Zen stories: మూర్ఖ శిఖామణి
ABN , Publish Date - Jul 18 , 2025 | 02:54 AM
జపాన్‌లో ఒక గొప్ప జెన్ గురువు ఉండేవాడు. అతని పేరు ర్యోకాన్. అందరూ ‘మూర్ఖ శిఖామణి’ అని పిలిచేవారు. ర్యోకాన్ వింత ప్రవర్తనే దానికి కారణం. కానీ అతను సామాన్యమైన గురువు కాదు. ఎందరికో అతీంద్రియానుభవాన్ని కలిగేలా చేసిన...
జెన్ కథ
జపాన్‌లో ఒక గొప్ప జెన్ గురువు ఉండేవాడు. అతని పేరు ర్యోకాన్. అందరూ ‘మూర్ఖ శిఖామణి’ అని పిలిచేవారు. ర్యోకాన్ వింత ప్రవర్తనే దానికి కారణం. కానీ అతను సామాన్యమైన గురువు కాదు. ఎందరికో అతీంద్రియానుభవాన్ని కలిగేలా చేసిన మహనీయుడు. ర్యోకాన్ చాలా చిన్న వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. కొషోజీ ఆలయంలో ఏకాంతంగా గడిపేవాడు.
ఒక రోజు కోకుసెన్ అనే గురువు ఆ ఆలయానికి వచ్చాడు. ఆయనలో ఏదో శక్తి ర్యోకాన్‌ను ఆకర్షించింది. ఆయనకు ఇతను శిష్యుడయ్యాడు. ఆయన వెంట ఎట్సుంజీ మఠానికి వెళ్ళి.... అక్కడ ధ్యానంలో గడిపేవాడు. కొన్నేళ్ళకు కోకుసెన్ మరణించాడు. ఆలయంలో పూజారిగా ఉండడం ర్యోకాన్‌కు ఎప్పుడూ ఇష్టం లేదు. కాబట్టి తనకు నచ్చిన విధంగా, నచ్చిన చోట ఉండాలని నిర్ణయించుకొని... తీర్థయాత్రలు చేశాడు. కవితలు రాస్తూ, పిల్లలతో ఆడుతూ, పాడుతూ గడిపేవాడు. జెన్ సన్యాసులు సాధారణంగా మాంసం తినేవారు కాదు. కానీ ఎవరైనా చేపలను వడ్డిస్తే ర్యోకాన్ హాయిగా తినేవాడు. ‘‘నేను చేపలను తింటాను. ఈగలకు, దోమలకు నా దేహాన్ని విందు భోజనం కింద ఆనందంగా సమర్పిస్తాను’’ అంటూ ఉండేవాడు. పండుగల్లో మహిళలు మాత్రమే పాల్గొనే కార్యక్రమాలు కొన్ని ఉండేవి. ర్యోకాన్ స్త్రీ వేషధారణలో వెళ్ళి ఆ కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.
అతని కుటీరానికి ఒక రోజు రాత్రి ఒక దొంగ వచ్చాడు. ఏదీ దొరక్క అతను వెళ్ళి పోతూ ఉంటే... రోకాన్ అతన్ని ఆపాడు. ‘‘ఉత్త చేతులతో నా ఇంటి అతిథి వెళ్ళరాదు. ఇదిగో! నా వస్త్రాన్ని తీసుకువెళ్ళు’’ అంటూ తాను కట్టుకున్న వస్త్రాన్ని అతనికి ఇచ్చేశాడు. దిగంబరంగా కూర్చొని ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తూ పరవశించిపోయాడు. ఎప్పుడూ ఏకాంతంగా నడుస్తూ, హృదయం నుంచి పొంగి పొరలే కవితల్ని వర్ణిస్తూ హాయిగా గడిపే ర్యోకాన్‌కు శిష్యులంటూ ఎవరూ ఉండేవారు కాదు. కానీ ఎందరో ఆయననుంచి ప్రేరణ పొంది ధ్యానం చేసేవారు. ధ్యానంలో అత్యున్నత శిఖరాలను అందుకొనేవారు. ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమైన ర్యోకాన్ లౌకిక విషయాలను ఎలాంటి క్రమం లేకుండా అనుసరించేవాడు. చెప్పులను తలమీద పెట్టుకొనేవాడు. వస్త్రం లేకుండా వీధుల్లో నడిచేవాడు. తలపైన ఉండవలసిన టోపీని కాలికి తగిలించుకొనేవాడు. తనలోతాను నవ్వుకొనేవాడు. ఇదంతా గమనించిన ప్రజలు అతణ్ణి ‘మూర్ఖ శిఖామణి’ అంటూ వ్యవహరించేవారు. ఒక గ్రామంలో ర్యోకాన్‌ని దొంగగా భావించిన ప్రజలు అతణ్ణి సజీవంగా పాతి పెట్టారు. ర్యోకాన్‌తో పరిచయం ఉన్న టైషన్ అనే సన్యాసిని ఈ వివరాలను లోకానికి వెల్లడిస్తూ... ఆయనను జ్ఞాన శిఖామణిగా కీర్తించింది.్ఝ
రాచమడుగు శ్రీనివాసులు
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్