Janasena Foundation Day: గల్ఫ్ దేశాలలో ఘనంగా జనసేన ఆవిర్భావ ఉత్సవాలు
ABN , Publish Date - Mar 16 , 2025 | 04:32 PM
గల్ఫ్‌లో జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అక్కడి ప్రవాసీయులు ఈ వేడుకలలో పెద్ద సంఖ్యలో పాల్గొని, పార్టీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు దేశవిదేశాల్లోని జనసేన కార్యకర్తలు నిర్విరామంగా సమిష్టిగా కృషి చేయాలని జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
గల్ఫ్ దేశాలలో జనసేన ఆవిర్భావ దినోత్సవం జనకేతాన్ని పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూఏఈలో జరిగిన సభలో పార్టీ ఇన్ చార్జ్ కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పంతో పని చేయాలని కోరగా జనసేన అధికారంలో భాగస్వామి మాత్రమే కానీ పూర్తి స్ధాయి అధికారంలో లేమనె విషయాన్ని నిత్యం గ్రహించాలని జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్ చంద్రశేఖర్ మెగళ్ళ నొక్కి చెప్పారు. తాము కోరుకున్న రామరాజ్యాన్ని పవన్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తన చేతల ద్వారా ఆచరణలో చూపిస్తున్నారని ఆయన అన్నారు.
NRI: డిట్రాయిట్ వేదికగా తానా పండుగకు సన్నాహాలు ప్రారంభం
అంతకు ముందు వీరిరువురు కలిసి పతాకావిష్కరణతో చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు దుబాయితో సహా వివిధ ఎమిరేట్ల నుండి పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.
ఒమాన్‌లో
ఒమాన్‌లో పార్టీ కోఆర్డినేటర్ చందన రాందాస్ అధ్యక్షతన ఆవిర్భావ సమావేశం జరిగింది, మస్కట్‌తో పాటు సలాల నుండి ప్రత్యేకంగా పార్టీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం ప్రజల కొరకు నిస్వార్థంగా పని చేసే నాయకులలో లాల్ బహదూర్ శాస్ర్తీ, వాజ్‌పేయిల తర్వాతి స్థానం పవన్ కళ్యాణ్‌కు దక్కుతుందని రాందాస్ వ్యాఖ్యానించారు.
సౌదీ అరేబియాలో
సౌదీ అరేబియాలో, అల్ ఖోబర్‌లో జనసేన నాయకురాలు సంధ్య గౌరిశంకర్ నివాసంలో సమావేశమైన పార్టీ కార్యకర్తలు రానున్న నాలుగు సంవత్సరాల వరకు ప్రతి ప్రవాసీ తమ తమ నియోజకవర్గాలలోని సమస్యల పట్ల ప్రతిస్పందిస్తూ ఎడారిలో ఉన్నా స్థానికులతో మమేకం కావాలని నిర్ణయించారు. పార్టీ నాయకులు తేజ పల్లెం, గౌరి శంకర్ తదితరులు ఈ సందర్భంగా మాట్లాడారు.
రాజధాని రియాధ్ నగరంలో జరిగిన ఆవిర్భావ సమావేశంలో జనసేన రియాధ్ ప్రాంత నాయకులు దుగ్గరపు ఎర్రన్న మాట్లాడుతూ సౌదీలోని ఎడారి ప్రాంతాలలోనూ జనసేనను విస్తరించవల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. పార్టీ సేవలను అమీర్ ఖాన్ వివరించారు.
NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’
కువైత్‌లో
కువైత్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రామచంద్ర నాయక్ పతాకావిష్కరణ చేసి పార్టీ లక్ష్యాన్ని వివరించారు. స్వదేశంలో జరుగుతున్న దుష్ప్రచారానికి భిన్నంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం ద్వారా తమ పార్టీ మత సామరస్యాన్ని కోరుకునే పార్టీగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం ఏర్పాటయిన అనంతరం జరుగుతున్న ఆవిర్భావ ఉత్సవాలకు ప్రత్యేకత ఉందని జిలకర మురళీ అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కంచన శ్రీకాంత్, ఆకుల రాజేశ్, అలీ శేఖ్, జిగిలి ఓబిలెష్, ఇమ్మిడిశెట్టి సూర్య, కోలా మురళీ, గుంటూరు శంకర్, అప్పి చిరంజీవి తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందును నిర్వహించగా తెలుగుదేశం పార్టీ నాయకులు కుదరవల్లి సుధాకర్ రావు, ఇతర తెలుగుదేశం నాయకులు కూడా అందులో పాల్గొన్నారు.కువైత్‌లో మరో వైపు, ఎర్రంశెట్టి హరిబాబు ఆధ్వర్యంలో కూడా పార్టీ శ్రేణులు జయకేతనాన్ని జరుపుకున్నారు.
మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..