మూడు నగరాల్లోనే మిగిలిన ఐపీఎల్
ABN , Publish Date - May 11 , 2025 | 05:32 AM
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో.. ఐపీఎల్ ఆశలు చిగురించాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే.. ఆగిన లీగ్‌ను వీలైనంత వేగంగా పునఃప్రారంభించేందుకు...

న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో.. ఐపీఎల్ ఆశలు చిగురించాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే.. ఆగిన లీగ్‌ను వీలైనంత వేగంగా పునఃప్రారంభించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తోంది. భద్రతా కారణాల రీత్యా వారంపాటు మెగా లీగ్‌ను వాయిదా వేస్తున్నట్టు బోర్డు శుక్రవారం ప్రకటించింది. దీంతో విదేశీ ప్లేయర్లు స్వదేశాలకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, హఠాత్తుగా ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు తెరపైకి రావడంతో.. ప్లాన్-బితో వెళ్లాలని బీసీసీఐ సమాలోచన చేస్తోంది. ఇదే విషయమై ఆదివారం బోర్డు పెద్దలు చర్చించనున్నారు. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలోని మూడు వేదికలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో మిగిలిన మొత్తం 16 మ్యాచ్‌లు (12 లీగ్, మూడు ప్లేఆఫ్స్‌తో పాటు ఫైనల్) నిర్వహించి లీగ్‌ను పూర్తి చేయాలన్న ఉద్దేశంలో బోర్డు ఉందట. ప్రస్తుతం లీగ్‌లో 57 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అయితే, 58వ మ్యాచ్ అయిన పంజాబ్-ఢిల్లీ మధ్య పోరు 10.1 ఓవర్ల తర్వాత రద్దయింది. కానీ, ఈ మ్యాచ్‌ను మళ్లీ నిర్వహిస్తారా? లేక చెరో పాయింట్ ఇస్తారా? అనేది బోర్డు నుంచి ఎలాంటి స్పష్టతా లేదు.
విదేశీ క్రికెటర్లను రప్పించడం సవాలే
వారంపాటు వాయిదా అని ప్రకటించిన బీసీసీఐ.. పరిస్థితులు చక్కబడకపోతే వచ్చే ఏడాదే లీగ్‌ను నిర్వహిస్తామని అన్ని ఫ్రాంచైజీలకు అంతర్గతంగా సమాచారం అందించిందట. ఈ నేపథ్యంలో పలు ఫ్రాంచైజీలకు చెందిన విదేశీ క్రికెటర్లు తమ స్వస్థలాల బాట పట్టారు. అయితే, ప్రస్తుతం శాంతి చర్చలు అన్న మాట వినిపిస్తుండడంతో వెంటనే మిగతా ఐపీఎల్ మ్యాచ్‌లను కొనసాగిస్తే వెళ్లిన వారిని తిరిగి రప్పించడం ఫ్రాంచైజీలకు సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జూన్ 11 నుంచి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప ఫైనల్ జరగనున్న నేపథ్యంలో ఇరుదేశ ఆటగాళ్లు ఐపీఎల్ కోసం తిరిగి రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐపీఎల్‌ను సస్పెండ్ చేయడంతో.. వివిధ ఫ్రాంచైజీలకు ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు శనివారం స్వదేశాలకు తిరుగు ప్రయాణమయ్యారు. దేశవాళీ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కూడా ఇళ్లకు చేరుకొన్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి.