Share News

Stress Management: ఉందాం... సంతోషంగా

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:43 AM

సంతోషం బజార్లో కొనుక్కునే వస్తువు కాదు. అరువు తీసుకుని తిరిగిచ్చే ఉపకరణం అంతకన్నా కాదు. ఈ భావనను మనమే సృష్టించుకోవాలి. అందుకోసం మార్గాలు వెతుక్కోవాలి. అడ్డుపడే అవరోధాలను అధిమించాలి...

Stress Management: ఉందాం... సంతోషంగా

సంతోషం బజార్లో కొనుక్కునే వస్తువు కాదు. అరువు తీసుకుని తిరిగిచ్చే ఉపకరణం అంతకన్నా కాదు. ఈ భావనను మనమే సృష్టించుకోవాలి. అందుకోసం మార్గాలు వెతుక్కోవాలి. అడ్డుపడే అవరోధాలను అధిమించాలి...

సార్వత్రికంగా అందరినీ సంతోషపెట్టే మార్గం అంటూ ఏదీ ఉండదు. అది ఎవరికి వారు తేల్చుకోవలసిందే! ఉదాహరణకు కొందరికి క్రికెట్‌ అమితానందం కలిగించవచ్చు. కొందరికి అది పరమ చికాకు కలిగించే అంశం కావచ్చు. ఎందుకలా అంటే ఎవరి కారణాలు వారికి ఉంటాయి. ఇతరుల ఆనందించే అంశాలన్నీ మనకు ఆనందాన్నివ్వకపోవచ్చు. మనకు ఆనందాన్నిచ్చేది ఇతరులకు నిరర్థకంగా కనిపించవచ్చు. కాబట్టి మరొకరి సంతోషంతో బేరీజు వేసుకోకుండా స్వీయసంతోషాన్ని ఆస్వాదించాలి. మనం అమితంగా ఇష్టపడేదాన్ని, మనకు సంతోషాన్ని అందించేదాన్నీ కొందరు విమరించవచ్చు కూడా! ఆ విమర్శలకు ప్రభావితమై, మార్గాన్ని మార్చుకుంటే నష్టం మనకే! కాబట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించని, స్వీయఆనందాన్ని అందించే కారకాలను ఎంచుకుని జీవితంలో ఆనందాన్ని నింపుకోవడం అలవాటు చేసుకోవాలి.

ఒక లక్ష్యమంటూ ఉండాలి

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం అంటూ ఉండాలి. లేకపోతే మనసు చంచలంగా మారుతుంది. ఏ ఒక్క మార్గంలోనూ చివరి వరకూ చేరుకోకుండా, తరచూ దారి మారుస్తూ ఉంటుంది. దీనివల్ల అన్నీ అర్థాంతరంగా ఆగిపోతాయి. ఈ తత్వం అంతిమంతా మనోవేదననే మిగులుస్తుంది. అందువల్ల ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని, ఆ దిశగానే ప్రయాణిస్తూ ఉంటే మనసు చలించే అవకాశం ఉండదు. ఊహించిన స్థాయిలో కాకపోయినా కొంత మేర కు ఫలితాన్నిచ్చినా ఎంతో సంతృప్తి కలుగుతుంది. కొంత సాధించినా, మిగతాది కూడా సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. తాత్కాలిక అంతరాయాలు ఎదురైనా కొంత విరామం తర్వాత తిరిగి కొనసాగే ఆత్యస్థైర్యం అలవడుతుంది


డైరీ రాయడం ఎంతో మేలు

ప్రతి రోజూ భిన్నమైనదే! ఊహించని సంఘటనలు, ఊహకందని అనుభవాలు ప్రతిరోజూ ఎదురవుతూ ఉంటాయి. భిన్నమైన కార్యకలాపాల్లో ఒక్కోసారి ఎటు వెళుతున్నామో అర్థం కాదు. దాంతో ఒక్కోసారి మనసు ఒక ఉధృతమైన ప్రవాహంలో కొట్టుకుపోతున్న నావలా మారుతుంది. ఈ దశలో తప్పులు జరిగే అవకాశాలు కూడా ఎక్కువే! అయితే, డైరీ రాయడం ద్వారా ఏరోజుకారోజు ఒక సమీక్ష జరుగుతుంది. పరిస్థితులను విశ్లేషించుకోగలిగే వెసులుబాటు చిక్కుతుంది. పునరాలోచించుకునే తీరుబడి కూడా దొరుకుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు జరుగుతున్న తప్పిదం నుంచి బయటపడే అవకాశాలు పెరుగుతాయి. డైరీ రాయడం ద్వారా తృటిలో తప్పిన అలాంటి పూర్వ ప్రమాదాలను తలుచుకున్నప్పుడు కొండంత తృప్తి కలుగుతుంది.

కుటుంబ బంఽధాలు ఎంతో ముఖ్యం

రోజువారీ ఉద్యోగ, వ్యాపారాల ఒత్తిడిలో చాలా మంది కుటుంబ విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉండిపోతారు. దీనివల్ల కుటుంబ సభ్యుల మఽధ్య అనుబంధాలు బలహీనపడతాయి. బయట ఎన్ని శిఖరాలు అధిరోహించినా కుటుంబ సభ్యులతో ఆత్మీయ బంధం లేకపోతే, అది గుండె బరువును కచ్చితంగా పెంచుతుంది. అందువల్ల వృత్తిపరంగా ఎంత ఒత్తిడిలో ఉన్నా, కటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్లతో కలిసి గడిపే సమయం నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి. తీరుబడి చేసుకుని సరదాలు, షికార్లకు కలిసి వెళ్తూ ఉండాలి.

ఒత్తిడిని స్వీకరించాలి

ఏ పనినైనా ఒక పర్‌ఫెక్షన్‌తో చేయాలనుకున్నప్పుడు ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడే లేకపోతే అంతిమ ఫలితం అపురూపంగా ఉండకపోవచ్చు.అయితే మనం ఇష్టంగా చేసే పని ఎంత బరువైనదైనా అది మానసిక ఒత్తిడిని కలిగించదు. అయిష్టంగా చేసేవే ఒత్తిడికి, అసహనానికీ గురిచేస్తాయి ఒక దశలో వాటి నుంచి దూరంగా పారిపోయేలా కూడా చేస్తాయి. కాబట్టి చేస్తున్న పని పట్ల ఆసక్తి, మక్కువ పెంచుకోవడం అవసరం. చేసే పనిలో నైపుణ్యం పెరిగే కొద్దీ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అందువల్ల వృత్తి పరమైన నైపుణ్యాన్ని నిత్యం పెంచుకోవడం ద్వారా అన్ని ఒత్తిడులనూ అధిగమించవచ్చు.

Updated Date - Dec 11 , 2025 | 05:43 AM