మృదువైన చేతుల కోసం...
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:25 AM
మహిళలు నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. దీనివల్ల వారి చేతులు గరుకుగా మారుతుంటాయి. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి చేతులను మృదువుగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రోజూ రాత్రి పడుకునేముందు చేతులకు మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉండాలి. షియా బటర్, కొబ్బరినూనె, ఇ విటమిన్ నూనెల్లో ఒకటి ఉన్న మాయిశ్చరైజర్ అయితే ప్రభావవంతంగా పనిచేస్తుంది.
వెడల్పాటి గిన్నెలో మూడు గ్లాసుల గోరువెచ్చని నీళ్లు పోసి అందులో రెండు చెంచాలు ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఈ నీళ్లలో పావుగంటసేపు చేతులు నాననివ్వాలి. తరవాత చేతులను ఒకదానితో మరోదానిని రుద్ది మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే చేతుల గరుకుదనం పోతుంది.
చేతులను నీటితో తడిపి వాటిపై కొద్దిగా పంచదార లేదా కాఫీ పొడి వేసి బాగా రుద్దితే మృతకణాలన్నీ తొలగిపోతాయి. ఇలా రాళ్ల ఉప్పుతో చేసినా మంచి ఫలితం ఉంటుంది.
పాత్రలు తోమడానికి, బట్టలు ఉతకడానికి ఉపయోగించే లిక్విడ్ సోప్‌లు, డిష్‌వాష్ బార్‌లు, ఇతర డిటర్జెంట్‌ల వల్ల చేతులకు హాని కలుగుతుంది. కాబట్టి ఆ పనులు చేసేటప్పుడు చేతులకు గ్లోవ్స్ వేసుకోవడం మంచిది.
నీటి శాతం ఎక్కువగా ఉన్న తాజా పండ్లను తింటూ తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. దీనివల్ల చర్మం తేమతో నిండి చేతులు మృదువుగా మారతాయి.