ఆ అద్భుతాన్ని అనుభూతి చెందుదాం
ABN , Publish Date - Jun 20 , 2025 | 06:11 AM
‘యోగా’ అంటే ‘మీ శరీరాన్ని ఎలా వంచాలి? లేదా శ్వాసను ఎలా బిగబట్టాలి?’ అనే దాని గురించి కాదు. ఇది మొత్తం మానవ వ్యవస్థను అర్థం చేసుకొనే విజ్ఞాన శాస్త్రం. ‘యోగ’ అనే పదానికి అర్థం ఐక్యత. ఐక్యత అంటే ‘మీరు’ అనే...
సద్గురువాణి
‘యోగా’ అంటే ‘మీ శరీరాన్ని ఎలా వంచాలి? లేదా శ్వాసను ఎలా బిగబట్టాలి?’ అనే దాని గురించి కాదు. ఇది మొత్తం మానవ వ్యవస్థను అర్థం చేసుకొనే విజ్ఞాన శాస్త్రం. ‘యోగ’ అనే పదానికి అర్థం ఐక్యత. ఐక్యత అంటే ‘మీరు’ అనే దానిలోంచి విశ్వజనీనతను అనుభూతి చెందడం. ఉదాహరణకు... ఈ అస్తిత్వం అంతా వివిధ రూపాల్లో వ్యక్తమవుతున్న ఒకే శక్తి అని ఆధునిక విజ్ఞాన శాస్త్రం నిరూపించింది. ఈ శాస్త్రీయ వాస్తవం మీకు జీవన వాస్తవంగా మారితే... అంటే మీరు ప్రతిదాన్నీ ఒకటిగా అనుభూతి చెందడం ప్రారంభిస్తే... మీరు యోగాలో ఉన్నట్టే.
మీలోపల ఏం జరుగుతోంది?
ఈ అంతర్గత సాంకేతికతను మానవులకు అందించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజున ఐక్యరాజ్యసమితిలోని నిపుణులు ‘మానసిక అనారోగ్యం’ అనే మహమ్మారి గురించి మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఒంటరితనం ఎక్కువైపోతోంది. యునైటెడ్ స్టేట్స్‌లో... సర్జన్ జనరల్ నివేదిక ప్రకారం ప్రతి ఇద్దరిలో ఒకరు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఒంటరితనంలో గడిపే సమయం... మానసిక అనారోగ్యాలను పొదిగే సమయం. మానసిక అనారోగ్యం కేవలం కొన్ని రకాల వ్యక్తులనే కాదు... ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు. మీరు ఆ స్థితికి వెళ్ళకుండా చూసుకోవడం ఉత్తమం. ఎందుకంటే బాధ, ఆనందం, సంతోషం, దుఃఖం, ఆవేదన, పారవశ్యం లాంటి వాటిద్వారా మానవ అనుభవం అనేది అంతర్గతంగా నిర్ణయం అవుతుంది. బాహ్య సంఘటనలు... ఆఖరికి ఒకే కుటుంబంలోని ఇద్దరు సభ్యుల మధ్య కూడా ఎప్పుడూ నూటికి నూరు శాతం మీరు కోరుకున్నట్టు జరగవు. కానీ మీలో అంతర్గతంగా ఏం జరుగుతోందనేది మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
వారే కర్తలుగా, యజమానులుగా...
ఈ సమస్యను పరిష్కరించడం కోసం... ఈ ఏడాది ఫిబ్రవరిలో మేము ‘మిరాకిల్ ఆఫ్ మైండ్’ అనే యాప్‌ను ప్రారంభించాం. ఇది ఒకరి జీవితంలో శాంతిని, ఆనందాన్ని, ఉల్లాసాన్ని తీసుకురావడానికి దోహదపడే, ఎక్కడైనా సాధన చేయగలిగే సులభమైన ప్రక్రియను అందిస్తుంది. ఇది తెలుగుతో సహా పలు భాషల్లో ఉంటుంది. ప్రత్యేకించి తెలుగులో ధ్యానం కోసం అందుబాటులోఉన్న మొదటి యాప్ ఇది. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు మనసు చేసే అద్భుతాన్ని అనుభూతి చెందాలనేది నా కోరిక, నా ఆశీస్సు. మానవులందరూ ఏ మినహాయింపు లేకుండా... తమ ఆనందానికి తామే కర్తలుగా, తమ భవితకు తామే యజమానులుగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీరు ఆ విధంగా రూపుదిద్దుకొనే మార్గాన్ని యోగా అందిస్తుంది. భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం ఈ అత్యంత ముఖ్యమైన కార్యానికి సాయం చేయడానికి, నెరవేర్చడానికి అందరికీ సుస్వాగతం. ఎందుకంటే ప్రస్తుతం మనకన్నా మెరుగైన తరం మానవులను లోకానికి అందించి నిష్క్రమించడం మనం విస్మరించలేని బాధ్యత.
సద్గురు జగ్గీవాసుదేవ్