Hyacinth into High Quality Paper: కలుపు మొక్కతో కాగితం
ABN , Publish Date - Nov 13 , 2025 | 06:21 AM
చెరువులు, కుంటల్లో పరుచుకొన్న గుర్రపుడెక్క అందాలు... వాటి నుంచి విచ్చుకొనే పూలు... చూడ్డానికి ఇంపుగా ఉంటాయి. మనసును ఆహ్లాదంలో తేలియాడిస్తాయి...
చెరువులు, కుంటల్లో పరుచుకొన్న గుర్రపుడెక్క అందాలు... వాటి నుంచి విచ్చుకొనే పూలు... చూడ్డానికి ఇంపుగా ఉంటాయి. మనసును ఆహ్లాదంలో తేలియాడిస్తాయి. ‘కానీ అవి అంతకంతకూ పెరిగి... జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసి... చెరువులు, సరస్సులకు ముప్పుగా పరిణమిస్తాయ’ని అంటారు సుస్మిత కృష్ణన్. అందుకే ఆ వ్యర్థంతో కాగితం తయారు చేసి... జటిలమైన సమస్యకు చక్కని పరిష్కారం చూపారు ఈ 25 ఏళ్ల పర్యావరణ శాస్త్రవేత్త. ఏమిటా పరిష్కారం..? ఆమె మాటల్లోనే...
‘‘ఎందుకో తెలియదు... చిన్నప్పటి నుంచి నాకు పర్యావరణం, దానిపై ఆధారపడ్డ జీవజాతుల గురించి ఆసక్తి ఎక్కువ. అందుకే నా చదువు కూడా అదే దారిలో సాగింది. తమిళనాడులోని తిరుచిరాపల్లి మాది. స్థానిక ‘భారతీదాసన్ విశ్వవిద్యాలయం’లో లైఫ్ సైన్సె్‌సలో మాస్టర్స్ చేశాను. ఆ సమయంలోనే జీవజాతులు, పర్యావరణ వ్యవస్థల మధ్యనున్న సంక్లిష్టమైన సంబంధాన్ని గమనించాను. తరువాత 2019లో బెంగళూరు ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సె్‌స’లో ఇంటర్న్‌షి్‌పలో భాగంగా కీటకాల తెగుళ్లు, వాటివల్ల కలిగే ఆర్థిక నష్టాలపై అధ్యయనం చేశాను. గుర్రపుడెక్క మొక్కలు ఎంతలా చెరువంతటినీ ఆక్రమించుకొంటున్నాయో, అవి ఎంత జటిలమైన సమస్యగా మారుతున్నాయో అప్పుడే అర్థమైంది. దీనికి సరైన పరిష్కారం ఏమిటనే ఆలోచన నాలో మొదలైంది.
భిన్నాభిప్రాయాలు ఉన్నా...
రెండేళ్ల కిందట అలప్పుళ ‘ఎస్‌డీ కాలేజీ’ ప్రొఫెసర్ డాక్టర్ నాగేంద్రప్రభు నేతృత్వంలోని బృందంతో కలిసి నీటి మీద పెరిగే పూల మొక్కలపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేశాను. ఇది నాకు లోతైన అవగాహన కలిగించింది. సమస్య పరిష్కారం దిశగా తొలి అడుగు వేయడానికి దోహదపడింది. అయితే కొందరు పరిశోధకులు ఈ మొక్కలు చెరువుల్లోని కలుషిత నీటిని శుభ్రం చేయడానికి ఉపకరిస్తాయని చెబుతారు. అది నిజమే కావచ్చు. కానీ వాటివల్ల ప్రయోజనం కంటే జరిగే నష్టమే ఎక్కువనేది పర్యావరణ శాస్త్రవేత్తల పలు పరిశోధనలు చెబుతున్నాయి. అవి నీటి ప్రవాహానికి అడ్డుపడతాయి. ఆక్సిజన్ స్థాయిలను తగ్గించి, పర్యావరణ వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తాయి. వీటిని తొలగించినా... అత్యంత వేగంగా, అంటే వారం నుంచి రెండు వారాల్లోపు రెట్టింపు అవుతాయి. అంతెందుకు... మా తిరుచిరాపల్లిలోని నీటి వనరుల్లోనే ఇరవై కిలోమీటర్ల మేర ఈ మొక్కలు పరుచుకున్నాయి. ప్రతి వానాకాలానికి ముందు వాటిని తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. బుల్డోజర్ల సాయంతో రోజుల తరబడి కష్టపడితే రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ తొలగించడం సాధ్యంకావడంలేదు. ఇరవై లారీలకు మించిన వ్యర్థం, భారీ వ్యయం మిగులుతున్నాయి.
