భారత షట్లర్లకు విషమ పరీక్ష!
ABN , Publish Date - Mar 11 , 2025 | 03:06 AM
పేలవ ఫామ్, గాయాలతో ఇబ్బందులు పడుతున్న భారత షట్లర్లకు ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో విషమ పరీక్ష ఎదురుకానుంది. మంగళవారం నుంచి జరిగే మెగా టోర్నీలో...

నేటి నుంచి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్
బరిలో సింధు, ప్రణయ్, సేన్
డబుల్స్‌లో సాత్విక్, గాయత్రి జోడీలు
బర్మింగ్‌హామ్: పేలవ ఫామ్, గాయాలతో ఇబ్బందులు పడుతున్న భారత షట్లర్లకు ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో విషమ పరీక్ష ఎదురుకానుంది. మంగళవారం నుంచి జరిగే మెగా టోర్నీలో డబుల్స్ టాప్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ షెట్టి మినహా మిగతా ప్లేయర్లు అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగడమే అందుకు కారణం. ఈ ఏడాది టోర్నీలో మనోళ్ల ప్రదర్శనపై అంతగా అంచనాలు లేవు. గాయం నుంచి కోలుకొన్న సింధుతోపాటు హెచ్‌ఎ్‌స ప్రణయ్, లక్ష్యసేన్ కూడా ఆకట్టుకోలేక పోతున్నారు. ఇక, సాత్విక్ తన తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్నాడు. తొలి రౌండ్‌లో కిమ్ గా ఉన్ (కొరియా)తో సింధు, రెండో సీడ్ మిన్ యో (సింగపూర్)తో మాళవిక బన్సోడ్ తలపడనున్నారు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో కోకి వతనబె (జపాన్)తో లక్ష్య ఆడనున్నాడు. ఒకవేళ సేన్ నెగ్గితే.. ప్రీ క్వార్టర్స్‌లో మూడో సీడ్ జొనాథన్ క్రిస్టీతో తలపడాల్సి ఉంటుంది. టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో ప్రణయ్ ఆడనున్నాడు. డబుల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన డేనియల్-మ్యాడ్స్ వెస్టర్‌గాడ్స్‌తో ఏడో సీడ్ సాత్విక్-చిరాగ్ జంట, చైనీస్ తైపీ జోడీతో వరల్డ్ నెం. 9 ట్రీసా జాలీ-గాయత్రి జంటలు తలపడనున్నాయి. అశ్విని పొన్నప్ప-తనీషా క్యాస్ట్రో, ప్రియాంక-శ్రుతి మిశ్రా.. మిక్స్‌డ్‌లో రోహన్ కపూర్-రుత్విక శివాని, ధ్రువ్ కపిల-తనీషా, సతీష్-ఆద్య జోడీలు కూడా బరిలో నిలవనున్నాయి.
ప్రైవేట్ జెట్‌లో
ఇంగ్లండ్‌కు సింధు
పీవీ సింధు ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టోర్నమెంట్‌లో ఆడేందుకు ప్రైవేట్ జెట్‌లో అక్కడికి చేరుకుంది. సింధు తన సహాయ సిబ్బందితో కలిసి ఈ జెట్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లింది. ఈ విషయాన్ని సింధునే స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. సింధు జెట్‌లో ఎక్కుతున్న వీడియోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టడంతో వైరల్‌గా మారింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..