NRI: ఏపీ సీఎం నిర్ణయాలు దేశ ప్రగతికి మార్గదర్శకం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
ABN , Publish Date - Jun 29 , 2025 | 07:19 AM
యూఎస్ఏలో పర్యటించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అక్కడి ఎన్నారైలు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఏపీ సీఎం నిర్ణయాలు దేశ ప్రగతికి మార్గదర్శకమని ప్రశంసించారు.
ఇంటర్నెట్ డెస్క్: చంద్రబాబు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు దేశ ప్రగతికే మార్గదర్శకం అయ్యాయని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రశంసించారు. జూన్ 27 తేదీ సాయంత్రం అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో, భాను మాగులూరి అధ్యక్షతన అభినందన సభ జరిగింది.
ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ సాంకేతిక విద్య అభివృద్ధి చేయటం ద్వారా అందరికీ అమెరికాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తీసుకురావటానికి ఎన్నారైలు చేసిన కృషి మరపురానిదని ప్రశంసించారు. కొందరు ప్రవాసాంధ్రులు ఇక్కడ నుంచి, మరి కొందరు స్వదేశానికి వచ్చి వివిధ రూపాల్లో తమ వంతు సహాయ సహకారాలు అందించారని అన్నారు.

తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన మాట్లాడుతూ.. రాజధాని అమరావతి అభివృద్ధిలో ఎన్నారైలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న కృషికి తమ వంతు సహకారం అందిస్తే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అన్నారు.
మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ప్రవాసాంధ్రులు అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. పీ-4 లో ప్రవాసులంతా భాగస్వాములవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో కూల్చివేతలే తప్ప నూతన కట్టడాలు ఏమీ లేవని అన్నారు. ఈ ప్రభుత్వం నేడు రాష్ట్రాన్ని శిథిలం నుండి శిఖరం వైపు నడిపిస్తోందని అన్నారు.

భాను మాగులూరి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత వలన గతంలో సాంకేతిక రంగంలో గ్రామీణ స్థాయి నుండి లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని రాణిస్తున్నారన్నారు. యువత భవితే రాష్ట్ర ప్రగతి అని వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో చింతా సతీష్, రమేష్ ఆవిరినేని, రంజిత్ కోమటి, ఎండూరు సీతారామారావు, హనుమంతరావు కూచి, చామర్తి శ్రావ్య, కిశోర్ జాస్తి, చెరుకూరి ఇందుశేఖర్, నంబూరి చంద్రనాథ్, బండి సత్తిబాబు, చిట్టెల సుబ్బారావు, బూర్ల రామకృష్ణ, వనపర్తి నాగిరెడ్డి, వనమా లక్ష్మీనారాయణ, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



ఇవీ చదవండి:
కెనడాకు వెళ్లాలనుకునే వారు ఈ వీడియో చూడాలి.. దడ పుట్టిస్తున్న భారతీయ యువతి పోస్టు
అట్లాంటాలో ఫోర్సిత్ కౌంటీ షెరీఫ్ సిబ్బందికి తానా నాయకుల సత్కారం