Travel Tips: యాత్రలకు వెళుతున్నారా..!
ABN , Publish Date - Jan 23 , 2025 | 04:04 AM
శీతాకాలంలో యాత్రలు చేయడం అహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండడం వల్ల అలసట రాదు. ఉత్సాహంగా అనిపిస్తుంది. అయినప్పటికీ కొత్త ప్రదేశాలకు వెళ్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
శీతాకాలంలో అన్ని ప్రాంతాల్లో చలి తీవ్రంగానే ఉంటుంది. చలి నుంచి రక్షణ కల్పించే ఉన్ని దుస్తులు, చేతి తొడుగులు, సాక్స్, క్యాప్ వెంట ఉంచుకోవాలి. అన్నింటినీ రెండు జతలు అదనంగా సిద్దం చేసుకోవడం మంచిది. రాత్రి ప్రయాణమైతే మందంగా ఉండే దుప్పట్లు వెంట తీసుకెళ్లాలి.
చల్లని వాతావరణంలో ప్రయాణిస్తున్నప్పుడు తరచూ కాఫీ, టీ, ఆల్కహాల్ సేవించకూడదు. మితంగా వేడి పాలు తాగవచ్చు. కనీసం గంటకు ఒకసారైనా మంచి నీరు తాగుతూ ఉండాలి. లేదంటే శరీరంలో నిర్జలీకరణ స్థితి ఏర్పడుతుంది.
నీటిని ఎక్కువ సమయం వేడిగా ఉంచే వాటర్ ఫ్లాస్క్‌లు, థర్మల్ ఫ్లాస్క్‌లు, గ్రీన్ టీ ప్యాకెట్లను వెంట తీసుకెళ్లాలి. ప్రయాణం చేస్తూ గ్రీన్ టీ తయారు చేసుకుని తాగడం మంచి అనుభూతినిస్తుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
మంచు కురిసే ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆ వాతావరణంలో కొంతసేపు గడపాలి. అప్పుడే శరీరం ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసుకుంటుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు రావు.
కొత్త ప్రదేశాల్లో కావాల్సిన ఆహారం దొరకకపోవచ్చు. ముందు జాగ్రత్తగా డ్రై ఫ్రూట్స్, గింజలు వెంట తీసుకెళ్లాలి.
పాదాలకు చలి తగలకుండా ఉన్ని సాక్స్‌తోపాటు మడమల వరకూ పూర్తిగా కప్పి ఉంచే షూస్ లేదా కాన్వాస్ షూస్ ధరించాలి. దీంతో పాదాలు వెచ్చగా మారి కీళ్ల నొప్పులు రాకుండా చేస్తాయి.
ప్రయాణం చేసేటప్పుడు చలిగాలులు సోకి చర్మం పొడారిపోతుంది. మాయిశ్చరైజర్, లిప్‌బామ్ వెంట ఉంచుకోవాలి. సూర్యరశ్మి నుంచి కళ్లకు రక్షణ కల్పించే సన్ గ్లాస్ ధరించాలి.
ఫోన్ ఛార్జింగ్‌కి ఇబ్బంది లేకుండా పవర్ బ్యాంక్ తీసుకెళ్లాలి.
వైద్యుని సలహా మేరకు జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి సమస్యలకు సంబంధించిన మందులను వెంట తీసుకెళ్లాలి.