హనుమంతుడు ఎవరు?
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:39 AM
హిందూ సంస్కృతిలో ఇష్టదేవతారాధన ఒక ముఖ్యమైన తాత్విక భావన. ఒకరిని పూజిస్తూనే ఇతర దేవతలను ద్వేషించకుండా.. వారిని కూడా గౌరవిస్తారు. బహుశా ప్రపంచంలో మరే మతంలోను ఈ తరహా సంప్రదాయం...

హిందూ సంస్కృతిలో ఇష్టదేవతారాధన ఒక ముఖ్యమైన తాత్విక భావన. ఒకరిని పూజిస్తూనే ఇతర దేవతలను ద్వేషించకుండా.. వారిని కూడా గౌరవిస్తారు. బహుశా ప్రపంచంలో మరే మతంలోను ఈ తరహా సంప్రదాయం కనిపించదు. హనుమంతుడు కూడా ఈ తరహా దేవుడే! హనుమంతుడిని మనం రాముడి పరివారంలో భాగంగా చూడవచ్చు. లేదా శివుడు, విష్ణువు మొదలైన వారిని చేరుకోవటానికి ఒక మార్గంలా కూడా భావించవచ్చు. మన పూర్వ గ్రంథాలలో హనుమంతుడిని భక్తితత్వానికి ప్రతిరూపంగా చిత్రీకరిస్తారు. హనుమంతుడు ఆడగలడు. పాడగలడు. తప్పు చేసిన వారిని శిక్షించగలడు. దుర్గా దేవిలోని శక్తి, సరస్వతి దేవిలోని విజ్ఞానం, లక్ష్మీదేవిలోని సంపదలను తన భక్తులకు ఇవ్వగలిగినవాడు హనుమంతుడే! అందువల్లనే మన దేశంలో అనేక ప్రాంతాల్లో హనుమంతుడికి గుడులు కనిపిస్తాయి.
అనేక రూపాలలో...
భగవంతుడు కేవలం పురుషుడే కాదని... అర్థనారీశ్వరుడని కొందరు నమ్ముతారు. ఇది మన స్థానిక సంస్కృతులలో ఒక కీలమైన అంశం. అందుకే హనుమంతుడు చత్తీ్‌సగఢ్‌లోని రత్నపూర్ జిల్లాలోని ఒక గుడిలో చీరకట్టుకొని, ముక్కుపుడక పెట్టుకొని కనిపిస్తాడు. మనకు అందుబాటులో ఉన్న గ్రంథాలను పరిశీలిస్తే - దేవుళ్లకు ఉన్న సమస్యలను కూడా తీర్చే వ్యక్తిగా హనుమంతుడు మనకు దర్శనమిస్తాడు. రామాయణంలో లక్ష్మణుడు సృహ తప్పిపడిపోయినప్పుడు సంజీవినిని తెచ్చి కాపాడతాడు. సీతను కనుగొనటంలో సముద్రాన్ని దాటి లంకకు చేరుకుంటాడు. ఇలా దేవుళ్లకే సాయం చేయగలిగిన వ్యక్తి మానవులకు ఎందుకు సాయం చేయలేడు? బహుశా అందుకే భారతదేశంలో కొండల్లో.. గుట్టల్లో హనుమంతుడి ఆలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. తమకున్న సమస్యలను పరిష్కరించమని హనుమంతుడిని అందరూ కోరుకుంటూ ఉంటారు.
అనేక గ్రామాల శివార్లలో హనుమంతుడి విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఈ విగ్రహమే తమను దుష్టశక్తుల నుంచి రక్షిస్తుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు.
మన దేశంలో ఆదివాసీ ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్న రామాయణంలో హనుమంతుడు లంకకు వెళ్లినప్పుడు ... అక్కడ ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. అది రావణుడు రాజభవనం. దానిలోని రావణుడు కూర్చునే ఒక సింహాసనం ఉంటుంది. ఆ సింహనం కింద రావణుడు- శనిని, యముణ్ణి బంధించి ఉంచుతాడు. హనుమంతుడు వారిద్దరిని విడుదల చేస్తాడు. తమకు స్వేచ్ఛను కలగజేశాడు కాబట్టి వీరిద్దరూ హనుమంతుడికి రుణపడి ఉంటారు. అందుకే తీవ్రమైన ఈతి బాధలు వచ్చినప్పుడు హనుమాన్ చాలీసా చదువుకొమ్మని చెబుతారు. హనుమంతుడిని ప్రసన్నం చేసుకుంటే వీరిద్దరి అనుగ్రహం కూడా పొందవచ్చని భావిస్తారు.
- లఖనవూలో మే-జూన్ నెలల మధ్య- బడా మంగల్ - అనే ఉత్సవాన్ని జరుపుతారు. లక్నోను నవాబులు పరిపాలించే కాలంలో ఒక ప్రాంతంలో ఒక పెద్ద హనుమంతుడి విగ్రహం బయటపడింది. దీనిని శుభశూచకంగా భావించిన నవాబులు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ రోజుకు ఈ ఉత్సవం జరుగుతుంది. వేల మంది ప్రజలు హనుమంతుడి విగ్రహాన్ని దర్శించుకోవటానికి వస్తారు. వారికి స్థానిక ముస్లిములు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.
ఇవి కూడా చదవండి..