Chandrababu: పీ4 పథకంపై ఎన్నారైలల్లో అవగాహన పెంచేందుకు టీడీపీ నేతల పర్యటనలు
ABN , Publish Date - Sep 11 , 2025 | 02:30 PM
ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 పథకానికి ప్రచారం కల్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దుబాయ్ పర్యటన సందర్భంగా అక్కడి ఎన్నారైలను ఈ పథకం ద్వారా స్వగ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: రాష్ట్రంలో అట్టడుగునున్న కుటుంబాలు, వ్యక్తులు, గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలనే ఆశయంతో ముఖ్యమంత్రి యన్. చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీ-4 పథకంపై ప్రవాసాంధ్రులలో అవగాహన కల్పించడానికి తెలుగుదేశం నాయకులు తమ విదేశీ పర్యటనల్లో ప్రయత్నిస్తున్నారు.
ఈ మేరకు దుబాయ్ పర్యటనకు వెళ్లిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్థానిక తెలుగుదేశం ప్రవాసాంధ్ర నాయకులతో ఒక రెస్టారెంట్‌లో సమావేశమై పేద వర్గాల అభ్యున్నతిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 20 శాతం మంది ప్రజలను పైకి తీసుకురావాలనే గొప్ప సంకల్పంతో విజనరీ సీఎం చంద్రబాబు పి4ను ప్రవేశపెట్టారని అన్నారు.
ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉన్న కృష్ణా జిల్లా.. అందునా ప్రత్యేకించి గుడివాడను ఈ పథకం అమలులో ఆదర్శవంతంగా నిలిపేందుకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఆర్థికంగా ఉన్నతమైన తెలుగువారు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మూలాలను మర్చిపోకుండా తమ ప్రాంతాల అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర వహించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో దుబాయ్‌లోని ప్రవాసాంధ్ర ప్రముఖులు తుంగా ప్రసాద్, డాక్టర్ గుత్తా రవి, పునుకోలు సతీష్, సాహుల్ ఫణి సూర్యదేవర, ఎన్ఆర్ఐ టీడీపీ యుఏఈ అధ్యక్షుడు మోతుకూరి విశ్వేశ్వరరావు, వాసు, మురళి, ముక్కు తులసి కుమార్, గల్ఫ్ జనసేన అధ్యక్షుడు కేసరి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
హెచ్-1బీ వీసాపై సర్వే.. 56 శాతం మంది అమెరికన్ల భావన ఇదే..
ఒమాన్‌లో తెలుగు కళా సమితి క్రీడా పోటీలు