అందమైన అనుబంధం
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:58 AM
ఒకరు క్రికెట్‌లో కింగ్. మరొకరు ఒకప్పటి బాలీవుడ్ క్వీన్. ఇద్దరి దారులు... లక్ష్యాలు వేరైనా... ప్రేమ వారిని ఒక్కటి చేసింది. 36 ఏళ్ల అనుష్కా పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో. ఆమె తండ్రి కల్నల్ అజయ్‌కుమార్ శర్మ. ఆర్మీ అధికారి. తల్లి అషిమాశర్మ గృహిణి....
దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం... చాంపియన్స్ ట్రోఫీ అంతిమ సమరం... భారత జట్టు అద్భుత విజయం తరువాత అక్కడ అత్యంత ఆకట్టుకున్నది... విరాట్ కొహ్లీ, అనుష్కాశర్మల జంట. అరమరికలు లేని వారి అన్యోన్యత. మైదానంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసినవారు... రోజంతా టీవీలకు అతుక్కుపోయిన అభిమానులు... దాదాపు అందరి దృష్టీ.. విరుష్కాల మీదే.
ఒకరు క్రికెట్‌లో కింగ్. మరొకరు ఒకప్పటి బాలీవుడ్ క్వీన్. ఇద్దరి దారులు... లక్ష్యాలు వేరైనా... ప్రేమ వారిని ఒక్కటి చేసింది. 36 ఏళ్ల అనుష్కా పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో. ఆమె తండ్రి కల్నల్ అజయ్‌కుమార్ శర్మ. ఆర్మీ అధికారి. తల్లి అషిమాశర్మ గృహిణి. ‘నటిగా కంటే ఒక ఆర్మీ అధికారి కూతురునని చెప్పుకోవడానికి నేను గర్వపడతా’ అంటూ ఓ సందర్భంలో అనుష్కా చెప్పింది. బెంగళూరులో పెరిగిన ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం... కొన్నాళ్లు అసోమ్‌లో సాగింది. భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోనీ సతీమణి సాక్షి... ఆమె సహవిద్యార్థిని. తిరిగి బెంగళూరుకు వచ్చిన అనుష్కా... అక్కడే ప్రాథమికోన్నత విద్య, డిగ్రీ పూర్తి చేసింది. తొలుత మోడలింగ్ లేదంటే జర్నలిజమ్‌లో కెరీర్‌ను ఎంచుకోవాలని అనుకుంది. రెండిటిలో మోడలింగ్‌కు వైపు మొగ్గు చూపి... ముంబయి వెళ్లింది. అక్కడ మోడలింగ్ చేస్తూనే నటనలో శిక్షణ తీసుకుంది. బాలీవుడ్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. తొలి చిత్రమే షారూక్‌ఖాన్‌తో. ఎన్నో వడపోతల తరువాత ‘రబ్ నే బనాదీ జోడీ’లో అతని సరసన నటించే అద్భుత అవకాశం దక్కించుకుంది. ఆ బ్లాక్‌బస్టర్‌తో అగ్రతారల్లో ఒకరిగా నీరాజనాలు అందుకుంది.
ఇక క్రికెట్‌లో వేలకొద్దీ పరుగులు సాధించిన విరాట్ కొహ్లీది భిన్నమైన కథ. అతడి తండ్రి ప్రేమ్‌నాథ్ కొహ్లీ క్రిమినల్ లాయర్. తల్లి సరోజ్ గృహిణి. ఢిల్లీలో పుట్టిన విరాట్‌కు ఊహ తెలిసినప్పటి నుంచి క్రికెట్టే ప్రపంచం. అతడి ఆసక్తిని గమనించిన తండ్రి అకాడమీలో చేర్పించి, శిక్షణ ఇప్పించారు. ఢిల్లీ అండర్-15 జట్టులో చోటు దక్కించుకున్న కొహ్లీ... అసమాన ప్రతిభతో అంచలంచెలుగా ఎదిగాడు. 2006లో తండ్రి మరణించడంతో... ఆయన తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి మరింత శ్రమించాడు. 2008లో అండర్19 ప్రపంచ కప్‌లో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. అదే ఏడాది శ్రీలంక పర్యటనకు భారత సీనియర్ జట్టు నుంచి పిలుపు వచ్చింది. సిరీ్‌సలో తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కొహ్లీ, టన్నులకొద్దీ పరుగులతో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తరువాత అంతటి బ్యాట్స్‌మన్‌గా పేరు గడించాడు.
