Share News

Misery of Misers: ఆ గుణం అనర్థం

ABN , Publish Date - Oct 10 , 2025 | 01:48 AM

మనుషుల్లో పలు స్వభావాలు ఉంటాయి. వాటిలో పిసినారితనం ఒకటి. దానం చేయకపోవడం, అవసరమైన చోట ఖర్చు చేయకపోవడం, అల్లాహ్‌ మనకు ఇచ్చిన సంపదను ఇతరులతో పంచుకోకపోవడం..

Misery of Misers: ఆ గుణం అనర్థం

మనుషుల్లో పలు స్వభావాలు ఉంటాయి. వాటిలో పిసినారితనం ఒకటి. దానం చేయకపోవడం, అవసరమైన చోట ఖర్చు చేయకపోవడం, అల్లాహ్‌ మనకు ఇచ్చిన సంపదను ఇతరులతో పంచుకోకపోవడం... ఇవి దాని లక్షణాలు. పిసినారితనం అంటే కేవలం డబ్బు దాచుకోవడమే కాదు, ఇతరులకు సాయం చేయాలనే మనసు లేకపోవడం కూడా. పిసినారి వ్యక్తి దగ్గర చాలా సంపద ఉన్నా... అది సమాజానికి ఏమాత్రం ఉపయోగపడదు. నిజానికి పిసినారివ్యక్తి తనకు తానే శాపంగా మిగులుతాడు. ‘దానం చేస్తే నా దగ్గర ఉన్నది తక్కువైపోతుందేమో’ అనే భయం, ఆందోళన, అలజడి, అనుమానం, అసంతృప్తి, అశాంతి అతనిలో పెరుగుతాయి.

అల్లాహ్‌ తన అనుగ్రహాన్ని విరివిగా ప్రసాదించినప్పటికీ... పిసినారితనాన్ని చూపితే... ఆ స్వభావం వారికి ఎంతో హానికరం అవుతుందనీ, వారు లోభంతో కూడబెట్టినదే ప్రళయం నాడు వారికి ఉరితాడవుతుందనీ దివ్య ఖుర్‌ఆన్‌ హెచ్చరించింది. ‘‘పిసినారితనంతో ప్రవర్తిస్తూ, ఇతరులకు కూడా ఆ వైఖరిని నేర్పేవారిని, అల్లాహ్‌ అనుగ్రహించి ఇచ్చిన దాన్ని దాచిపెట్టేవారిని అల్లాహ్‌ ప్రేమించడు. అటువంటివారికి భయంకరమైన శిక్షలు ఉంటాయి. కేవలం ప్రజలకు ప్రదర్శించడానికి మాత్రమే సంపదను ఖర్చుపెట్టేవారిని, అల్లాహ్‌ను, అంతిమదినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించనివారిని అల్లాహ్‌ ఇష్టపడు. పిసినారితనం వహించి, దేవునిపట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబించేవారిని కఠినమైన మార్గాల్లోకి వెళ్తారు. అప్పుడు ధనం వారికి ఏమాత్రం ఉయోగపడదు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌ స్పష్టం చేసింది.

‘‘ఉదారుడు... అల్లాహ్‌కు, మనుషులకు, స్వర్గానికి దగ్గరగా ఉంటాడు. పిసినారి నరకానికి దగ్గరవుతాడు. పిసినారితనానికి, చెడ్డ నడవడికకు విశ్వాసంతో ఏమాత్రం పొంతన కుదరదు. అతిలోభం (పిసినారితనం), అహంకారం, లౌకికమైన వాటి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం అనే మూడు దుష్ప్రవర్తనల నుంచి దూరంగా ఉండాలి. అలాగే పిసినారికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అతనికి సమృద్ధిగా సంపద ఉన్నా... అతని నుంచి మీరు ఏదీ పొందలేరు. మీరు అతనికి వారసులైతే... ఆ సంపదను కాపాడుకోవడానికి అతను చేసిన పనుల వల్ల కలిగే పాపంలో భాగం మీకూ సంక్రమిస్తుంది’’ అని అంతిమ దైవప్రవక్త మహమ్మద్‌ వివిధ సందర్భాల్లో చెప్పారు. పిసినారితనం ఈ లోకంలో అపఖ్యాతికి, పరలోకంలో శిక్షకు దారి తీస్తుంది. సదఖా, ఫిత్రా, జకాత్‌ తదితర దానాలు మనిషి హృదయాన్ని శుభ్రపరుస్తాయి. సమాజానికి వెలుగును ఇస్తాయి. అల్లాహ్‌ పేరిట చేసిన దానం ఎన్నటికీ వృధా కాదు.

- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - Oct 10 , 2025 | 01:48 AM