Share News

Arjun Erigaisi: అర్జున్‌ అద్వితీయం

ABN , Publish Date - Dec 31 , 2025 | 03:56 AM

మృదుస్వభావి అయిన అర్జున్‌.. చదరంగం బోర్డుపై మాత్రం దూకుడే మంత్రంగా చెలరేగుతాడు. గత పరాజయాల అనుభవంతో ఈసారి ప్రపంచ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో ......

Arjun Erigaisi: అర్జున్‌  అద్వితీయం

  • ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌షి్‌పలోనూ కాంస్యం

  • ఒకే టోర్నీలో రెండు పతకాలతో చరిత్ర

  • ఆనంద్‌ తర్వాత ఈ ఘనత సాధించిన భారతీయుడిగా రికార్డు

  • మృదుస్వభావి అయిన అర్జున్‌.. చదరంగం బోర్డుపై మాత్రం దూకుడే మంత్రంగా చెలరేగుతాడు. గత పరాజయాల అనుభవంతో ఈసారి ప్రపంచ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో టైటిళ్లే లక్ష్యంగా బరిలోకి దిగాడు. అద్భుతమైన వ్యూహాలతో ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ, ఎత్తులకు పైఎత్తులు వేస్తూ టైటిళ్లకు చేరువగా వెళ్లి, చివరికి కాంస్య పతకాలతో మురిపించాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా అర్జున్‌ చరిత్ర సృష్టించాడు.

దోహా: ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌ప టైటిల్‌ను సొంతం చేసుకోవడానికి తెలుగుతేజం ఇరిగేసి అర్జున్‌ వీరోచిత పోరాటం చేసి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. రెండ్రోజుల కిందట దిగ్గజ చెస్‌ క్రీడాకారుడు విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పలో పతకం సాధించిన భారతీయుడిగా ఖ్యాతి గడించిన ఈ ఓరుగల్లు జీఎం.. మంగళవారం జరిగిన బ్లిట్జ్‌ సెమీఫైనల్‌లో హాట్‌ఫేవరెట్‌గా బరిలోకి దిగి అనూహ్యంగా పరాజయం పాలయ్యాడు. వరల్డ్‌ నెంబర్‌ వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) ఓపెన్‌లో విజేతగా నిలిచి, రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి టైటిల్‌ను కైవసం చేసుకోగా, అబ్దుసత్తోరోవ్‌ నోడిర్బెక్‌ (ఉజ్బెకిస్థాన్‌) రజతంతో సరిపెట్టుకున్నాడు. మహిళల విభాగంలో కజకిస్థాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ అసుబయేవా బిబిసార టైటిల్‌ దక్కించుకోగా, ఉక్రెయిన్‌ జీఎం ముజిచుక్‌ అన్నా రజతంతో మెరిసింది. ర్యాపిడ్‌లో కాంస్యం సాధించిన కోనేరు హంపి, బ్లిట్జ్‌లో మాత్రం 9.5 పాయింట్లతో 23వ స్థానంలో నిలిచి నిరాశపర్చింది. ఇక, లీగ్‌ దశ పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన అర్జున్‌కు నాలుగో స్థానంలో నిలిచిన అబ్దుసత్తోరోవ్‌ నోడిర్బెక్‌ (ఉజ్బెకిస్థాన్‌)తో సెమీస్‌ పోరు జరిగింది. ఇందులో తెలుగు జీఎం అర్జున్‌ 0.5-2.5తో నోడిర్బెక్‌ చేతిలో ఓడి నిరాశపర్చాడు. నాలుగు గేమ్‌ల సెమీఫైనల్‌లో అర్జున్‌ తొలి రెండు గేమ్‌ల్లో ఓడిపోగా, మూడో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. మొదటి గేమ్‌ను 47వ ఎత్తులో, రెండో గేమ్‌ను 83 ఎత్తుల్లో కోల్పోయిన అర్జున్‌ మూడో గేమ్‌ను 33వ ఎత్తు వద్ద డ్రా చేసుకున్నాడు. అయితే, ఆనంద్‌ తర్వాత ప్రపంచ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ చాంపియన్‌షి్‌పలో పతకాలు నెగ్గిన రెండో భారతీయుడిగా ఘనత సాధించి చరిత్ర సృష్టించాడు.


