Share News

Mount Everest: ఆత్మవిశ్వాసమే అండగా

ABN , Publish Date - May 29 , 2025 | 06:08 AM

దృష్టిలోపంతో కూడిన హిమాచల్‌ యువతి చోంజిన్‌ ఆంగ్మో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి దేశానికి గర్వకారణంగా నిలిచింది. అంధత్వాన్ని అధిగమించి ప్రపంచంలోనే ఐదవ అంధురాలిగా ఎవరెస్టును చేరిన ఆమె తత్వం దివ్యాంగులకు స్ఫూర్తిగా మారింది.

 Mount Everest: ఆత్మవిశ్వాసమే అండగా

దివ్యాంగుల మనోస్థ్యైరాన్నీ పెంచాలనే సంకల్పం ఆమెది. అందుకోసం సవాళ్లతో కూడుకున్న సాహసానికి పూనుకుంది. ఏకంగా ఎవరెస్టు పర్వతాన్నే అధిరోహించి, దృష్టిలోపంతో ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ఆమే హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన చోంజిన్‌ ఆంగ్మో. ఈ సాహసి గురించిన మరిన్ని విశేషాలు

హిమాచల్‌ ప్రదేశ్‌, కిన్నోర్‌ జిల్లా, హంగ్రాంగ్‌ లోయలో ఉన్న తన ఎకరం పొలంలోని యాపిల్‌ తోటలో పని చేసుకుంటున్న రైతు, అమర్‌ చంద్‌ ఫోన్‌కు ఒక వీడియో క్లిప్‌ వచ్చింది. తన 29 ఏళ్ల కూతురు చోంజిన్‌ ఆంగ్మో ఎవరెస్టు పర్వతం మీద మువ్వన్నెల జెండాను ఎగరేస్తున్న వీడియో అది. ఎనిమిదేళ్లకే కంటిచూపు మందగించిన తన కూతురు సాధించిన విజయానికి ఆ తండ్రి కళ్లు చెమర్చాయి. ‘‘మా చాంగో గ్రామం చల్లని ఎడారిలో ఒక ఒయాసిస్‌ లాంటిది. రెండు హిమనీనదాలు, స్పితి నది ప్రవహించే లోయలో నెలకొని ఉన్న ఏకైక ఆకుపచ్చని ప్రాంతం మాది. ఇంత చిన్న గ్రామంలో పుట్టిన మా అమ్మాయి, దృష్టిలోపాన్ని అధిగమించి, ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించడం మా గ్రామానికి గర్వకారణం’’ అంటూ పొంగిపోతున్నాడు, ఆ 76 ఏళ్ల తండ్రి.

ఎనిమిదేళ్లకే అంధత్వం

దృష్టిలోపంతో ఎవరెస్టును అధిరోహించిన ప్రపంచంలోని ఐదవ పర్వతారోహకురాలిగా కూడా చోంజిన్‌ ఆంగ్మో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈమెకు ముందు, 2001లో అమెరికాకు చెందిన ఎరిక్‌ వెహెన్‌మేయర్‌, ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన, దృష్టి లోపం కలిగిన మొట్టమొదటి వ్యక్తిగా పేరు పొందింది. ఆ తర్వాత, 2017లో ఆస్ట్రియాకు చెందిన యాండీ హోల్జర్‌, 2021లో చైనాకు చెందిన జాంగ్‌ హాంగ్‌, 2023లో, అమెరికాకు చెందిన లానీ బెడ్‌వెల్‌ ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించారు. అయితే ఆంగ్మో కథ వీళ్లందరి కంటే భిన్నం. ఆంగ్మోకు చిన్నతనంలోనే దృష్టి లోపం తలెత్తింది. బడిలో అక్షరాలు రాయలేకపోతోందని ఉపాధ్యాయురాలు చెప్పడంతో ఆంగ్మో తల్లితండ్రులు ఆమెను మొదట చండీఘడ్‌, డెహ్రాడూన్‌ నగరాలకు తీసుకువెళ్లి వైద్యులకు చూపించారు. కానీ ఫలితం లేకపోయింది. ఎనిమిదేళ్ల వయసొచ్చేటప్పటికి ఆమె రెండు కళ్లూ కనిపించకుండా పోయాయి. దాంతో తల్లితండ్రులు ఆమెను 2005లో మహాబోధి ఇంటర్నేషనల్‌ మెడిటేషన్‌ సెంటర్‌ నడిపే, లెహ్‌లోని మహాబోధి అంధుల పాఠశాలలో చేర్పించారు. అక్కడే చదువు పూర్తి చేసుకున్న ఆంగ్మో, ఆ తర్వాత ఢిల్లీలోని మిరాండా హౌస్‌లో డిగ్రీ పూర్తి చేసింది. అయితే పర్వతారోహణ పట్ల మక్కువ కలిగిన ఆంగ్మో 2016లో మనాలిలోని, అటల్‌ బిహారి వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ అండ్‌ అల్లైడ్‌ స్పోర్ట్స్‌ సహాయంతో పర్వతారోహణలో ప్రాథమిక శిక్షణ పొందింది. ఆ శిక్షణలో భాగంగా 5,289 అడుగుల ఎత్తున్న ఫ్రెండ్‌షెప్‌ పీక్‌ను కూడా అధిరోహించింది. ఆ తర్వాత 2021లో టీమ్‌ క్లా, అనే సాయుధ దళాల అనుభవజ్ఞుల బృందం నేతృత్వంలో సియాచిన్‌ గ్లేసియర్‌కు సాగే దివ్యాంగుల యాత్ర అయిన ఆపరేషన్‌ బ్లూ ఫ్రీడంలో పాల్గొంది.


