Share News

Indian Cricket Team:సెలెక్టర్లకు సవాల్‌

ABN , Publish Date - Aug 18 , 2025 | 05:16 AM

ఆసియా కప్‌నకు భారత జట్టు ఎంపిక సెలెక్టర్లకు కత్తిమీద సాముగా మారింది. రెగ్యులర్‌ టీ20 ఆటగాళ్లతో పాటు యువ స్టార్లు శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మహ్మద్‌ సిరాజ్‌తోపాటు సీనియర్‌ పేసర్‌ బుమ్రా కూడా టోర్నీకి అందుబాటులో ఉండనున్నారు.

Indian Cricket Team:సెలెక్టర్లకు సవాల్‌

  • పోటీలో గిల్‌, జైస్వాల్‌, అయ్యర్‌, సిరాజ్‌

  • క్లిష్టంగా మారిన ఆసియా జట్టు ఎంపిక

న్యూఢిల్లీ: ఆసియా కప్‌నకు భారత జట్టు ఎంపిక సెలెక్టర్లకు కత్తిమీద సాముగా మారింది. రెగ్యులర్‌ టీ20 ఆటగాళ్లతో పాటు యువ స్టార్లు శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, మహ్మద్‌ సిరాజ్‌తోపాటు సీనియర్‌ పేసర్‌ బుమ్రా కూడా టోర్నీకి అందుబాటులో ఉండనున్నారు. వీళ్లంతా ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో వీరిలో ఎవరినీ పక్కనబెట్టే పరిస్థితి లేకపోవడంతో.. సమతూకమైన జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు కఠిన సవాల్‌గా మారింది. జట్టు ఎంపిక కోసం మంగళవారం సెలెక్టర్లు సమావేశమయ్యే అవకాశం ఉంది. వచ్చేనెల 9 నుంచి దుబాయ్‌లో జరిగే ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో రెండు లేదా అంతకుమించి మ్యాచుల్లో టీమిండియా ఆడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికలో ఎలాంటి తేడా వచ్చినా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇటీవల ఇంగ్లండ్‌లో టెస్టు సిరీస్‌లో క్లిష్టమైన పిచ్‌లపై రాణించిన గిల్‌ హఠాత్తుగా పొట్టి ఫార్మాట్‌ రేసులోకి వచ్చాడు. ఆ టూర్‌ నుంచి రాగానే దులీప్‌ ట్రోఫీ ఆడడానికి సిద్ధమవడంతో తాను ఏ ఫార్మాట్‌లోనైనా ఆడడానికి సిద్ధమంటూ బోర్డుకు గిల్‌ సందేశం కూడా పంపాడు. వాస్తవంగా గిల్‌ అంతర్జాతీయ టీ20లు ఆడి ఏడాది దాటింది.


పొట్టి వరల్డ్‌క్‌పలో ట్రావెల్‌ రిజర్వుగా వ్యవహరించాడు. అయితే, సూపర్‌ ఫామ్‌లో ఉన్న గిల్‌ను పక్కనబెట్టే సాహసం సెలెక్టర్లు చేస్తారా? ఒకవేళ అతడిని జట్టులోకి తీసుకోవాలనుకుంటే ఏస్థానంలో ఎంపిక చేయాలనేది పెద్ద ప్రశ్నార్థకం. టీ20ల్లో అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ ఓపెనర్లుగా వ్యవహరిస్తుండగా.. తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌, శివమ్‌ దూబే, రింకూ సింగ్‌, హార్దిక్‌ పాండ్యాతో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. గిల్‌ను తీసుకోవాలంటే వీరిలో ఒకరిపై వేటు వేయాలి. పేసర్‌ సిరాజ్‌ పరిస్థితి కూడా ఇలాంటిదే. ఏడాదికిపైగా టీ20లకు దూరంగా ఉన్నాడు. కానీ, ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో అతడి ప్రదర్శన ఎంతో ఆకట్టుకొంది. అయితే, ఐపీఎల్‌లో పెద్దగా రాణించకపోవడం సిరాజ్‌కు కొంత మైనస్‌గా మారే అవకాశం ఉంది. పొట్టి క్రికెట్‌లో బుమ్రాను ఏమాత్రం పక్కనబెట్టలేని పరిస్థితి. జైస్వాల్‌, శ్రేయాస్‌ అయ్యర్‌ రేసులోనే ఉన్నా.. వారిని జట్టులోకి తీసుకోవడం అంత సులువైన విషయం కాదు.


నేను ఆడతాను!

స్టార్‌ పేసర్‌ బుమ్రా పనిభారంపై రకరకాల ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే, ఆసియా కప్‌నకు తాను అందుబాటులో ఉంటానని భారత క్రికెట్‌ బోర్డుతో పాటు అజిత్‌ అగార్కర్‌ నేృత్వంలోని సెలెక్షన్‌ కమిటీకి బుమ్రా సమాచారం ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్‌ టూర్‌లో బుమ్రా ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బందులు పడ్డాడు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ తర్వాత బుమ్రా మళ్లీ అంతర్జాతీయ వైట్‌బాల్‌ క్రికెట్‌ ఆడలేదు. వెన్నునొప్పితో చాంపియన్స్‌ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. అయితే, బుమ్రా రాకతో భారత బౌలింగ్‌ మరింత బలంగా మారుతుంది. కాగా, దుబాయ్‌ పరిస్థితులకు అలవాటు పడటానికి టోర్నీకి కొన్ని రోజుల ముందే టీమిండియాను అక్కడి పంపాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలిసింది.

Untitled-1 copy.jpg


10 సెకన్లకు రూ. 14 లక్షలు

ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ తలపడుతుండడంతో టోర్నీకి మరింత క్రేజ్‌ పెరిగింది. దీంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టోర్నీ ప్రసార హక్కులు దక్కించుకొన్న సోనీ నెట్‌వర్క్‌ భావిస్తోంది. ఇదే అదనుగా.. టోర్నీలో ప్రకటనల రేట్లను కూడా భారీగా పెంచినట్లు తెలుస్తోంది. టోర్నీలో భారత్‌ ఆడే మ్యాచ్‌ల సమయంలో కేవలం పది సెకన్ల ప్రకటనకు రూ. 14 నుంచి 16 లక్షలు ధర నిర్ణయించినట్టు సమాచారం. ఇదే ధర ఇండో-పాక్‌ మ్యాచ్‌లకు కూడా వర్తిస్తుందని ప్రకటనలు ఇచ్చే సంస్థలకు వెల్లడించిందట.

Updated Date - Aug 18 , 2025 | 05:18 AM