AM