BCCI Revenue: బీసీసీఐ సంపద రూ. 20 వేల కోట్లు
ABN , Publish Date - Sep 08 , 2025 | 05:38 AM
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ.. ఆర్థికంగా మరింత పటిష్టమైంది. కేవలం ఐదేళ్లలోనే రూ. 14,627 కోట్ల మేర తన సంపదను పెంచుకొంది.
ఐదేళ్లలో మూడు రెట్లపైనే పెరిగిన ఆదాయం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ.. ఆర్థికంగా మరింత పటిష్టమైంది. కేవలం ఐదేళ్లలోనే రూ. 14,627 కోట్ల మేర తన సంపదను పెంచుకొంది. మొత్తంగా బోర్డు బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 20,686 కోట్లకు చేరుకొంది. ఈ నెల 28న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ నేపథ్యంలో గడచిన ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్ వివరాలు బయటకు వచ్చాయి. 2019లో బ్యాంక్‌లో ఉన్న నిధులు రూ. 6,059 కోట్లు కాగా.. గత ఐదేళ్లలో ఆ మొత్తం రూ. 20 వేల కోట్లు దాటింది. రాష్ట్ర సంఘాలకు, ఇతరత్రా చెల్లింపులు పోను నికర ఆదాయంగా తేలింది. 2022-23లో బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 16,493 కోట్లు ఉండగా.. ఆ తర్వాతి ఏడాదికి అది రూ. 4,193 కోట్లు అంటే సుమారు 25 శాతం పెరిగి రూ. 20,686 కోట్లకు చేరుకొంది. బయట ఎక్కువ మ్యాచ్‌లు జరగడంతో మీడియా హక్కుల ఆదాయం 67.8 శాతంమేర తగ్గినా.. వివిధ పెట్టుబడుల ద్వారా అదనంగా రూ. 453.4 కోట్ల రెవెన్యూ లభించింది. మొత్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి బోర్డు రూ. 1623 కోట్ల మిగులును నమోదు చేసింది. అంతకుముందు ఏడాది ఇది రూ. 1168 కోట్లుగా ఉంది. ఇన్‌కంట్యాక్స్ కోసం రూ. 3 వేల కోట్లను పక్కనబెట్టింది.