Australia Clinches Second Consecutive Victory: వహ్‌వా..ఆస్ట్రేలియా
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:03 AM
ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీ్‌సలో ఆతిథ్య ఆస్ట్రేలియా జోరు అలా.. ఇలా లేదు. తొలి టెస్ట్‌లో కేవలం రెండు రోజుల్లో, ఎనిమిది వికెట్లతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కంగారూలు....
రెండో టెస్ట్‌లోనూ ఘన విజయం
ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్
బ్రిస్బేన్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీ్‌సలో ఆతిథ్య ఆస్ట్రేలియా జోరు అలా.. ఇలా లేదు. తొలి టెస్ట్‌లో కేవలం రెండు రోజుల్లో, ఎనిమిది వికెట్లతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కంగారూలు..రెండో టెస్ట్‌లోనూ అంతే తేడాతో ఘన విజయం సాధించారు. ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో 2-0 ఆధిక్యంలో నిలిచారు. కెప్టెన్ బెన్ స్టోక్స్ (50), విల్ జాక్స్ (41) ఇంగ్లండ్ ఓటమిని తప్పించేందుకు తీవ్రంగా పోరాడారు. సగం రోజు, 37 ఓవర్లపాటు ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలిచిన ఆ జోడీ ఏడో వికెట్‌కు విలువైన 96 పరుగులు జోడించింది. కానీ నేసర్ (5/42) వీరిద్దరి వికెట్లను తీయడంతో ఆస్ట్రేలియా విజయం ఖాయమైంది. ఓవర్‌నైట్ 134/6 స్కోరుతో ఆదివారం, నాలుగో రోజు, రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 241 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్మిత్, కీపర్ కేరీ అద్భుతమైన క్యాచ్‌లు అందుకొని జాక్స్, స్టోక్స్ అవుట్‌లో తమవంతు పాత్ర పోషించారు. సూపర్ ఫీల్డింగ్ ఆసీస్ విజయంలో కీలక భూమిక పోషించగా, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఏకంగా ఐదు క్యాచ్‌లను మిస్ చేయడం గమనార్హం. ఇక..65 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 10 ఓవర్లలో 69/2 స్కోరుతో ఛేదించి ఆస్ట్రేలియా విజయం కేతనం ఎగురవేసింది. స్మిత్ (9 బంతుల్లో 23 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 334, ఆస్ట్రేలియా 511 పరుగులు చేశాయి. ఈ టెస్ట్‌లోనూ స్టార్క్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం విశేషం.