Beauty Tips: కొత్తగా, మరింత అందంగా...
ABN , Publish Date - Feb 01 , 2025 | 04:08 AM
కాలంతో పాటు మేకప్ పోకడలూ మారిపోతూ ఉంటాయి. అలాంటి కొన్ని కొత్త మేకప్ పోకడలు, మెలకువల గురించి తెలుసుకుందాం!
సన్నని కనుబొమలు 90లలో విపరీతంగా ప్రజాదరణ పొందిన గీత గీసినట్టుండే కనుబొమల పోకడ మళ్లీ మేక్‌పలో ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఏ ముఖాకృతికి ఎలాంటి కనుబొమలు నప్పుతాయో తెలియాలంటే, మేకప్ నిపుణులను సంప్రతించాలి. వారి సహాయంతో కనుబొమలను విల్లుల్లా తీర్చిదిద్దుకుని నలుగురినీ ఆకట్టుకోవచ్చు. అలాగే కనుబొమలను దిద్దుకోవడం కోసం నలుపు రంగుకు బదులుగా ముదురు గోఽధుడ రంగు ఐబ్రో పెన్సిల్ ఎంచుకోవాలి.
ఐషాడో ఇలా...
నీలి రంగు ఐషాడో ప్రస్తుత మేకప్ ట్రెండ్. డ్రస్ రంగుకు నప్పేలా అదే రంగు ఐషాడో ఎంచుకునే రోజులు పోయాయి. ప్రత్యేకంగా కనిపించేలా చేసే ‘పేల్ బ్లూ పెర్ల్’, ‘స్మోకీ నేవీ’ రంగులు వాడుకలోకి వచ్చాయి. వీటిలో దేన్ని ఎంచుకున్నా, కనురెప్పలు ఎబ్బెట్టుగా కనిపించకుండా... ఐలైనర్‌లో కలిసిపోయేలా ఐషాడోను పూసుకోవాలి. కనురెప్పలను కిందికి దించినా, పైకి లేపినా కంటి అందం చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవాలి.
లిప్ లైనర్‌తో...
పెదవులకు లిప్‌స్టిక్ పులిమేసుకునే రోజులు పోయి, లైనర్ మీద దృష్టిని పెంచే రోజులు ఇచ్చాయి. లైనర్‌తో పెదవులను అంచులను తీర్చిదిద్ది, పలుచగా లిప్‌స్టిక్ అద్దుకోవడమే తాజా పోకడ. అయితే ఎంచుకునే లిప్ లైనర్ వీలైనంత ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి. పెదవుల అంచుల దగ్గరి నుంచి మొదలుపెట్టి, మధ్య వరకూ లైనర్ గీసుకుని, లేత గులాబీ, పీచ్ రంగు లిప్‌స్టిక్స్ పెదవులకు పలుచగా అద్దుకోవాలి. ’