విభిన్న నేపథ్యాల నుంచి వచ్చి, విభిన్న లక్ష్యాల వైపు పయనిస్తున్న విరాట్, అనుష్కా తొలిసారి కలిసింది కూడా కెరీర్ పరంగానే. ఓ షాంపూ యాడ్ కోసం కలిసి నటించారు. అక్కడ వీరి పరిచయం ఆ తరువాత ప్రేమగా చిగురించింది. కొన్నేళ్ల సహజీవనం తరువాత 2017లో వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ జంటకు 2021లో కూతురు పుట్టింది. గత ఏడాది ఫిబ్రవరిలో అనుష్కా మగ బిడ్డకు జన్మనిచ్చింది. విరాట్ ఎక్కడ ఉంటే అక్కడ అనుష్కా ప్రత్యక్షమవుతుంది. అతడు మైదానంలో ఉన్నప్పుడు... గ్యాలరీలో కూర్చొని ఉత్సాహపరుస్తుంది. అతడి గెలుపు తన గెలుపులా భావిస్తుంది. సగటు అభిమానిలా కేరింతలు కొడుతుంది. ఇవన్నీ క్రికెట్ ప్రేమికులకు కొత్తేమీ కాదు. విరాట్ కూడా అంతే. అతడి మనసులో ఆమె స్థానం అత్యున్నతం. క్రికెట్, కుటుంబం... ఇవే అతడి లోకం.
దీనికి కొనసాగింపుగా ఈ నెల తొమ్మిదిన ముగిసిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో విరుష్కాల అనురాగ బంధం మరోసారి కేంద్ర బిందువైంది. తొలి బంతి నుంచి వీఐపీ గ్యాలరీలో కూర్చొని మ్యాచ్‌ను తిలకిస్తున్న అనుష్కా... మ్యాచ్ గెలవగానే ఒక్కసారిగా మైదానంలోకి పరుగెత్తుకొచ్చింది. వస్తూనే విరాట్‌ను హత్తుకొని ఆనందాన్ని పంచుకుంది. విరాట్ కూడా అంతే ప్రేమగా ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. కప్ గెలిచిన మధుర క్షణాలను ఆమె సమక్షంలో ఆస్వాదించాడు. తొలుత భారత్ గెలవగానే మైదానంలో ఉన్న విరాట్... గ్యాలరీలో కూర్చున్న అనుష్కా వైపు చూసి చేయి ఊపుతూ పలుకరించాడు. వెంటనే ఆమె చిరునవ్వుతో అతడికి అభివాదం చేసింది. కాసేపటికి మైదానంలోకి వచ్చి, విరాట్ చేయిలో చేయి వేసి ఎంతో అపరూపంగా అతడిని చూస్తూ నిలుచుంది.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కానీ ఒకరి భావాలను ఒకరు పంచుకున్నారు. పక్కపక్కనే ఉన్నా... పెదవులు కదలకుండా కళ్లతోనే సంభాషించుకున్నారు. ఒకరికి ఒకరుగా... ఎంతో సౌకర్యంగా కనిపించారు. ఒక అందమైన బంధం దృఢంగా, కలకాలం నిలబడాలంటే ఏమేం కావాలి? అవన్నీ వీరి అనుబంధంలో ప్రతిబింబించాయి. ఇది ఆరోగ్యకరమైన ఒక మంచి వైవాహిక బంధానికి ప్రతీక అనేది ఫ్యామిలీ కౌన్సిలర్ల మాట. బయటకు వచ్చినప్పుడే కాదు... ఇంట్లో కూడా విరుష్కాలు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారనేది ఇన్‌స్టాలో వాళ్ల ఫొటోలు, వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఒకరి ప్రతిబింబం మరొకరిలో ప్రతిబింబిస్తుంది.
ఇవి కూడా చదవండి:
BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..