AKV Vanabhojanalu: ఖతర్‌లో ఆత్మీయత, ఆప్యాయతల మధ్య ఆంధ్ర కళా వేదిక కార్తీక వనభోజనాలు
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:33 PM
ఖతర్‌లో ఆంధ్ర కళా వేదిక ఆధ్వర్యంలో ఆత్మీయత, అనురాగాల నడుమ వనభోజనాలు కన్నులపండువగా జరిగాయి. అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైందని సంస్థ అధ్యక్షుడు తెలిపారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పరాయి గడ్డపై అందరూ కలిసిమెలిసి ఉంటే కలదు సుఖం అని అంటోంది ఖతర్‌లోని తెలుగు ప్రవాసీ సంఘమైన ఆంధ్ర కళా వేదిక. హోరాహోరీ హైవోల్జేజ్ ఎన్నికల అనంతరం ఆంధ్ర కళా వేదిక (AKV) నూతన కార్యవర్గం ఇటీవల ఉల్లాసకరమైన రమణీయ వాతావరణంలో ఆత్మీయత, ఆప్యాయతానురాగాల మధ్య కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించింది (AKV Vanabhojanalu)
ఆప్యాయతకు తోడుగా ఆధ్యాత్మిక చింతన, సాంస్కృతిక చైతన్యం మేళవించిన ఈ మహత్తర కార్యక్రమంలో ఖతర్‌లోని అనేక తెలుగు ప్రవాసీ కుటుంబాలు పాల్గొన్నాయి. క్రీడలు, కళలు, సాంస్కృతిక అంశాలకు సంబంధించి ప్రవాసీయుల కుటుంబాలల్లో దాగున్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విధంగా వివిధ కార్యక్రమాలను చేపట్టామని ఆంధ్ర కళా వేదిక అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నారులు, మహిళలు, పురుషులకు సంప్రదాయక కబడ్డీతో సహా వివిధ క్రీడలలో పోటీలను నిర్వహించారు. ఇక ఉల్లాసవేళల్లో ఆనందోత్సాహాల మధ్య గడిపే సమయంలో అంత్యాక్షరి అనేది ఒక సరదా. దీన్ని కూడా ఆసక్తికరంగా నిర్వహించారు.

ప్రతి తెలుగు పండుగను ఖతర్‌లోని తెలుగువారందరి మధ్య నిర్వహించడానికి తమ సంఘం ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా రమణయ్య వెల్లడించారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం వలన కార్యక్రమం విజయవంతమైందని, ఇందులో తమ గొప్పదనం ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.
వందేమాతరం దేశభక్తి గీతానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా సభికులందరూ ముక్తకంఠంతో ఈ గీతాన్ని ఆలపించారు. ఈ గేయం ఇప్పటికీ భారత ఆత్మలో ప్రతిధ్వనిస్తున్న జాతీయ స్వరమని నిరూపించారు.
అసలు ఉసిరి చెట్టు లేకుండా కార్తీక వనభోజనాలు అసంపూర్ణం. అరేబియా అయినా చీరాల తీరం అయినా ఇందుకు మినహాయింపు కాదు. రామడుగు వేణు, శాంతయ్య యలమంచిలిలు ప్రత్యేక శ్రద్ధతో తీసుకువచ్చిన ఉసిరి, మారేడు చెట్లు దేవతా వృక్షాలకు మరింత వెన్నె తెచ్చాయి. తులసీ మాతకు హారతి ఇచ్చి కార్తీక దీపాలను వెలిగించిన అనంతరం కొనసాగిన కార్యక్రమంలో భక్తులు పరవశించిపోయారు.
సందర్భానుసారం, సన్నివేశాలకు తగినట్లుగా సౌమ్య వ్యాఖ్యాతగా వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.
అనారోగ్యంతో అనేక ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఒక తెలుగు మహిళకు ఆపన్నహస్తంగా సభికులందరూ తమకు తోచిన విధంగా సహాయమందించడం ద్వారా మానవ సేవయే మాధవ సేవా అని చాటారు.

సామాజిక కోణంలో ఆంధ్ర కళా వేదిక తోరణం కింద తెలుగు వారందరూ గుమిగూడినా ఒక కుటుంబ కార్యక్రమం తరహా ఆత్మీయత, అనుబంధాల మధ్య వనభోజనాలను నిర్వహించడాన్ని ఖతర్‌లోని ప్రవాసీ ప్రముఖులు ప్రసాద్ కోడూరు, అబ్రహాం జోసెఫ్‌లు ప్రశంసించారు.
కార్యక్రమంలో శంతనూ దేశ్‌పాండే (ICC ఉపాధ్యక్షులు), అబ్రహాం కే జోసెఫ్ (ఐసీసీ ప్రధాన కార్యదర్శి), నందిని అబ్బగౌని (ఐసీసీ సాంస్కృతిక కార్యదర్శి), ప్రసాద్ కోడూరు (ICBF సలహా మండలి సభ్యులు), దీపక్ చుక్కల (ISC MC సభ్యులు), తెలుగు ప్రముఖులు కృష్ణ కుమార్, మలిరెడ్డి సత్యనారాయణలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్ ఓరుగంటి (SIF అధ్యక్షుడు), రజని మూర్తి (IWWO అధ్యక్షురాలు), ప్రవీణ లక్ష్మి (TJQ అధ్యక్షురాలు), ఆదర్శ (TJQ ప్రధాన కార్యదర్శి), మధు (TGS అధ్యక్షుడు), సంధ్య (TGS ప్రధాన కార్యదర్శి), శ్రీధర్ అబ్బగౌని (TSA అధ్యక్షుడు), ఉమ మలిరెడ్డి (APWA ఉపాధ్యక్షురాలు) తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
TAG ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం
ఒంటారియో తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు