Share News

uterus prolapse: గర్భాశయం జారితే?

ABN , Publish Date - Nov 11 , 2025 | 01:11 AM

గర్భాశయం కిందకు జారితే అసౌకర్యంతో పాటు మూత్రాశయ, విసర్జక వ్యవస్థలకు కూడా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఈ సమస్యను సకాలంలో సరిదిద్దుకోవాలంటున్నారు గైనకాలజిస్ట్‌ అండ్‌ అబ్‌స్టెట్రీషియన్‌ డాక్టర్‌ పూజిత సూరనేని....

uterus prolapse: గర్భాశయం జారితే?

గర్భాశయం కిందకు జారితే అసౌకర్యంతో పాటు మూత్రాశయ, విసర్జక వ్యవస్థలకు కూడా ఆటంకం కలుగుతుంది. కాబట్టి ఈ సమస్యను సకాలంలో సరిదిద్దుకోవాలంటున్నారు గైనకాలజిస్ట్‌ అండ్‌ అబ్‌స్టెట్రీషియన్‌ డాక్టర్‌ పూజిత సూరనేని.

గర్భాశయం కిందకు జారే పరిస్థితికీ వయసుకూ సంబంధం లేదు. 23 ఏళ్ల యువతుల్లో కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చు. బాల్యం నుంచి కండరాల సమస్యలు ఉన్న యువతుల్లో ఈ సమ స్య తలెత్తే అవకాశాలు ఎక్కువ. సిజేరియన్‌ ప్రసవాలు చేయించుకున్న మహిళలతో పోలిస్తే, సాధారణ ప్రసవం జరిగిన మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగని ప్రతి మహిళా ఈ సమస్యను ఎదుర్కొంటుందని అనుకోడానికి వీల్లేదు. కండరాలు, కొల్లాజన్‌, కణజాలాల పటుత్వం తక్కువగా ఉన్న వాళ్లు, ప్రసవంతో కటి కండరాలు బలహీనపడిన వాళ్లలో, 50 ఏళ్లు పైబడిన తర్వాత ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువ.

వీళ్లలోనే ఎందుకంటే?

సాధారణ ప్రసవమైన మహిళల్లో ఈ సమస్య తలెత్తే అవకాశాలు కాస్త ఎక్కువ. అయితే వైద్యుల పర్యవేక్షణలో సాధారణ ప్రసవం జరిగినప్పుడు, ఎపిషాటమీ అనే కోత సహాయంతో, గర్భాశయం ఒత్తిడికి లోనవకుండా, ప్రసవం సుఖంగా జరిగిపోయేలా వైద్యులు తోడ్పడతారు. అలాగే గర్భంతో సాగిన గర్భాశయం తిరిగి సాధారణ స్థితికి కుంచించుకుపోడానికి ప్రసవానంతరం ఆరు వారాల సమయం పడుతుంది. కాబట్టి అప్పటివరకూ శరీరానికి విశ్రాంతినివ్వాలి. కానీ ఇంటి ప్రసవాలు చేయించుకున్న సందర్భాల్లో ప్రసవం కోసం తొందరపెట్టడం వల్ల గర్భాశయం ఒత్తిడికి లోనై, కండరాలు బలహీనపడతాయి. గర్భధారణతో పెరిగిన బరువును త్వరగా వదిలించుకోవాలనే ఆలోచనతో ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోకుండానే వెంటనే వ్యాయామాలు మొదలుపెట్టడం కూడా


సరికాదు. దశల ఆధారంగా...

ప్రసవంతో గర్భాశయం కొంత మేరకు కిందకు జారుతుంది. యోని ద్వారం నుంచి 8 సెంటీమీటర్ల మేరకు జారితే ఫరవాలేదు. అయితే అంతకు మించి 6, 5, 2 సెంటీమీటర్ల దూరానికి జారిపోతూ ఉంటే యుటెరస్‌ ప్రొలా్‌ప్సగా పరిగణించాల్సి ఉంటుంది. చివరి దశలో మూత్రవిసర్జన సమయంలో, లేదా బలంగా ముక్కినప్పుడు, పొట్ట మీద ఒత్తిడి పడే వ్యాయామాలు చేసినప్పుడు గర్భాశయం యోని వరకూ జారినట్టు తెలిసిపోతుంది. అయితే మొదటి దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు కాబట్టి ఎవరూ పట్టించుకోరు. కానీ రెండో దశలో పొట్ట మీద ఒత్తిడి పడినప్పుడు, మూడో దశలో ఒత్తిడి పడకుండానే గర్భాశయం జారినట్టు తెలిసిపోతుంది. నాలుగో దశలో గర్భాశయం యోనిద్వారం నుంచి బయటకొచ్చేస్తుంది. ఈ దశను గ్రేడ్‌ 4 యువి ప్రొలాప్స్‌ అంటారు. అయితే మెనోపాజ్‌కు చేరుకున్న మహిళల్లో ఈ పరిస్థితి ఎక్కువ. పైబడే వయసులో శరీరంలోని మిగతా కండరాల్లాగే గర్భాశయ కండరాలు కూడా సాగే గుణాన్ని కోల్పోయి, బలహీనపడిపోవడంతో, యుటెరస్‌ ప్రొలాప్స్‌ ఒకటి రెండు దశల నుంచి మూడు, నాలుగు దశలకు చేరుకుంటూ ఉంటుంది. యుటెరస్‌ ప్రొలాప్స్‌ వంశపారంపర్యం కూడా! కాబట్టి 50 ఏళ్లు దాటిన తర్వాత ఈ కోవకు చెందిన మహిళల్లో గర్భాశయం కిందకు జారే సమస్య తలెత్తుతూ ఉంటుంది.