అంచనాలు, సూచనల ఆధారంగా...

ఆ సాహసయాత్రలతో ఆంగ్మో ఆత్మస్థైర్యం పెరిగింది. ఆ ప్రయాణంలో అదనపు ఆక్సిజన్‌ లేకుండా, ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొట్టమొదటి పర్వతారోహకుడు స్వల్జాంగ్‌ రిజ్విన్‌ను కలిసింది. లడఖ్‌ మౌంటెన్‌ గైడ్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అయిన రిజ్విన్‌, ఆమెలోని దృఢ సంకల్పాన్ని, పట్టుదలనూ గ్రహించి పర్వతారోహణలో తోడ్పడే జూమర్‌ టెక్నిక్‌ లాంటి కొన్ని మెలకువలను సూచించాడు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంగ్మో ఎవరెస్టు పర్వతారోహణను స్పాన్సర్‌ చేయడంతో, ఆమె మొదట ఆరు వేల మీటర్ల ఎత్తైన మౌంట్‌ లోబుచెను అధిరోహించింది. ఆ తర్వాత, ఎవరెస్టు మొదటి మూడు బేస్‌ క్యాంపులతో పాటు, చివరిగా 7,920 మీటర్ల ఎత్తులోని నాల్గవ బేస్‌ క్యాంపుకు చేరుకోగలిగింది. ఇద్దరు షెర్పాలు, అనుభవజ్ఞులైన పర్వతారోహకులు కూడా ఈమె వెంట ఉన్నారు. అయితే వాళ్లు కొంత తోడ్పాటును అందించినప్పటికీ అంతిమంగా పైకి ఎక్కవలసింది ఆమే! తాడు బిగువును పరీక్షించుకోవడంతో పాటు, మంచులో, రాళ్ల మీద అడుగుజాడల గుర్తులను కనిపెట్లే బాధ్యత ఆమెదే! కొన్నిచోట్ల నిచ్చెనలను దాటవలసి వచ్చినప్పుడు, వెంట వెళ్లిన వాళ్లు ఆ నిచ్చెనను దాటి, ట్రెక్‌ పోల్స్‌ సహాయంతో పాదాన్ని ఎక్కడ ఉంచాలో ఆమెకు సూచిస్తూ ఉంటారు. ఇలా అంచనాలు, సూచనల సహాయంతో ఆంగ్మో విజయవంతంగా ఎవరెస్టును అధిరోహించగలిగింది. ‘‘దివ్యాంగులందరిలో మనోస్థ్యైర్యాన్ని నింపాలనే సంకల్పంతోనే నేనీ సాహసయాత్రకు పూనుకున్నాను. మనో స్థైర్యం ఉంటే, మనల్ని ఏదీ అడ్డుకోలేదు. ప్రతి ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడమే నా తర్వాతి లక్ష్యం. హెలెన్‌ కెల్లర్‌ నా రోల్‌ మోడల్‌. ఆమె నుంచి పొందిన స్ఫూర్తితో నేనీ విజయం సాధించగలిగాను’’ అంటూ మీడియాతో చెప్పుకొచ్చింది ఆంగ్మో.


Also Read:

మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వార్నింగ్

For More Telugu And National News

Updated Date - May 30 , 2025 | 02:59 PM