Stomach Ulcers: పొట్టలో పుండు ప్రమాదమా?
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:41 AM
కానీ కడుపులో మంటతో వేధించే 90 శాతం అల్సర్లకు పొట్టలో తిష్ఠ వేసిన ‘హెలికోబ్యాక్టర్ పైలోరి’ అనే బ్యాక్టీరియా కారణమని మీకు తెలుసా? అంతిమంగా క్యాన్సర్‌కు సైతం దారితీసే వీలున్న ఈ పెప్టిక్ అల్సర్ గురించి వైద్యులు ఏమంటున్నారంటే...
కడుపులో మంటకు కారాలు, మసాలాలు కారణమనుకుంటాం! యాంటాసిడ్లతో ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తాం! కానీ కడుపులో మంటతో వేధించే 90 శాతం అల్సర్లకు పొట్టలో తిష్ఠ వేసిన ‘హెలికోబ్యాక్టర్ పైలోరి’ అనే బ్యాక్టీరియా కారణమని మీకు తెలుసా? అంతిమంగా క్యాన్సర్‌కు సైతం దారితీసే వీలున్న ఈ పెప్టిక్ అల్సర్ గురించి వైద్యులు ఏమంటున్నారంటే...
పెళుసుబారిన ఎముకల దృఢత్వాన్ని పెంచే ఇంజెక్షన్లు వాడుకునేవాళ్లకు అల్సర్లు తలెత్తే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా హృద్రోగ మందులు వాడుకుంటున్న వాళ్లకు హెలికోబ్యాక్టర్ పైలోరి ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశాలు, పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కడుపులో పుండు.. అంటే ‘అల్సర్’ అన్నవాహిక చివరిభాగం, జీర్ణాశయం, చిన్నపేగు మొదటి భాగం (డియోడినం)లో తలెత్తవచ్చు. ఈ మూడు భాగాల్లో దేన్లో అల్సర్ తలెత్తినా దాన్ని పెప్టిక్ అల్సర్ డిసీజ్‌గానే భావించాలి. వీటిలో మరీ ముఖ్యంగా జీర్ణకోశం, చిన్నపేగు మొదటి భాగంలో అల్సర్లు తలెత్తే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా అల్సరుకు ముందు ఎసిడిటీ లక్షణాలు చాలా కాలం పాటు వేధిస్తాయి. ఛాతీలో మంట, పొట్టలో మంట మొదలైన లక్షణాలు తిన్న తర్వాత తలెత్తుతూ ఉంటాయి కాబట్టి అసలు కారణం ఆహారంలోనే ఉందని భ్రమపడుతూ ఉంటాం. నిజానికి కారాలు, మసాలాలు తినడం వల్ల కడుపులో పుండ్లు ఏర్పడవు. ఇది అపోహ మాత్రమే! ప్రసిద్ధ వైద్య శాస్త్రవేత్త, ఎల్లాప్రగడ సుబ్బారావు గారు, 1970లోనే ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ప్రధానంగా పొట్టలో అల్సర్లు ఒక బ్యాక్టీరియా వల్ల ఏర్పడతాయి. అదే...‘హెలికోబ్యాక్టర్ పైలోరి’. 1980 - 1981లో బ్యారీ మార్షల్ అనే వైద్యుడు ఈ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వల్లే అల్సర్లు తలెత్తుతున్నట్టు కనిపెట్టాడు. పొట్టలో అల్సర్లకు 85ు, చిన్నపేగు మొదటిభాగంలో అల్సర్లకు 90ు ఈ బ్యాక్టీరియానే కారణం.
అంతా ఆ బ్యాక్టీరియా వల్లే...
కలుషితమైన ఆహారం, నీటి ద్వారా పొట్ట లోపలికి చేరుకునే ఈ బ్యాక్టీరియా, దీర్ఘకాలిక నివాసాన్ని ఏర్పరుచుకుని, ప్రారంభ దశల్లో పొట్టలో ఆమ్ల ఉత్పత్తిని పెంచి, పొట్ట లోపల పూతకు కారణమవుతూ ఉంటుంది. వీటినే వైద్య పరిభాషలో... గ్యాస్ట్రిక్, డియోడనల్ ఎరోజన్స్ అంటారు. ఈ సమయంలో కడుపులో మంట, ఛాతీలో మంట, కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మంట, తిన్న తర్వాత మంట.. ఇలా భిన్నమైన లక్షణాలు మొదలవుతాయి. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సమస్యకు అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, వైద్యులను కలవకుండా సొంత వైద్యంతో ఉపశమనాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఎసిడిటీ లక్షణాలను నివారించే ఈ గ్యాస్ మందులు తక్షణ ఉపశమనాన్ని అందించగలుగుతాయి తప్ప, పొట్టలోని బ్యాక్టీరియాను చంపలేవు. కాబట్టి అసిడిటీ సమస్య మందులు వాడినప్పుడు తగ్గుతూ, మళ్లీ తిరగబడుతూ దీర్ఘకాలం పాటు వేధిస్తుంది. ‘నాకు గ్యాస్ట్రిక్ సమస్య ఉంది’ అనే భావనకు లోనయ్యే 90 శాతం మందిలో ఇదే బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ ఉంటుంది. ఈ సమస్య దీర్ఘకాలంలో అల్సర్‌కు దారి తీస్తుంది. అయితే ఈ బ్యాక్టీరియా పొట్టలోకి చేరిపోయిన ప్రతి ఒక్కరికీ అల్సర్ వచ్చేస్తుందని అనడానికి కూడా వీల్లేదు. అల్సర్లు, జన్యుపరంగా సంక్రమించవచ్చు. ‘ఒ’ రక్తగ్రూపు వ్యక్తుల్లో, పురుషుల్లో, ధూమపాన ప్రియుల్లో ఈ సమస్య ఎక్కువ. అలాగే నొప్పి నివారణ మాత్రలు ఎక్కువగా వాడుకునేవాళ్లలో కూడా అల్సర్లు తలెత్తే అవకాశాలు ఎక్కువ. వయసు పెరిగేకొద్దీ గ్యాస్ట్రిక్ అల్సరు తలెత్తే అవకాశాలు కూడా పెరుగుతాయి.

అల్సరు వచ్చిన తర్వాత...
అల్సర్లకు ముందు ఎసిడిటీ లక్షణాలు వేధిస్తే, అల్సరు ఏర్పడిన తర్వాత కొత్తలక్షణాలు మొదలవుతాయి. అవేంటంటే...
పొట్టలో వస్తే...
ఆహారం తీసుకున్న తర్వాత పొట్టలో నొప్పి
వాంతి వస్తున్న భావన కలగడం చిన్న పేగు మొదటి భాగంలో వస్తే...
సమయానికి భోజనం చేయనప్పుడు కడుపులో నొప్పి
మధ్య రాత్రి నొప్పితో నిద్ర మెలకువ అయిపోవడం
పొట్ట పైభాగంలో నొప్పి ఉన్న ప్రదేశాన్ని వేలితో చూపించగలగడం
ఒకే ఒక పరీక్షతో...
పొట్టలో అల్సరు ఉన్నదీ, లేనిదీ, అల్సరు ఉన్న ప్రదేశంతో పాటు హెలికోబ్యాక్టర్ పైలోరి బ్యాక్టీరియా ఉన్నదీ, లేనిదీ కూడా ఎండోస్కోపీ పరీక్షతో తెలుసుకోవచ్చు. భారతదేశంలో ఎండోస్కోపీకి అయ్యే ఖర్చు మూడు నుంచి మూడున్నర వేలు ఉంటుంది. ఎంతో మంది ఈ ఒక్క పరీక్షతో సమస్యను నిర్థారించుకోకుండా, సంవత్సరాల తరబడి నెలకు ఐదు నుంచి ఆరు వందల రూపాయలు యాంటాసిడ్ల కోసం ఖర్చు పెట్టేస్తూ, సమస్యతో బాధపడుతూనే ఉంటారు. కానీ ఎండోస్కోపీ పరీక్షతో సమస్యను నిర్థారించుకుని చికిత్స తీసుకుంటే ఈ సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి పొందవచ్చు.
సమస్య ముదిరిపోకుండా...
గ్యాస్ట్రిక్ అల్సర్‌ను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. హెలికోబ్యాక్టర్ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా తలెత్తిన గ్యాస్ట్రిక్ అల్సర్, దీర్ఘకాలంలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌గా పరిణామం చెందే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా గ్యాస్ట్రిక్ అల్సర్లు రక్తస్రావానికి కారణమై రక్తపు వాంతులు, రక్తపు విరోచనాలు లాంటి సమస్యలకు కూడా దారి తీస్తాయి. అలాగే చిన్నపేగు మొదటి భాగంలో తలెత్తే అల్సర్లను నిర్లక్ష్యం చేస్తే, రక్తస్రావం జరిగి, రక్తపు వాంతులు, రక్తపు విరోచనాలు వేధించవచ్చు. ఇలాంటప్పుడు అదే పనిగా యాంటాసిడ్లు వాడుకుంటే, చిన్న పేగు మొదటి భాగం ఇరుకుగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు డియోడినం లోపలి పొర చిరిగిపోయి అత్యవసర పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి ఎసిడిటీ రూపంలో బయల్పడే అల్సర్ ప్రారంభ దశను మొదట్లోనే గుర్తించి అప్రమత్తం కావాలి. రెండు నుంచి మూడు నెలలకు పైగా ఎసిడిటీ లక్షణాలు వేధించినా, రెండు నుంచి మూడు వారాలు మందులు వాడుకుని, వాటిని ఆపేసిన వెంటనే సమస్య తిరగబెడుతున్నా, ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోవాలి. ఈ సమస్యకు వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఈ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ తలెత్తవచ్చు. ఏదో ఒక సందర్భంలో మనందరం బయటి ఆహారం తింటూ ఉంటాం. కాబట్టి నీటి ద్వారా, ఆహార పదార్థాల ద్వారా హెలికోబ్యాక్టర్ పైలోరి బ్యాక్టీరియా మన పొట్టలోకి చేరిపోతూ ఉంటుంది. ఒకట్రెండు రోజుల పాటు ఎసిడిటీ లక్షణాలు తలెత్తి తగ్గిపోతే భయపడవలసిన అవసరం లేదు. కానీ వారాల తరబడి తరచూ ఇబ్బంది పడుతున్నవాళ్లు తప్పనిసరిగా వైద్యులను కలిసి పరీక్ష చేయించుకోవాలి.
అల్సర్లు రాకుండా...
బయటి ఆహారం మానేయాలి
ఎసిడిటీ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు
ఎంతో అరుదుగా తప్ప యాంటాసిడ్లు వాడుకోకూడదు
ధూమపానం, మద్యపానం మానేయాలి
నొప్పి నివారణ మందుల వాడకం పరిమితం చేయాలి
14 రోజుల్లో బ్యాక్టీరియా హతం
హెలికోబ్యాక్టర్ పైలోరి కారక ఇన్‌ఫెక్షన్‌ను సమూలంగా అంతం చేయడం ఎంతో సులభం. ఎమాక్సిసిలిన్, క్లారిత్రోమైసిన్, ఒక ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్... ఈ మూడు మాత్రల సమ్మేళనంతో, 14 రోజుల పాటు చికిత్స తీసుకుంటే, 95 శాతం మందిలో ఈ ఇన్‌ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోతుంది. మిగతా ఐదు శాతం మందిలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మూలంగా ఈ ఇన్‌ఫెక్షన్ అదుపులోకి రాకపోవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో హెలికోబ్యాక్టర్ పైలోరి చికిత్సలో క్లారిత్రోమైసిన్ రెసిస్టెన్స్ కనిపిస్తోంది. వీరికి క్లారిత్రోమైసిన్‌కు బదులుగా, లీవోఫ్లాక్సాసిన్‌ను ఇవ్వవలసి ఉంటుంది. ఈ 14 రోజుల చికిత్సతో గ్యాస్ట్రిక్ అల్సర్‌ను గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు దారి తీయకుండా నివారించుకోవచ్చు.
సర్జరీ అరుదుగానే...
జీర్ణాశయంలో లేదా చిన్నపేగు మొదటి భాగంలో రక్తస్రావం జరుగుతూ ఉంటే, దాన్ని నియంత్రించడం కోసం సర్జరీ అవసరమవుతుంది. డియోడినంలో పుండు పడితే వెంటనే సర్జరీ చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పేగులోని కొంత భాగాన్ని తొలగించి, బైపాస్ సర్జరీ చేయవలసి రావచ్చు. డియోడినం ఇరుకుగా మారినప్పుడు కూడా సర్జరీ చేయవలసి రావచ్చు.
ఈ యాంటాసిడ్లు సురక్షితం
తాత్కాలిక ఉపశమనం కోసం పరగడుపున వేసుకునే యాంటాసిడ్ మాత్ర, ద్రవరూపంలో ఉండే యాంటాసిడ్లు సురక్షితం. పది నుంచి పదిహేను రోజుల పాటు ఈ మాత్రను వాడుకోవచ్చు. కానీ ఇదే మాత్ర ప్రతి రోజూ సంవత్సరాల తరబడి వేసుకోవడం ప్రమాదకరం. యాంటాసిడ్ మాత్రలు పొట్ట లోపలి యాసిడ్ ఉత్పత్తిని బాగా తగ్గించేస్తాయి. వీటిని దీర్ఘకాలికంగా వాడుకోవడం వల్ల తినే ఆహారంలోని ఐరన్, క్యాల్షియం శోషణ చెందవు. దాంతో రక్తహీనత వేధిస్తుంది. ఎముకలు గుల్లబారిపోతాయి. కొంతమందిలో మూత్రపిండాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. పొట్టలోని ఆమ్లం పేగులకు రక్షణ కల్పిస్తుంది. వ్యాధికారక బ్యాక్టీరియా పేగుల్లోకి చేరుకోకుండా అడ్డుపడుతుంది. ఎప్పుడైతే యాంటాసిడ్లతో పొట్టలోని ఆమ్ల ఉత్పత్తిని అణచివేస్తామో, అప్పుడు పేగులకు ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు పెరుగుతాయి. న్యుమోనియా తలెత్తే అవకాశాలు కూడా పెరుగుతాయి.
డాక్టర్ సోమశేఖర రావు
సీనియర్ కన్సల్టెంట్,
గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్,
యశోద హాస్పిటల్స్, హైటెక్ సిటీ, హైదరాబాద్