పరిశోధనతో కొత్త ఉత్సాహం...
అసోమ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నీటిపై పెరిగే కలుపు మొక్కలతో కొన్ని తెగలవారు బుట్టలు, బ్యాగ్‌ల లాంటివి తయారు చేస్తారు. అయితే వాటి తయారీ సులువు కాదు. చాలా సమయం పడుతుంది. అంత కష్టపడినా కొనేవారు తక్కువ. వీటన్నిటికీ పరిష్కారం కనుగొనే క్రమంలో మరింత అధ్యయనం అవసరమని భావించాను. అదే సమయంలో జర్మనీలోని ప్రతిష్ఠాత్మక ‘ఇంటర్నేషనల్ సస్టెయినబిలిటీ అకాడమీ (ఐఎ్‌సఏ) ఫెలోషిప్ దక్కింది. పర్యావరణ పరంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ప్రయత్నించే యువతకు ఈ ఫెలోషిప్ ఇస్తారు. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన పన్నెండు మందిలో భారత్ నుంచి నేనొక్కదాన్నే ఉన్నాను. అక్కడి ‘హాంబర్గ్ విశ్వవిద్యాలయం’లో కాగితం తయారీకి ఉపయోగించే వివిధ గుజ్జులపై పరిశోధన చేశాం. ఈ క్రమంలోనే నీటిలో పెరిగే కలుపు మొక్కల గుజ్జుపై చేసిన పరిశోధన ఆశ్చర్యకర ఫలితాలను ఇచ్చింది. కాగితం తయారీ ప్రక్రియలో సాధారణంగా వాడే చెట్ల గుజ్జుకు అరవై శాతం సోడా కలపాలి. అదే దీనికైతే ఆరు శాతం సరిపోతోంది. నాణ్యత కూడా ఎంతో మెరుగ్గా ఉంది.
జర్మనీ వెళ్లి వచ్చాక...
జర్మనీలో పరిశోధన నాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తిరిగి రాగానే కార్యక్షేత్రంలోకి దిగాను. గుర్రపుడెక్క మొక్కలతో సాధారణ కాగితానికి సరైన ప్రత్యామ్నాయ ఉత్పతి అందివ్వాలని అనుకున్నా. పేపర్ పరిశ్రమలను సంప్రతించి, వారికి దీని గురించి వివరించాను. నా పరిశోధనా పత్రాలు, సంబంధిత డేటానూ వారి ముందు పెట్టాను. కానీ వాళ్లకు నాపై నమ్మకం కలగలేదు. కొత్త విధానాన్ని చేపట్టడానికి సంకోచించారు. నా ప్రతిపాదనను తిరస్కరించారు. దాంతో నేనే ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను.

వర్క్‌షా్‌పలతో అవగాహన...
సాధ్యమైనంతమందికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వర్క్‌షా్‌పలు నిర్వహించాను. ముఖ్యంగా స్థానిక మహిళలకు అవగాహన కల్పించి, తయారీ ప్రక్రియను నేర్పించాను. కొన్ని కాలేజీ యాజమాన్యాలు ఆసక్తి కనబరిచాయి. తమ విద్యార్థులకు శిక్షణ ఇప్పించాయి. ఈ ప్రక్రియ చాలా సులువు. మొక్కల కాండాలను కోసి, ఎండబెట్టి, ఆల్కలైన్ సొల్యూషన్‌లో ఉడకబెడితే పీచు విడిపడుతుంది. పలు దశల తరువాత ఇది కాగితంగా మారుతుంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో, నాణ్యమైన పేపర్ ఉత్పత్తి చేయవచ్చు. పైగా పర్యావరణహితం. ఇప్పుడు చాలామంది ఔత్సాహికులు ఈ తరహా కాగితం తయారు చేస్తున్నారు. గ్రీటింగ్ కార్డులకు, కాలేజీలో జరిగే కార్యక్రమాలకు ఆ పేపర్‌నే ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మార్పునే నేను కోరుకున్నది.’’.
పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొంతమంది మహిళలకు వర్క్‌షా్‌పలు నిర్వహిస్తున్నాను. మరికొన్ని కళాశాలలు, ఇతర సంస్థలు ముందుకు వస్తున్నాయి. దీంతోపాటు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్ ప్లేట్లు, కప్‌లు కూడా చేయాలని ప్రయత్నిస్తున్నాను. దానివల్ల ఉత్పత్తిదారులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ఒక పరిశ్రమ స్థాయికి వీటి ఉత్పత్తిని తీసుకువెళ్లాలనేదే నా లక్ష్యం.