SATA: వైభవంగా సాటా సెంట్రల్ తెలుగు భాష దినోత్సవ వేడుకలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 09:49 PM
సౌదీ అరేబియాలోని అగ్రగామి తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో వార్షిక కార్యక్రమమైన తెలుగు భాష దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మహిళలు ముందుండి నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీ మహిళలు మరోసారి తమ సత్తాను చూపారు రాజధాని రియాధ్ నగరంలో తెలుగు దినోత్సవ కార్యక్రమం ద్వారా ఆకాశంలో సగం కాదు అధికమని చాటారు.
సౌదీ అరేబియాలోని అగ్రగామి తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా సెంట్రల్ ఇటీవల నిర్వహించిన వార్షిక కార్యక్రమమైన తెలుగు భాష దినోత్సవంలో ఎడారులలో తోటి తెలుగువారిని కష్టకాలంలో ఆదుకోవడానికి భర్తల అండగా ముందుకు నడిచే మహిళలు వినోద, సాంస్కృతిక కార్యక్రమాలలో మాత్రం తామే అగ్రగణ్యులమని నిరూపించారు. సంప్రదాయక పట్టు చీరలు ధరించి అన్నీ తామై సభా కార్యక్రమాన్ని నిర్వహించిన తీరును చూసి అతిథులుగా వచ్చిన సీనియర్ దౌత్యవేత్తలు కూడా అశ్చర్యపోయారు.
సుమారు రెండు వేల మందికి పైగా తెలుగు ప్రవాసీయులు పాల్గొన్న సాటా సెంట్రల్ కార్యక్రమంలో భారతీయ సీనియర్ దౌత్యవేత్తలు వై. సాబీర్, విపుల్ బావా, వివిధ రాష్ట్రాల ప్రవాసీ ప్రముఖులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రవాసీ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రవాసీ వ్యవహారాల ప్రభుత్వ రంగ సంస్థ సి.ఇ.ఓ డాక్టర్ పి.కృష్ణమోహన్, పి-4 పథకం కమిటీ ఉపాధ్యక్షులు సి.కుటుంబరావులు ఆన్‌లైన్ ద్వారా సభికులను ఉద్దేశించి ప్రసంగించారు.

విదేశాలలో కష్టపడి సంపాదించిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా ముఖ్యమని, ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవాసీయులకు పూర్తిగా అండగా నిలుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రవాసీయుల సంక్షేమం, సహాయార్థం ప్రతి జిల్లా కేంద్రంలో పోలీస్ సి.ఐతో, మండల రెవెన్యూ అధికారి స్థాయితో కూడిన అధికారిక బృందాలను ఏర్పాటు చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి వెల్లడించారు.
విదేశాలలో ఉన్న ప్రవాసీయులు అనేక మంది ఉదారంగా సహాయం చేస్తుంటారని, అదే క్రమంలో పి-4లో భాగస్వామ్యం కావాలని స్వర్ణాంధ్ర పి-4 ఫౌండేషన్ ఉపాధ్యక్షులు సి. కుటుంబరావు పిలుపునిచ్చారు. ఈ ఫౌండేషన్‌కు ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షులుగా ఉన్నారు. గత నెలలో విజయవాడలో నిర్వహించిన పి-4 సమావేశంలో సౌదీ అరేబియాకు చెందిన ప్రతినిధి బృందం ప్రత్యేకంగా పాల్గొనగా వీరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు కూడా.
తిరుమల తిరుపతి దేవస్థాన ప్రత్యేక దర్శనాలతో పాటు ప్రవాసీయుల సంక్షేమానికి సంబంధించి ఏపీ ఎన్నార్టీ సంస్థ చేపడుతున్న చర్యలను సి.ఇ.ఓ డాక్టర్ కృష్ణకుమార్ వివరించారు.

కులమతాలకు అతీతంగా భాష ఆధారంగా తెలుగు ప్రవాసీయులందరు ఒక్క చోట భారీ సంఖ్యలో గుమిగూడడం ప్రశంసనీయమని భారతీయ ఎంబసీ కౌన్సిలర్ వై. సాబీర్ అన్నారు. సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాల విషయంలో సాటా సెంట్రల్‌కు భారతీయ ఎంబసీ తోడ్పాటు కొనసాగుతుందని ఆయన అన్నారు.
ప్రవాస భారతీయులందరిలోనూ తెలుగు మహిళలు క్రియాశీలకంగా ఉన్నారని సాంస్కృతిక, విద్యా వ్యవహారాల కార్యదర్శి విపుల్ బావ ప్రశంసించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వివిధ రాష్ట్రాల ప్రవాసీ భారతీయ ప్రముఖులు, హైదరాబాద్ నగర ప్రవాసీ ప్రముఖులందరు కూడా సాటా సెంట్రల్ తెలుగు భాష అభిమానంతో తోటి తెలుగువారితో పాటు భారతీయులకు అందిస్తున్న ఆపన్న హస్తం గురించి ప్రస్తావిస్తూ ప్రశంసించారు. సాటా సెంట్రల్ సేవ విభాగంలోని ముజ్జమ్మీల్ శేఖ్, రంజీత్ చిట్లూరిల నిరంతర సేవానిరతిని కొనియాడారు.

పి-4 పథకం గురించి సత్తిబాబు జానీ బాషా వివరిస్తూ ప్రవాసీయులు ఉత్సాహంగా పాల్గొనవల్సిన అవశ్యకతను నొక్కి చెప్పారు.
అమెరికాలో ఉన్న తెలుగు ప్రవాసీ ప్రముఖుడు, తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధకృష్ణా కూడా వీడియో కాల్ ద్వారా సభికులకు సందేశం ఇచ్చారు.
కష్టాలలో ఉన్న తెలుగు వారిని ఆదుకోవడంలో సాటా సెంట్రల్‌తో కలిసి పని చేసే మొహమ్మద్ ఫారూఖ్, రాంచందర్, సిద్దీఖ్ తువూర్‌లను ఈ సందర్భంగా నిర్వాహకులు శాలువాలు కప్పి సన్మానించారు. రియాధ్‌లోని తెలుగు ప్రవాసీ సంఘం తెలుగు కళా క్షేత్రం అధ్యక్షుడు రేవల్ అంటోనీను కూడా కుటుంబసమేతంగా నిర్వాహకులు సత్కరించారు.

సందర్భానుసారంగా తమ మాటల గారడితో ఉత్సుకతతో ఉషా దుగ్గపు, చేతనా, లక్ష్మీ కాకుమనిలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి సభికులను మంత్ర ముగ్ధులను చేసారు.
హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన చిన్నారులు కార్తీకేయ, మానస్, ముదస్సీర్, ముబ్బషీర్ లు వైకల్యం కారణంగా నిస్సహాయ స్థితిలో కూడా భారతీయ మువ్వన్నెల పతాక గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ప్రదర్శించిన నాటకం ఒక్కసారిగా జాతీయ భావోద్వేగం రగిల్చి అనేక మందికి కన్నీరు తెప్పించింది. కులమత సంకుచిత భావాలకు అతీతంగా జాతీయ భావజాలన్ని వ్యక్తపర్చిన కళాత్మక ప్రదర్శనగా దీన్ని అనేకులు అభివర్ణించారు.
వివిధ క్రీడల పోటీలలో సౌదీ అరేబియా మరియు భారతదేశం జాతీయ స్ధాయి పోటీలలో పాల్గోన్న తెలుగు విద్యార్ధుల ప్రతిభను అభినందిస్తూ వారికి మెమోంటోలు బహుకరించారు. ప్రతిభ పురస్కారాల కార్యక్రమాన్ని నరేంద్ర సమన్వయం చేసారు. సామాజిక సేవకురాలు, వ్యాఖ్యాత చేతన ప్రేమ్‌ల కూతురు వినీతా, సంకల్ప్ కేసరి, సాయి కీర్తనా బడే, సాయి కీర్తికా బడే, శ్రేష్ఠ శ్రీ చెక్కా, రష్మితా కంచాపు, తనీష్ కంచాపు, ఆళ్ళ రేవంత్, కార్తీకేయ లింగమల్లు, పిచ్చిక వెంకట శ్రతిక, హేమ్ నిఖీల్ మరియు చౌలురూ నరసింహా తేజస్‌లకు ఎంబసీ దౌత్యవేత్తలు మెమెంటోలు బహుకరించి సత్కరించారు. అదే విధంగా క్రికెట్‌లో విజయం సాధించిన నజద్ క్రికెట్ క్లబ్ పక్షాన దాని కెప్టెన్ కరీముల్లా దౌత్యవేత్తల నుండి ట్రోఫి స్వీకరించారు. రన్నర్ అప్‌గా నిలిచిన యునైటెడ్ స్టార్స్ కెప్టెన్ నందన్‌ను కూడా సత్కరించారు.
రియాధ్ నగరానికి చెందిన పలువురు తెలుగు నృత్యకారిణులు ఆహ్లాదకర వాతావరణంలో విన సొంపైన సంగీతానికి కనువిందు చేసే రీతిలో నృత్య ప్రదర్శనలిస్తూ ఆకట్టుకున్నారు. నాగ హనీషా తాటికొండ శాస్త్రీయ పద్ధతిలో చేసిన భరతనాట్యం నయన మనోహరంగా సాగింది. సంప్రదాయ నృత్యాలకు తోడుగా మారుతున్న కాలానికి అనుగుణంగా దాసరి భారతీ నేతృత్వంలో గోదా శ్రీ సహాయంతో జరిగిన పాశ్చాత్య దేశాల ఆధునిక నటన కూడా ఆహుతులను ఆకట్టుకుంది. పాటలు లేని తెలుగు సాంస్కృతిక కార్యక్రమాన్ని ఊహించలేం. అందుకు తగినట్లుగా గీతా, శ్రీదేవి, లక్ష్మి మాధవిల ఆధ్వర్యంలో మధుర గానంతో ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. అర్చన శ్రీపాద సారథ్యంలో జరిగిన శాస్త్రీయ నృత్యాలు మనోహారంగా కొనసాగాయి. మిస్ తెలుగు అమ్మాయి అనే కార్యక్రమం కూడా ఆకట్టుకోగా దీన్ని శిల్ప గడ్డం, కవిత కర్రి, ప్రియాంకలు రూపొందించారు. ఇది కేవలం అందాల పోటీ కాదని, ఆడదిలో ఆత్మవిశ్వాసం పెంపొందించే కార్యక్రమమని వారన్నారు.