అర్జున్‌ దూకుడు: గత ఏడాది వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో ఓటమి పాలై, ప్రతిష్ఠాత్మక క్యాండిడేట్స్‌ చెస్‌ పోటీలకు అర్హత సాధించడంలో విఫలమైన అర్జున్‌.. ఆ పరాజయాలను సవాళ్లగా స్వీకరించి బరిలోకి దిగాడు. బ్రిట్జ్‌లోని మొత్తం 19 రౌండ్లలో 15 పాయింట్లతో పట్టికలో అర్జున్‌ అగ్రస్థానంలో నిలిచాడు. తొమ్మిదో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌, పదో రౌండ్‌లో నోడిర్బెక్‌పై నెగ్గిన అర్జున్‌..కరువానాకు ముచ్చెమటలు పట్టించాడు. ఫైనల్‌లో నిరాశపర్చినా దేశానికి రెండు కాంస్య పతకాలు సాధించిన అర్జున్‌ శభాష్‌ అనిపించాడు. ఓపెన్‌ విజేత కార్ల్‌సన్‌కు రూ. 74 లక్షలు, రన్నరప్‌ నోడిర్బెక్‌కు రూ. 53 లక్షలు, మూడోస్థానం లో నిలిచి అర్జున్‌కు రూ. 19 లక్షలు ప్రైజ్‌మనీగా దక్కాయి.

ఓపెన్‌ బ్లిట్జ్‌..హోరాహోరీ

ఓపెన్‌ విభాగం ఫైనల్‌ యుద్ధాన్ని తలపించింది. తొలి గేమ్‌లో ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌పై నోడిర్బెక్‌ విజయం సాధించి, శుభారంభం చేశాడు. రెండో గేమ్‌లో కార్ల్‌సన్‌ లెక్క సరి చేశాడు. ఉత్కంఠభరితంగా జరిగిన మూడో గేమ్‌ను డ్రా చేసుకోవడంతో ఇద్దరు ఫైనలిస్టులు 1.5-1.5తో ఆఖరి రౌండ్‌కు ముందు సమంగా నిలిచారు. నిర్ణయాత్మక ఆఖరి గేమ్‌లో కార్ల్‌సన్‌ 62వ ఎత్తులో విసిరిన పంజాకు నోడిర్బెక్‌ మట్టికరిచాడు. ఈ విజయంతో కార్ల్‌సన్‌ 2.5-1.5తో నోడిర్బెక్‌పై ఫైనల్‌లో నెగ్గి, ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. మహిళల విభాగం ఫైనల్‌లో కజకిస్థాన్‌ గ్రాండ్‌మాస్టర్‌ అసుబయేవా బిబిసార 2.5-1.5తో ఉక్రెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌ ముజిచుక్‌ అన్నాపై నెగ్గి ట్రోఫీను ముద్దాడింది. ఫైనల్‌లో ఇరువురు జీఎంలు హోరాహోరీగా తలపడి తొలి మూడు గేమ్‌లను డ్రా చేసుకోగా, విజేతను నిర్ణయించే ఆఖరి గేమ్‌లో బిబిసార గెలిచి ముజిచుక్‌కు షాకిచ్చింది.

టాప్‌-5లోకి ..

క్లాసికల్‌ విభాగంలో ఈ ఏడాది ఆరంభంలోనే టాప్‌-5లో చోటు సంపాదించిన అర్జున్‌ తాజా ప్రదర్శనతో ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ విభాగంలోనూ కెరీర్‌ ఉత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. ర్యాపిడ్‌లో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి మూడో ర్యాం క్‌ను సొంతం చేసుకున్న అర్జున్‌, బ్లిట్జ్‌లో ఎనిమిది స్థానాలను మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. క్లాసికల్‌లో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, మాగ్నస్‌ కార్ల్‌సన్‌ మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు.

Updated Date - Dec 31 , 2025 | 03:56 AM