NRI: ఏపీ యువకుడి ఇక్కట్లు.. సూపర్ మార్కెట్‌లో ఉద్యోగమనుకుని వెళితే పశువుల కాపరిగా మార్చి..
ABN , Publish Date - Jul 07 , 2025 | 05:08 PM
సూపర్ మార్కెట్‌లో ఉద్యోగమనుకుని వెళ్లిన ఓ నెల్లూరు యువకుడు దళారి మోసం కారణంగా సౌదీలో పశువుల కాపరిగా మారాడు. అతడి పరిస్థితి తెలిసి స్థానిక ఎన్నారైలు ఆదుకోవడంతో అతడు స్వదేశానికి తిరిగొచ్చేందుకు మార్గం సుగమమైంది.
ఆంధ్రజ్యోతి ప్రతినిధి: రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబంలో నూనూగు మీసాల వయస్సులో కొడుకు కష్టపడితేనే ఆ పేద తండ్రికి ఒక ఆసరా. పాత చీరలు కట్టుకునే తల్లికి మరుసటి రోజుపై ఒక ఆశ. ఆ కష్టమేదో ఏ అరబ్బు ఎడారి దేశంలోనైనా పడితే ఒక నాలుగు రియాళ్ళు ఎక్కువ చేతికి వచ్చి పేదరికాన్ని జయించవచ్చనే ఎడారి కలలు కొందరికి సాకారమవుతుండగా మరి కొందరికి దళారుల తీరుతో శాపంగా మారుతున్నాయి.
నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామానికి చెందిన 23 ఏళ్ళ షేఖ్ నజీర్ అనే యువకుడు గ్రామంలో చిల్లరమల్లర పనులు చేసుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండేవాడు. పేదరికం, ఇతర కారణాల వలన కనీసం పదవ తరగతి వరకు కూడా చదవని అతడు కొందరు మధ్యవర్తుల సహాయంతో సూపర్ మార్కెట్‌లో ఉద్యోగం కోసం సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ దక్షిణాదిన ఉన్న బిషా అనే ప్రాంతం నుండి సుమారు 200 కిలో మీటర్ల దూరంలోని ఒక పల్లెటూరిలో పశువుల కాపరిగా మారాడు.
ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రంలో కూలీగా పనులు చేశాడు. సూపర్ మార్కెట్‌లో లేబర్ ఉద్యోగమని వచ్చిన తనకు ఈ పనులు చేతకావడం లేదని చేతులెత్తేశాడు. తాను ఎదుర్కుంటున్న కష్టాలను వివరిస్తూ ఒక వీడియోను తన తల్లిదండ్రులకు పంపించగా అది కాస్తా వైరలయింది. సౌదీలో తెలుగువాళ్ళకు సహాయమందించే తెలుగు ప్రవాసీయుల సంఘం సాటా సెంట్రల్ గురించి తెలుసుకున్న నెల్లూరు జిల్లాలోని అతని కుటుంబం సంఘం ప్రతినిధులు షేఖ్ జానీ బాషా, ముజమ్మీల్, రంజీత్, నరేంద్రలను సంప్రదించింది.

రియాద్ నుండి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు నజీర్ బాషా ఇచ్చిన జీపీయస్ ఆధారంగా జానీ బాషా బృందం ప్రయాణించింది. ఈ క్రమంలో వారి కారు మార్గమధ్యంలో ఇసుక దిబ్బలో దిగబడింది. ఆ తర్వాత వాగు, వంకల తీరానికి చేరాక జీపీయస్ సిగ్నల్ ఆగిపోవడంతో తాము ఆగి ఆ తర్వాత వాగును దాటి కాలినడకన నజీర్ బాషా దగ్గరకు వెళ్ళి స్థానిక సౌదీ నియమాలు, విధానాల గురించి వివరించామని జానీ బాషా బృందం పేర్కొంది. ఏ రకమైన తప్పుడు సమాచారాన్ని వ్యాపించవద్దని అతనికి సూచించింది.
నజీర్ ఉదంతంపై మంగళగిరిలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, న్యూ ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్‌తో పాటు ఏపీ ఎన్నార్టీ సంస్థ ఉన్నతాధికారులు స్పందించారు.
భారతీయ ఎంబసీ చొరవతో సౌదీ ప్రభుత్వ అధికారుల సహాయంతో ఎగ్జిట్ ప్రక్రియను పూర్తి చేసినట్లుగా సాటా సెంట్రల్ ప్రతినిధులు పేర్కొన్నారు. తాము విమాన టిక్కెట్‌ను కూడా సమకూర్చడంతో నజీర్ ఒకటి రెండు రోజులలో స్వదేశానికి తిరిగి వెళ్ళనున్నట్లుగా వారు పేర్కొన్నారు.
ఈ వార్తలు చదవండి:
తానా ముగింపు వేడుకల్లో సమంత జోష్.. అదిరిపోయిన తమన్ సంగీతం
టాంపాలో ఘనంగా ముగిసిన నాట్స్ 8వ తెలుగు సంబరాలు