AP Govt Honours Cricketer Sricharani: శ్రీచరణికి రూ 2.5 కోట్లు
ABN , Publish Date - Nov 08 , 2025 | 04:20 AM
మహిళల వన్డే ప్రపంచక్‌పలో సత్తాచాటి.. భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించిన తెలుగుతేజం శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది...
వెయ్యి చదరపు గజాల స్థలం
గ్రూప్-1 ఉద్యోగం కూడా..
రాష్ట్ర ప్రభుత్వ నజరానా
అమరావతి (ఆంధ్రజ్యోతి): మహిళల వన్డే ప్రపంచక్‌పలో సత్తాచాటి.. భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించిన తెలుగుతేజం శ్రీచరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెకు రూ.2.5 కోట్ల భారీ నజరానా ప్రకటించారు. దీంతోపాటు ఇల్లు నిర్మించుకునేందుకు కడపలో 1000 చదరపు గజాల స్థలం కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఆమెకు గ్రూప్-1 ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ను శ్రీచరణి మర్యాదపూర్వకంగా కలిసింది. మహిళల వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను వారితో పంచుకుంది. తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా శ్రీచరణి భారత క్రికెటర్లు సంతకాలు చేసిన టీషర్ట్‌ను సీఎంకు అందించింది. ఆమెతోపాటు మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్ కూడా సీఎంతో భేటీ అయింది. అంతకు ముందు గన్నవరం విమానాశ్రయంలో శ్రీచరణికి మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీశ్, శాప్ చైర్మన్ రవినాయుడు స్వాగతం పలికారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి లోకేశ్ శ్రీచరణికి స్వాగతం పలికారు.

కడపలో అపూర్వ స్వాగతం
మహిళా ప్రపంచ కప్ గెలుపొందడంలో కీలక భూమిక పోషించిన నల్లపురెడ్డి శ్రీచరణికి సొంతగడ్డ కడపలో జనం అపూర్వ స్వాగతం పలికారు. హెడ్ పోస్టాఫీస్ సర్కిల్ నుంచి వైఎస్సార్ క్రికెట్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. తొలుత శ్రీచరణి, ఆమె తల్లిదండ్రులు రేణుక, చంద్రశేఖర్‌రెడ్డి, మామ కిశోర్‌రెడ్డిలను గుర్రపు బండిపై ఊరేగించారు. అక్కడి నుంచి కారులో స్టేడియం వద్దకు చేరుకున్నారు. బాణసంచా పేల్చుతూ, పూలవర్షం కురిపిస్తూ ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆ రూ.4లక్షలు సరిపోట్లేదు: షమీ మాజీ భార్య
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి