Healthy Foods for Kids: పిల్లలకు ఇవి తినిపిస్తే..
ABN , Publish Date - Sep 24 , 2025 | 01:14 AM
పెరిగే పిల్లలకు పోషకాహారం తినిపించడం అత్యవసరం. శారీరక, మానసిక ఎదుగుదలతోపాటు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారం గురించి తెలుసుకుందాం...
పెరిగే పిల్లలకు పోషకాహారం తినిపించడం అత్యవసరం. శారీరక, మానసిక ఎదుగుదలతోపాటు పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచే ఆహారం గురించి తెలుసుకుందాం...
పాలకూర, తోటకూర, బచ్చలి కూరల్లో మెదడు కణాలను వృద్ధి చేసే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్లు అధికంగా ఉంటాయి. ఈ ఆకుకూరలను తరచూ తినిపిస్తూ ఉంటే పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.
బ్లూ బెర్రీ, స్ట్రాబెర్రీ, క్రాన్ బెర్రీ, యాపిల్ పండ్లను తినిపిస్తే పిల్లల్లో మెదడు పనితీరు వేగవంతమవుతుంది. చదివిన అంశాలన్నింటినీ పిల్లలు చక్కగా గుర్తుపెట్టుకోగలుగుతారు.
బాదం, వాల్‌నట్స్, పిస్తా, పొద్దు తిరుగుడు గింజలు, గుమ్మడి గింజలను తినిపిస్తే వాటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి ఆవశ్యక పోషకాలు జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదం చేస్తాయి. రోజుకు ఒక కోడిగుడ్డు తినిపించినా ఫలితం ఉంటుంది.
రాజ్మా, పల్లీలు, శనగల్లో ప్రోటీన్లు, పీచు పదార్థాలు, జింక్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చడం వల్ల పిల్లలకు గుర్తుపెట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది.
మాకరెల్, సాల్మోన్, ట్యూనా, సార్డైన్స్ లాంటి చేపలను తినిపిస్తే పిల్లల మెదడు చురుకుగా మారుతుంది. విషయాలను త్వరగా గ్రహించి ఎక్కువ కాలం గుర్తుండేలా చేస్తుంది.
పాలు, పెరుగు, యోగర్ట్, చీజ్ లాంటి పాల ఉత్పత్తుల్లో ‘బి’ విటమిన్ రకాలు ఎన్నో ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడతాయి. దీంతో పిల్లల్లో జ్ఞాపకశక్తి బలపడుతుంది. పిల్లలకు తరచూ డార్క్ చాక్లెట్ తినిపించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.