Share News

Australia Women Cricket: సెమీస్‌లో ఆస్ట్రేలియా

ABN , Publish Date - Oct 17 , 2025 | 04:13 AM

మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా అదరగొడుతోంది. అజేయ ఆటతీరుతో దూసుకెళ్తున్న ఈ జట్టు సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది...

Australia Women Cricket: సెమీస్‌లో ఆస్ట్రేలియా

  • బంగ్లాపై 10 వికెట్లవిజయం హీలీ అజేయ శతకం

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా అదరగొడుతోంది. అజేయ ఆటతీరుతో దూసుకెళ్తున్న ఈ జట్టు సెమీస్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ అలీసా హీలీ (77 బంతుల్లో 20 ఫోర్లతో 113 నాటౌట్‌) వరుసగా రెండో శతకం పూర్తి చేయగా, లిచ్‌ఫీల్డ్‌ (72 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 84 నాటౌట్‌) సహకరించింది. దీంతో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన ఆసీస్‌ 9 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు సాధించింది. శోభన (66 నాటౌట్‌), రుబియా హైదర్‌ (44) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా అందుకోగలిగింది. మహిళల క్రికెట్‌లో ఆసీ్‌సపై బంగ్లా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు శోభనదే కావడం విశేషం. అటు బౌలింగ్‌లో లెగ్‌ స్పిన్నర్‌ అలన కింగ్‌ (10-4-18-2) పొదుపైన బౌలింగ్‌తో అదరగొట్టింది. వేర్హమ్‌, సదర్లాండ్‌, గార్డ్‌నర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఆస్ట్రేలియా 24.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 202 పరుగులతో నెగ్గింది. ఓపెనర్లు హీలీ, లిచ్‌ఫీల్డ్‌ చెలరేగడంతో పవర్‌ప్లేలోనే జట్టు 78 పరుగులు సాధించింది. 67 రన్స్‌ దగ్గర హీలీ సులువైన క్యాచ్‌ను ఫర్గానా వదిలేసింది. ఇక వరల్డ్‌క్‌పలో రెండో ఫాస్టెస్ట్‌ (73 బంతుల్లో) సెంచరీ పూర్తి చేసిన హీలీ ఆ వెంటనే హ్యాట్రిక్‌ ఫోర్లు బాదగా, అటు 25వ ఓవర్‌లో లిచ్‌ఫీల్డ్‌ రెండు వరుస ఫోర్లతో మ్యాచ్‌ను ముగించింది.

Updated Date - Oct 17 , 2025 | 04:13 AM