Luana Lopes Lara: అతి పిన్న బిలియనీర్
ABN , Publish Date - Dec 06 , 2025 | 03:39 AM
లువానా లోప్స్ లారా.. ఇప్పుడీ పేరు వ్యాపార ప్రపంచంలో మార్మోగుతోంది. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన లారా ప్రపంచంలో స్వయంకృషితో ......
లువానా లోప్స్ లారా.. ఇప్పుడీ పేరు వ్యాపార ప్రపంచంలో మార్మోగుతోంది. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన లారా ప్రపంచంలో స్వయంకృషితో ఎదిగిన అతికొద్దిమంది బిలియనీర్ల సరసన చేరారు. 29 ఏళ్ల ఈ బ్రెజిల్ యువ పారిశ్రామికవేత్త ప్రపంచంలోనే అతిపిన్న మహిళా బిలియనీర్‌గా చరిత్ర సృష్టించారు. గతంలో ఈ స్థానంలో ఉన్న స్కేల్ ఏఐ సహ వ్యవస్థాపకురాలు లూసీ గువాను లారా వెనక్కి నెట్టేశారు. లారా స్థాపించిన ప్రిడక్షన్ మార్కెట్ స్టార్టప్ ‘కల్షి’ మార్కెట్ విలువ 11 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.90,200 కోట్లు)కు చేరుకోవడంతో ఆమె వ్యక్తిగత వాటా విలువ 1.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా ఆమె ఈ ఘనత అందుకున్నారు.
లువానా లోప్స్ లారా.. ఇప్పుడీ పేరు వ్యాపార ప్రపంచంలో మార్మోగుతోంది. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన లారా ప్రపంచంలో స్వయంకృషితో ఎదిగిన అతికొద్దిమంది బిలియనీర్ల సరసన చేరారు. 29 ఏళ్ల ఈ బ్రెజిల్ యువ పారిశ్రామికవేత్త ప్రపంచంలోనే అతిపిన్న మహిళా బిలియనీర్‌గా చరిత్ర సృష్టించారు. గతంలో ఈ స్థానంలో ఉన్న స్కేల్ ఏఐ సహ వ్యవస్థాపకురాలు లూసీ గువాను లారా వెనక్కి నెట్టేశారు. లారా స్థాపించిన ప్రిడక్షన్ మార్కెట్ స్టార్టప్ ‘కల్షి’ మార్కెట్ విలువ 11 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 90,200 కోట్లు) చేరుకోవడంతో లారా వ్యక్తిగత వాటా విలువ 1.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. తద్వారా ఆమె ఈ ఘనత అందుకున్నారు.
డ్యాన్సర్ నుంచి పారిశ్రామికవేత్తగా
బ్రెజిల్‌లో పుట్టిన లారా ప్రతిష్ఠాత్మక బోల్షోయ్ థియేటర్ స్కూల్‌లో ఫ్రొఫెషనల్ బ్యాలరీనా (డ్యాన్సర్)గా శిక్షణ తీసుకున్నారు. చదువులోనూ మెరికలా ఉండేవారు. బ్రెజిలియన్ ఆస్ట్రానమీ ఒలింపియాడ్‌లో బంగారు పతకం, శాంటా క్యాటరీనా మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. హైస్కూల్ విద్య తర్వాత ఆస్ట్రియాలో కొంతకాలం పాటు నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఎంతోమంది మన్ననలు అందుకున్నారు. ప్రతి రోజు న్యూస్ వినడాన్ని ఇష్టపడే లారాకు చిన్నప్పటి నుంచే వ్యాపార మెళకువలు అబ్బాయి. అవే ఆమెను ఆ తర్వాతి కాలంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాయి. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న లారా 2019లో తన సహ విద్యార్థి అయిన తారెక్ మన్సూర్‌తో కలిసి రియల్ వరల్డ్ సంఘటనలైన ఎన్నికలు, ద్రవ్యోల్బణం, క్రీడల నుంచి పాపప్ సంస్కృతి వంటి భవిష్యత్ ఈవెంట్లపై ప్రజలు నేరుగా ట్రేడింగ్ చేయడానికి వీలు కల్పించే వేదిక ‘కల్షి’ని స్థాపించారు.
ఈ వ్యవస్థను ఒక నియమిత కాంట్రాక్ట్ మార్కెట్‌గా ఆపరేట్ చేయడానికి ప్రభుత్వ ఆమోదం కోసం ఈ ఇద్దరు కలిసి అనేక న్యాయపోరాటాలు చేసి విజయం సాధించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఫలితాన్ని సరిగా అంచనా వేయడం ద్వారా రూ. 4,100 కోట్ల విలువైన వ్యాపారం చేశారు. ఈ ఏడాది జూన్‌లో 2 బిలియన్ డాలర్లుగా ఉన్న కల్షి మార్కెట్ విలువ డిసెంబర్ నాటికి 11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో లారా, తారెక్ ఇద్దరూ బిలియనీర్లుగా మారగా, లారా ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా బిలియనీర్‌గా రికార్డులకెక్కారు. లారాకు ప్రస్తుతం ఈ కంపెనీలో 12 శాతం వాటా ఉంది. దీని విలువ దాదాపు 1.3 బిలియన్ డాలర్లు.
మనలాగే నమ్మకాలు
బ్రెజిలియన్లకు మనలానే నమ్మకాలు ఎక్కువ. భారతీయుల్లానే వారు కూడా ‘కుడి’కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ‘‘నేను ఉదయం లేవగానే తొలుత కుడికాలినే నేలపై మోపుతాను. దేవుడిపైనా, పునర్జన్మలపైనా నమ్మకం ఉంది. చిన్నప్పుడు పరీక్షలంటే విపరీతంగా భయపడేదానిని. అందుకే స్కూలుకు వెళ్లడానికి అరగంట ముందు దేవుడిని ప్రార్థించేదానిని. కంప్యూటర్ సైంటిస్ట్, రచయిత పాల్ గ్రాహమ్‌ను ‘ఎక్స్’లో ఫాలో అవుతుంటాను. రోజుకు దాదాపు మూడు గంటలపాటు మొబైల్ చూడటం అలవాటు. అలాగే, వారానికి ఒక డాక్యుమెంటరీ తప్పనిసరిగా చూడాల్సిందే. ‘స్వాన్‌లేక్’ నృత్యమంటే నాకు ఎంతో ఇష్టం’’ అని చెప్పే లారా సాంకేతిక ప్రపంచంలోనే కాకుండా ఆర్థిక మార్కెట్లోనూ ఒక యువశక్తిగా, స్ఫూర్తిదాయకమైన మహిళగా నిలిచారు.