సమస్యలు ఇవే!

గర్భసంచి ముందు మూత్రాశయం, గర్భాశయం వెనక విసర్జక అవయవాలు ఉంటాయి. కాబట్టి గర్భాశయం కిందకు జారినప్పుడు, ఈ అవయవాలు కూడా స్థానభ్రంశం చెందుతాయి. దాంతో మూత్ర విసర్జన అసంపూర్తిగా జరుగుతూ, యూరినరీ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. అలాగే మలవిసర్జన కూడా ఇబ్బందిగా మారి, మలబద్ధకం మూలంగా మొలలు, షిషర్లు వేధిస్తాయి.

సమర్థమైన చికిత్సలున్నాయి

మొదటి రెండవ దశ యుటెరన్‌ ప్రొలా్‌ప్సతో ఇబ్బందిపడే యువతులకు సర్విక్స్‌కు రింగ్‌ బిగించి, సర్విక్స్‌ను వెనక్కి నెట్టి పైన కూర్చోబెట్టవచ్చు. అలాగే గర్భాశయాన్ని పైకి లేపి, లోపలి పొట్టకు తగిలించే స్లింగ్‌ సర్జరీ కూడా తోడ్పడుతుంది. ఈ చికిత్సతో మూత్రాశయ సమస్యను నిరోధించుకోవచ్చు. యుటెరస్‌ ప్రొలాప్స్‌ నాలుగో దశకు చేరుకున్నప్పుడు సర్జరీని ఎంచుకోక తప్పదు. వృద్ధులైన మహిళలకు నాలుగో దశ యుటెరస్‌ ప్రొలాప్స్‌ ఉన్నప్పుడు, వెజైనల్‌ హిస్ట్రక్టమీ ద్వారా గర్భసంచిని తొలగించి, మూత్రాశయాన్ని పైకి నెట్టి సమస్యను సరిదిద్దవచ్చు. కొందర్లో గర్భసంచి జారకపోయినా, మూత్రాశయం జారుతుంది. ఇలాంటి సందర్భాల్లో యాంటీరియర్‌ కాల్పొరఫీ అనే చికిత్స ద్వారా మూత్రాశయాన్ని పైకి నెట్టి, కుట్టు వేసి, దాని స్థానంలో అమర్చుతారు. పోస్టీరియర్‌ రెక్టోసీల్‌లో భాగంగా కిందకు జారిన విసర్జకాయవాన్ని పైకి నెట్టి కుట్టువేసి, అమరుస్తారు. ఈ రెండు చికిత్సలూ యోని ద్వారం గుండానే జరుగుతాయి. అయితే తాజా ల్యాప్రోస్కోపీ చికిత్సతో ఈ చికిత్సలు మరింత సులభతరం అయ్యాయి. గర్భాశయం పూర్తిగా కిందకు జారినప్పుడు, దానికి మెష్‌ను అమర్చి, ట్యాకర్‌ ద్వారా శాక్రమ్‌ ఎముకకు తగిలించవచ్చు. ఈ ‘ల్యాప్రోస్కోపిక్‌ స్కాల్పోకాల్పోప్రెక్సీ’ చికిత్సలో మూత్రాశయాన్నీ విసర్జకావయవాన్నీ తాకే అవసరం ఉండదు కాబట్టి అవి రెండూ ఏమాత్రం దెబ్బతినకుండా వాటి స్థానాల్లోకి చేరుకోగలుగుతాయి. ఇలా యుటెరన్‌ ప్రొలాప్స్‌ దశ ఆధారంగా చికిత్స కోసం మొదట రింగ్స్‌ను ఎంచుకుంటారు. తర్వాత వెజైనల్‌ హిస్ట్రక్టమీ, అంతిమంగా ల్యాప్రోస్కోపిక్‌ స్కాల్పోకాల్పోప్రెక్సీని వైద్యులు ఎంచుకుంటారు.


2.jpg

నియంత్రణ ఇలా...

యుటెరస్‌ ప్రొలా్‌ప్సను నివారించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అదెలాగంటే...

  • ఈ సమస్య కుటుంబంలో ఉన్నప్పుడు, కటి కండరాలను బలపరిచే వ్యాయామాలు యుక్తవయసు నుంచే మొదలుపెట్టుకోవాలి

  • జన్యుపరమైన కండరాల సమస్య ఉన్నప్పుడు, ఆ వ్యాధికి చికిత్స

  • తీసుకోవాలి

  • ప్రసవానంతరం ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి

  • ప్రసవానంతరం రెండు నెలల నుంచి వ్యాయామాలు మొదలుపెట్టాలి

  • నడకతో మొదలుపెట్టి క్రమేపీ వ్యాయామాల తీవ్రతను పెంచుకోవాలి

  • యోగాలో పెల్విక్‌ ఫ్లోర్‌ వ్యాయామాలు ఎంచుకోవాలి

Updated Date - Nov 11 , 2025 | 01:11 AM