మొత్తం సాంస్కృతిక కార్యక్రమాలను మార్గదర్శకం చేస్తూ వేదికపై ఏకధాటిగా పది గంటలకు పైగా చురుగ్గా వ్యవహరించి ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన అక్షిత చెన్నుపాటి సభికుల మన్ననలు పొందారు. రమ్య, రజనీలు ఆమెకు తోడ్పాటునందించగా బతుకమ్మలను సునితా ఆషాడపు పేర్చారు. సింధూర, ముబీనాలు కూడా వివిధ కార్యక్రమాల నిర్వహణలో సమన్వయం చేసారు.
సాటా సెంట్రల్ ముఖ్యులు ముజ్జమ్మీల్ శేఖ్, రంజీత్ చిత్తలూరి, ఎర్రన్న దుగ్గపు, సత్తిబాబు చోలంగి, గోవిందరాజు, శేఖ్ జానీ బాషా, యాఖూబ్ ఖాన్, పోకూరీ ఆనంద్, వెంకటరావు, నాగార్జున, ముసెబ్, వంశీ, వినయ్, ఆనందరాజు గుండగోగుల, షౌకత్, నాజీమోద్దీన్, సుచరితలు కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర వహించారు.

వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేందుకు సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రేరణ టోస్టర్ క్లబ్‌ను కూడా అనేకులు సందర్శించారు. రియాద్ నగరంలోని మరో తెలుగు ప్రవాసీ సంఘమైన టాసా (TASA) అధ్యక్షుడు మురారి తాటికాయల, ఇతరులు కూడా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అదే విధంగా, అల్ ఖోబర్ ప్రాంతంలోని తెలుగు ప్రవాసీ సంఘమైన సాట్స్ (SATS) అధ్యక్షుడు కోనేరు ఉమామహేశ్వరరావు, వరప్రసాద్, కిషోర్ తదితరులు కూడా ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రతి సాటా వార్షికోత్సవానికి తాను వస్తానని, వచ్చిన ప్రతిసారి పల్నాడు బ్రహ్మోత్సవానికి వచ్చిన అనుభూతి కలుగదని 1500 కిలో మీటర్ల దూరంలోని తబూక్ నుండి వచ్చిన రోహాన్ సన్నిధి వ్యాఖ్యానించారు.
పి4 పథకం వివరించే క్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాక ఆలస్యంగా రావడంతో సభలో అంతరాయం ఏర్పడి నిర్వాహకులతో పాటు సభికులకు ఇబ్బంది ఎదురయ్యింది.
రుచికరమైన తెలుగు వంటకాలకు మారుపేరైన బాలాజీ నేతృత్వంలో ఆతిథ్యం రుచులు 66 క్యాటరింగ్ ఆధ్వర్యంలో వడ్డించిన భోజనం అందరి మన్నలూ పొందింది.
భువనేశ్వరి గ్రూప్, అల్ షిఫా క్లినిక్స్, అల్ రాజీ బ్యాంకింగ్, వివర్త మ్యూచల్ ఫండ్స్, దానూబ్ ప్రాపర్టీస్, దుబాయిలోని కె ఇన్ఫ్రా, నాడెక్, అల్ కబీర్, సోనా జ్యువెలర్స్, ఇన్ స్మార్ట్స్ సిస్టమ్స్, కింజా, స్పోర్ట్స్ సెంట్రల్, జరీర్ మెడికల్, పటేల్ రైస్, అల్ తస్లీం టెక్నికల్, బిరేన్ వాటర్స్, వెస్టర్న్ యూనియన్, మొహమ్మద్ ఇల్యాస్ ఫౌండ్రీల సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలిపారు.
కనువిందు చేస్తూ కమనీయంగా సినిమా తరహాలో సాగిన ఈ సభలో సాటా పేరుకు తగినట్లుగా సామాజిక బాధ్యత కనిపించలేదు. ఆపదలో ఉండే వారికి ఆపన్నహస్తం అందిస్తారనే పేరున్న సాటా తన వార్షికోత్సవ సభలో మాత్రం పూర్తిగా నృత్యాలయంగా మారిపోతూ తాము చేసిన సేవలను కూడా వివరించలేని నిస్సహాయ పరిస్థితికి చేరుకుంటోంది.





