Share News

Glow of Tradition: దీప కాంతుల ధగధగలు

ABN , Publish Date - Oct 19 , 2025 | 05:00 AM

దీపావళి పండుగ రోజున ఇల్లంతా దీపాలతో అలంకరించుకుంటూ ఉంటాం. పూజ సమయంలో మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితోపాటు ఒత్తులు వేసి వెలిగిస్తాం..

Glow of Tradition: దీప కాంతుల ధగధగలు

దీపావళి పండుగ రోజున ఇల్లంతా దీపాలతో అలంకరించుకుంటూ ఉంటాం. పూజ సమయంలో మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితోపాటు ఒత్తులు వేసి వెలిగిస్తాం. ఇంటిని అలంకరించడానికి కొవ్వొత్తులు, మైనం దీపాలు, ఎలక్టిక్‌ దీపాలు, రంగురంగుల ఎల్‌ఈడీ లైట్లు ఉపయోగిస్తుంటాం. వీటితోపాటు ప్రస్తుతం రకరకాల దీపాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దామా..!

1.jpg

వేలాడే దీపాలు

దేవతా మూర్తుల విగ్రహాలు, నెమళ్లు, హంసలు, శంఖు చక్రాలు, కలశం రూపాలతో కూడిన దీపపు కుందులకు పొడవాటి చెయిన్‌, హుక్‌ అమరుస్తారు. పండుగ రోజున వీటిని పూజగదిలో, హాల్లో వేలాడదీసుకుని చక్కగా వెలిగించుకోవచ్చు. పండుగ తరువాత దీపం వెలిగించకపోయినా డెకరేషన్‌ ఐటెమ్స్‌గా నిలిచి ఉంటాయి. మట్టి, ఇత్తడి, పంచలోహాలతో రూపొందించిన రకరకాల వేలాడే దీపాలు అందుబాటులో ఉన్నాయి.

2.jpg

స్టాండ్‌ దీపాలు

దీపావళి రోజున ఇంట్లో, ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసి పూలతో అలంకరించి సాయంత్రం కాగానే దీపాలు పెట్టుకుంటాం. ఇలా చేయడం కొంచెం శ్రమ అనుకునేవారికోసమే స్టాండ్‌ దీపాలు వచ్చేశాయి. పండుగ శోభ ఉట్టిపడేలా వివిధ ఆకారాల్లో ఇవి లభ్యమవుతున్నాయి. వీటిని తెచ్చుకుని ఇంట్లో అందంగా అమర్చుకుని దీపాలు వెలిగిస్తే చాలు. ఇంటికి ఎలాంటి అలంకరణ చేయనవసరం లేదు.


3.jpg

3డీ దీపాలు

దీపం వెలిగించగానే చుట్టూరా అందమైన ముగ్గు ప్రత్యక్షమవుతుంది. అయిదారు దీపాలను పూజగదిలో లేదా హాల్‌ మధ్యలో అందంగా అమర్చి వెలిగిస్తే చాలు చక్కని రంగవల్లి ఆవిష్కృతమవుతుంది. నూనెతో వెలిగించేవి, మైనంతో తయారుచేసినవి, నీళ్లు పోస్తే వెలిగేవి అందుబాటులో ఉన్నాయి. ఎల్‌ఈడీ బల్బులు, వాటర్‌ సెన్సర్‌ టెక్నాలజీలతో రూపొందించిన రంగురంగుల తామర పువ్వుల దీపాలను ఓ నీళ్ల కంచంలో ఉంచితే చాలు ఇల్లంతా పండుగ శోభతో మెరిసిపోతుంది.

4.jpg

మంత్ర దీపం

పండుగ రోజున మనసారా దేవుని స్మరించుకుంటూ దీపం వెలిగిస్తాం. వెంటనే దీప శ్లోకం లేదా గాయత్రీ మంత్రం చదువుకుంటూ ఉంటాం. అవి చదవడం రానివారి కోసమే ఈ మంత్ర దీపం అందుబాటులోకి వచ్చేసింది. ఇది ఎలక్ట్రిక్‌ దీపం. దీనికి చిన్న ఎల్‌ఈడీ బల్బు అమర్చి ఉంటుంది. దీపం వెనక ఉన్న మీట నొక్కగానే బల్బు దీపంలా వెలుగుతుంది. అంతేకాదు గాయత్రీ మంత్రం, ఓంకారం, పంచాక్షరీ మంత్రం ఇలా మనకు నచ్చిన చాంటింగ్‌ వినవచ్చు. ఈ దీపం రీఛార్జబుల్‌ కూడా.

5.jpg

నీళ్ల దీపాలు

పేరుతోనే అందరిలో ఉత్సుకత కలిగిస్తుంటాయి ఈ దీపాలు. ప్రమిదలో యానోడ్‌, క్యాథోడ్‌ అనే రెండు వైర్లతోపాటు బటన్‌ సెల్‌, సెన్సర్‌ అమరుస్తారు. ప్రమిదలో నీళ్లు పోయగానే సెన్సర్‌ ద్వారా వైర్ల మధ్య కరెంట్‌ ప్రవహిస్తుంది. దీంతో బల్బు వెలుగుతుంది. ఒక్కో బటన్‌ సెల్‌ సుమారు 50 గంటలపాటు బల్బుని వెలిగిస్తుంది. పువ్వులు, కొవ్వొత్తులు, కుందులు ఇలా రకరకాల ఆకారాల్లో నీటి దీపాలు లభ్యమవుతున్నాయి. పండుగ రోజునే కాదు చిన్న ఫంక్షన్లు, పూజలు, ఇతర వేడుకల సమయాల్లో; గృహాలంకరణకు కూడా ఈ నీటి దీపాలను వెలిగించుకోవచ్చు.

Updated Date - Oct 19 , 2025 | 09:00 AM