Headache: ఈ తలనొప్పి ఎందుకు
ABN , Publish Date - May 01 , 2025 | 04:12 AM
తలలో ఒక వైపు తీవ్రంగా వచ్చే మైగ్రేన్ నొప్పి, నిద్రలేమి, ఒత్తిడి, హార్మోన్ల మార్పుల వల్ల కలుగుతుంది. దీనిని ఆహార మార్పులు, గృహ చిట్కాలు, న్యూరోఫిజీయన్ సలహాతో నియంత్రించవచ్చు.
డాక్టర్! నా వయసు 30. గత కొంతకాలంగా విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నాను. ఇది మైగ్రేన్ అని అనుమానంగా ఉంది. ఈ సమస్యకు సమర్థవంతమైన చికిత్స సూచించండి?
- ఓ సోదరి, హైదరాబాద్
తలలోని రక్తనాళాల మీద ఒత్తిడితో మొదలయ్యే మైగ్రేన్ నొప్పి నరాలకు సంబంధించిన వ్యాధి. తలలో ఓ వైపు మాత్రమే వేధిస్తుంది కాబట్టి దీన్ని పార్శ్వపు నొప్పి అని కూడా అంటారు. తరచూ వచ్చే ఈ నొప్పి తీవ్రత ఒక మోస్తరు నుంచి తీవ్రంగా ఉండే వీలుంది. ఇది పురుషుల్లో కంటే స్త్రీలలో మూడు రెట్లు ఎక్కువ.
లక్షణాలు ఇలా ఉంటాయి:
4 నుంచి 72 గంటల పాటు వేధించే ఈ నొప్పి లక్షణాలు ఇలా ఉంటాయి
తలనొప్పి ఓ వైపు మాత్రమే ఉండడం
చీకాకు, మానసిక స్థితి సరిగా ఉండకపోవడం
ఎండతో, శబ్దాలతో సమస్య తీవ్రమవడం
వాంతి చేసుకోవడం, వాంతి వస్తున్న భావనకు గురికావడం
ఈ నొప్పితో దైనందిన కార్యక్రమాలకు ఆటంకం కలగడం
కంటిచూపు సరిగా ఉండకపోవడం
కారణాలు: నిద్రలేమి, డిప్రెషన్, ఎక్కువసేపు ఎండలో ఉండడం, మహిళల్లో హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే సమయాలైన బహిష్టుకు ముందు లేదా తర్వాత ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణించేవారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. మైగ్రేన్ వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. ఈ సమస్య ఉంటే న్యూరోఫిజీయన్‌ను సంప్రతించాలి. ఎమ్మారై/సిటి స్కాన్, రక్తపరీక్షలు, ఇఇజి స్కాన్‌తో సమస్యను నిర్థారించుకోవచ్చు. ఈ సమస్యకు పూర్తి చికిత్స లేకపోయినా, ఉపశమనానికి చికిత్సలు ఉన్నాయి.
గృహ చిట్కాలు: చీకటి గదిలో ఎటువంటి శబ్దాలు లేకుండా నిద్రపోవడానికి ప్రయత్నించాలి
చల్లని వస్తువులు, ఐస్ ప్యాక్ నుదుటి మీద పెట్టుకోవాలి.
ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
ఆహారపుటలవాట్లు: పుదీనాలోని మెంథాల్‌కు మైగ్రేన్‌ను తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి ఆహారంలో పుదీనా చేర్చుకుంటూ ఉండాలి.
అల్లంలోని జింజెరాల్ అనే రసాయనం కూడా మైగ్రేన్‌ను తగ్గిస్తుంది. కాబట్టి అల్లం కూడా ఆహారంలో చేర్చుకోవాలి.
మెగ్నీషియం ఎక్కువగా ఉండే పాలకూర, చిలకడదుంపలు తీసుకోవాలి.
ఈ ఆహారం తీసుకుంటూ, లక్షణాలు కనిపించినప్పుడు న్యూరోఫిజీయన్‌ను కలవాలి.
డాక్టర్ దుత్తా ప్రవల్లిక,
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, హైదరాబాద్
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..