Akash Choudhary Sets World Record: 8 బంతుల్లో 8 సిక్సర్లు
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:33 AM
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదితే అద్భుతమనుకున్నాం. కానీ మేఘాలయ క్రికెటర్ ఆకాశ్ చౌధరి అంతకు మించి అన్నట్టుగా.. వరుసగా 8 బంతుల్లోనూ సిక్సర్లు బాది వరల్డ్ రికార్డు నెలకొల్పాడు....
11 బంతుల్లో హాఫ్ సెంచరీ
మేఘాలయ క్రికెటర్ ఆకాశ్ వరల్డ్ రికార్డు
అరుణాచల్‌తో రంజీ ప్లేట్ మ్యాచ్
సూరత్: ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదితే అద్భుతమనుకున్నాం. కానీ మేఘాలయ క్రికెటర్ ఆకాశ్ చౌధరి అంతకు మించి అన్నట్టుగా.. వరుసగా 8 బంతుల్లోనూ సిక్సర్లు బాది వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా అతడి దూకుడైన ఆటతీరుకు 11 బంతుల్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ కూడా పూర్తయ్యింది. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఒకేసారి రెండు రికార్డులను నమోదు చేసిన బ్యాటరయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఆకాశ్ మొత్తం 14 బంతుల్లో 8 సిక్సర్లతో 50 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. గతంలో 12 బంతుల్లో లెస్టర్‌షైర్ ఆటగాడు వేన్ వైట్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించాడు. అరుణాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ప్లేట్ మ్యాచ్ రెండో రోజు ఆదివారం ఆటలో ఆకాశ్ ఎనిమిదో నెంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. స్పిన్నర్ లిమార్ దాబి వేసిన ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదగా, ఆ తర్వాత ఓవర్‌లోనూ తొలి రెండు బంతులను బౌండరీకి దాటించి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మేఘాలయ తొలి ఇన్నింగ్స్‌లో 628/6 స్కోరు దగ్గర డిక్లేర్ చేసింది. అటు అరుణాచల్ ప్రదేశ్ 73 పరుగులకే ఆలౌటై.. ఫాలోఆన్‌లోనూ 29/3 స్కోరుతో ఓటమి వైపు పయనిస్తోంది.
ఎవరీ ఆకాశ్?: 2019లో అరంగేట్రం చేసిన 25 ఏళ్ల ఆకాశ్ ఈ మ్యాచ్‌కు ముందు 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 14.37 సగటుతో 503 పరుగులు సాధించగా, ఇందులో రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. పేసర్‌గా రాణించే తను 87 వికెట్లు పడగొట్టాడు. అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో గతంలో సోబర్స్, రవిశాస్త్రి మాత్రమే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల ఫీట్‌ను సాధించారు.