వందే అనిలాత్మజం
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:42 AM
రావణ సంహారం అనే లక్ష్యం దిశగా రామాయణ గాథ నడవడంలో ప్రధాన పాత్ర హనుమంతుడిదే. అందుకే...గోష్పదీకృత వారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం... అన్నారు. ‘‘సముద్రాన్ని గోవు పాదంలా...

పర్వదినం
శ్రీరామదూత అయిన హనుమంతుడు అమేయ బలసంపన్నుడు. ఆయన నామ స్మరణతో భయాందోళనలు తొలగిపోతాయని, భూతప్రేతాదులు పారిపోతాయనీ ప్రతీతి. భక్తుల పాలిట కల్పవృక్షమైన ఆంజనేయుడు బలం, భక్తి, వినయం, విధేయతలకు ప్రతిరూపం. చైత్ర పౌర్ణమినాడు విజయప్రదాత అయిన హనుమద్విజయోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇంతకీ ఈ రోజు ప్రత్యేకత ఏమిటి?
రావణ సంహారం అనే లక్ష్యం దిశగా రామాయణ గాథ నడవడంలో ప్రధాన పాత్ర హనుమంతుడిదే. అందుకే...గోష్పదీకృత వారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం... అన్నారు. ‘‘సముద్రాన్ని గోవు పాదంలా భావించి దాటినవాడు, రాక్షసులను దోమల్లా పరిగణించి మట్టుపెట్టినవాడు, ‘రామాయణం’ అనే మాలలో రత్నంగా భాసిల్లినవాడు అయిన వాయుపుత్రుడికి నమస్కారాలు’’ అని దీని భావం. అంతటి మహనీయుడైన హనుమంతుడి జయంతిని ఏ రోజు నిర్వహించాలనే విషయంలో సందిగ్ధత ఉంది. ఉత్తర భారతదేశ ప్రజలు హనుమజ్జయంతిని చైత్ర పౌర్ణమి నాడు జరుపుకొంటారు. తమిళనాడులో మార్గశిర అమావాస్య నాడు, ఒడిశాలో మేష సంక్రాంతి రోజున నిర్వహిస్తారు. తెలుగు ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమిని హనుమద్విజయోత్సవంగా, వైశాఖ బహుళ దశమిని హనుమజ్జయంతిగా జరుపుకొనే ఆనవాయితీ కనిపిస్తుంది. వైశాఖ మాసం కృష్ణపక్షంలోని దశమి మంగళవారం నాడు... పూర్వాభాద్ర నక్షత్రంలో హనుమంతుడు జన్మించాడని పండితులు పేర్కొంటున్నారు.
‘‘పరాశర సంహితలోని ‘వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే... పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే...’ అనే శ్లోకాన్ని దీనికి ప్రమాణంగా తీసుకోవాలి’’ అని చెబుతున్నారు.
లంకాదహనం... శ్రీరామ సత్కారం
హనుమద్విజయోత్సవానికి సంబంధించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. సీతను అన్వేషిస్తున్న హనుమంతుడు... లంకలో ఆమెను కనుగొన్నాడు. ఆ సంతోషంలో అశోక వనాన్ని నాశనం చేశాడు. రావణుడి సైనికులు ఆయనను బంధించి, తోకకు నిప్పు అంటిస్తే... ఆ నిప్పుతో లంకాదహనం చేశాడు. ఆ రోజు చైత్ర పౌర్ణమి. రావణ సైన్యంపై హనుమంతుడు సాధించిన విజయానికి చిహ్నంగా ఈ వేడుకలను నిర్వహించుకోవడం సంప్రదాయంగా మారిందనేది ఒక కథ. కాగా, మరో కథ ప్రకారం.. రావణ సంహారం తరువాత అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడైన రాముడు... తన విజయానికి ఎంతగానో దోహదపడిన హనుమంతుణ్ణి ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని, ఘనంగా సత్కరించాడు. చైత్ర పౌర్ణమి నాడు జరిగిన ఈ సత్కారానికి చిహ్నంగా... ఆ రోజును ప్రజలు హనుమద్విజయోత్సవంగా నాటి నుంచి జరుపుకొంటున్నారు.
ఏం చేయాలి?: హనుద్విజయోత్సవం నాడు హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్తోత్రాలను పఠించడం, పండ్లను, వడమాలను, అప్పాల మాలను, తమలపాకుల దండను సమర్పించడం, సిందూరంతో పూజించడం ద్వారా అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. అలాగే చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకూ... నలభై రోజుల పాటు హనుమాన్ చాలీసాను వీలైనన్నిసార్లు పఠిస్తే హనుమంతుడి అనుగ్రహం లభిస్తుందనేది పెద్దల మాట.
హనుమంతుడి జయంతిని ఏ రోజు నిర్వహించాలనే విషయంలో సందిగ్ధత ఉంది. ఉత్తర భారతదేశ ప్రజలు హనుమజ్జయంతిని చైత్ర పౌర్ణమి నాడు జరుపుకొంటారు. తమిళనాడులో మార్గశిర అమావాస్య నాడు, ఒడిశాలో మేష సంక్రాంతి రోజున నిర్వహిస్తారు. తెలుగు ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమిని హనుమద్వియోత్సవంగా, వైశాఖ బహుళ దశమిని హనుమజ్జయంతిగా జరుపుకొనే ఆనవాయితీ కనిపిస్తుంది.
(రేపు హనుమద్విజయోత్సవం)
ఇవి కూడా చదవండి..