Veteran actress Pakeeza: చివరి వరకూ ఇక్కడే
ABN , Publish Date - Dec 31 , 2025 | 03:49 AM
ఎంజీఆర్ నామకరణం చేశారు... ‘వాసుకి’ అని. తమిళ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘పాకీజా’గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. హాస్యం పండించినవి... న
ఎంజీఆర్ నామకరణం చేశారు... ‘వాసుకి’ అని. తమిళ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘పాకీజా’గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. హాస్యం పండించినవి... నటనతో మెప్పించినవి... వైవిధ్యమైన పాత్రలు... నూట యాభైకి పైగా చిత్రాలు. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న పాకీజా ఇప్పుడు కష్టాలతో కాపురం చేస్తున్నారు. నా అన్నవారు లేక... కోనసీమ జిల్లా రావులపాలెంలోని వృద్ధాశ్రమంలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఆమె ‘నవ్య’తో తన పయ్రాణం గురించి ఇలా చెప్పుకొచ్చారు.
‘‘జీవితం ఎప్పుడు ఏ మలుపు తీసుకొంటుందో చెప్పలేం. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేను... నేడు ఇలాంటి క్లిష్ట పరిస్థితిల్లో ఉంటానని అస్సలు ఊహించలేదు. నా అసలు పేరు... వాసుకి క్రిష్ణన్. తమిళనాడులోని మదురైకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కారైకుడి మా స్వస్థలం. అమ్మ భాగ్యలక్ష్మి. నాన్న క్రిష్ణన్. నాకు ఒక చెల్లి. పేరు... తమిళ అరసి. పలు కారణావల్ల నా చదువు పదో తరగతితోనే ఆగిపోయింది. ఎంజీఆర్‌తో కలిసి మా నాన్న రాజకీయాల్లో తిరిగేవారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంజీఆర్ మా ఊరు వచ్చిన సమయంలో నాకు ‘వాసుకి’ అని నామకరణం చేశారట. నేను కూడా నాన్న బాటలోనే నడిచాను. మాజీ సీఎం జయలలిత ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొనేదాన్ని. ఎంజీఆర్, జయలలిత... ఇద్దరూ నాకు ఇష్టమైన వ్యక్తులు. అందుకు గుర్తుగా నా రెండు చేతుల మీద వారి పేర్లు పచ్చబొట్టు వేయించుకున్నాను. జీవితం ఆనందంగా సాగిపోయేది. అయితే జయలలిత చనిపోయాక నాకు కష్టాలు మొదలయ్యాయి.
తెలుగులోకి అలా...
తెరపై కనిపించాలనే కోరిక నాకు చిన్నప్పటి నుంచీ బలంగా ఉండేది. అటువైపు ప్రయత్నిస్తానంటే ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. నేను పట్టువదల్లేదు. ఎలాగో ఇంట్లోవాళ్లను ఒప్పించి, చెన్నై వెళ్లి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. నాన్నకు ఎంజీఆర్‌తో పరిచయంవల్ల మార్గం సుగమం అయింది. 1987లో హీరో ప్రభు చిత్రంతో తొలిసారి తెరపై నన్ను నేను చూసుకున్నాను. అక్కడి నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. 1991లో విడుదలైన ‘అసెంబ్లీ రౌడీ’లో పాకీజాగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాను. ఇది తమిళ చిత్రం ‘వేలై కిడైచుడుచ్చు’కు రీమేక్. అందులో నా పాత్ర చూసిన మోహన్‌బాబు గారు... తెలుగులో కూడా నన్నే చేయమన్నారు. అలా ‘పాకీజా’గా ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యాను.
పెళ్లి తరువాత...
ఇప్పటికి తమిళంలో వంద, తెలుగులో యాభైకి పైగా సినిమాల్లో నటించాను. వరుస ప్రాజెక్ట్‌లు, అందుకు తగిన డబ్బు... జీవితం సాఫీగా సాగిపోతోంది. సివిల్ ఇంజనీర్ రాజ్‌కుమార్‌తో ప్రేమలో పడ్డాను. ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. కానీ కొంత కాలానికే ఆ సంతోషం ఆవిరైపోయింది. తను మద్యానికి బానిసయ్యాడు. తాగుడు కోసం నా దగ్గరున్న డబ్బు, బంగారం... మొత్తం కరిగించేశాడు. మరోవైపు అమ్మకు క్యాన్సర్ రావడంతో... వైద్యానికి నా శక్తికి మించి డబ్బు ఖర్చు పెట్టాల్సివచ్చింది. అదే సమయంలో నాన్న మరణించడంతో, కుటుంబ భారం నాపై పడింది. కొన్నాళ్లకు వ్యసనాల నుంచి బయటపడలేక నా భర్త కూడా మరణించాడు. ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడ్డాను.
ఏ దిక్కూ లేక...
అరవై ఏళ్ల వయసులో ఆదుకొనేవారు లేక అవస్థలు పడ్డాను. నాదనుకున్న తమిళ పరిశ్రమ నన్ను అసలు పట్టించుకోలేదు. అక్కడ ఇక్కడా తిరిగి చివరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం వచ్చాను. ఇక్కడి సీఆర్సీ ఓల్డేజ్ హోమ్‌లో ఆశ్రయం పొందాను. నా పరిస్థితి గురించి ‘ఆంధ్రజ్యోతి’లో ఒక కథనం ప్రచురితమైంది. అది చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారు స్పందించారు. రెండు లక్షల తక్షణ సాయం అందించారు. చిరంజీవి గారు, నాగబాబు గారు ఆర్థికంగా నాకు అండగా నిలిచారు. దాంతో నాకు కొంత భరోసా, ఆసరా లభించాయి. మోహన్‌బాబు గారి కుటుంబం నా కళ్లకు ఆపరేషన్ చేయించింది. రవితేజ కూడా సాయం చేశారు. ఇక్కడికి వచ్చాక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు నన్ను సత్కరించారు. అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.’’
-ఇరగవరపు రవిశంకర వేణుగోపాల్, రావులపాలెం